హైదరాబాద్: గత ప్రభుత్వం నుంచి సరైన సహకారం లేనందువల్లే ఎయిర్‌పోర్టు క్లియరెన్స్ ఆలస్యమైందని పౌర విమాయయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. కవాడిగూడలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో కలిసి నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో రామ్మోహన్ నాయుడు ప్రసంగించారు. వరంగల్ ఎయిర్‌పోర్టు క్లియరెన్స్ శుభవార్తను ప్రజలతో పంచుకోవడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. వరంగల్ ఎయిర్‌పోర్టుకు క్లియరెన్స్ రావాలన్నది ఇక్కడి ప్రజల చిరకాల వాంఛ అని అది తన హయాంలో అది జరగడం సంతోషదాయకమని తెలిపారు.
వరంగల్ ఎయిర్‌పోర్టు గతంలో ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్‌పోర్టుగా ఉండేది అని, 1981 వరకూ అక్కడ ఏదో ఒక కార్యకలాపం జరుగుతూ ఉండేది అని ఆయన అన్నారు. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక విమానయాన రంగంలో ఓ విప్లవం మొదలైందని తెలిపారు. గత పదేళ్లలో దేశంలోని ఎయిర్‌పోర్టుల సంఖ్య 79 నుంచి 150 పెరిగిందని తెలియజేశారు. తెలుగు ప్రజల మంత్రిగా పని చేయాలని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తనకు మార్గనిర్దేశనం చేశారని పేర్కొన్నారు. ఎపి కోసం ఎలా పని చేస్తావో, అదే చిత్తశుద్ధితో తెలంగాణ కోసం కూడా పని చేయాలని సూచించినట్లు తెలిపారు. మామునూరు ఎయిర్‌పోర్టు విషయంలో కొన్ని సమస్యలు వచ్చినా.. వాటికి అధిగమించామని తెలిపారు.
ఎయిర్‌పోర్టుకు 2800 మీటర్ల రన్‌వే అవసరమన్నారు. 280 ఎకరాల భూసేకరణ అవసరమని కేంద్ర నుంచి ప్రతిపాదనలు వచ్చామని తెలిపారు. భూసేకరణ పూర్తయిన వెంటనే పనులు ప్రారంభిస్తామని ఆయన స్పష్టం చేశారు.