హైదరాబాద్: వరంగల్ ఎయిర్ పోర్టు తామే తెచ్చామని కిషన్ రెడ్డి అంటున్నారని మరి మెట్రో విస్తరణ రాలేదంటే ఆపింది కిషన్ రెడ్డే కదా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం రాలేదంటే ఆపింది మోదీయే కదా అని దుయ్యబట్టారు. ప్రాజెక్టు వస్తే మోదీ ఖాతాలోనా? రాకపోతే రేవంత్ రెడ్డి ఖాతాలోనా? అని మండిపడ్డారు. తన కంటే చిన్నోడు రాష్ట్రానికి సిఎం అయ్యిండని కిషన్ రెడ్డికి కడుపు మంట అని రేవంత్ విమర్శించారు.
‘‘కిషన్ రెడ్డీ.. మీ దగ్గర మోదీ, ఈడి, సిబిఐ ఉండొచ్చు.. ఎంత కాలం ఈడి,సిబిఐ చూపించి బెదిరిస్తారు? మేం ఎవరికీ భయపడం’’ అని కరాఖండిగా చెప్పారు. తను స్వయంగా కిషన్ రెడ్డికి ఇంటికి వెళ్లా.. కిషనన్నా… ఇవి కావాలని అడిగా నని రేవంత్ తెలిపారు. పాపం.. మోదీ మనకు ఏదో ఒకటి చేయాలనే ఆలోచనలోనే ఉన్నారని పేర్కొన్నారు. మోదీ చేయాలనుకున్నా.. కిషన్ రెడ్డి సైంధవుడిలా అడ్డుపడుతున్నారన్నారు. తన రహస్య మిత్రుడు కెసిఆర్ దిగిపోయాడని కిషన్ రెడ్డి బాధపడుతున్నారని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.