Tuesday, March 4, 2025

ఎల్‌ఆర్‌ఎస్ ప్లాట్లకు క్రమబద్ధీకరణ షురూ…

- Advertisement -
- Advertisement -

ఛార్జీలను ఫిక్స్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
500ల పైచిలుకు గజాల ప్లాట్లకు గజానికి రూ.750లు
50 వేల గజాల పైచిలుకు ప్లాట్లకు 100 శాతం ఫీజు
శుక్రవారం నుంచే అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ట్రయల్న్ ప్రారంభం
శనివారం పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సర్వర్ డౌన్
శంషాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎల్‌ఆర్‌ఎస్ ప్లాట్ల
రిజిస్ట్రేషన్‌లను తనిఖీ చేసిన ఐజీ బుద్ధప్రకాశ్

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఎల్‌ఆర్‌ఎస్ లేని ప్లాట్లను క్రమబద్ధీకరించే ట్రయల్న్ ప్రారంభం అయ్యింది. అనుమతి లేని లే ఔట్‌లలోని రిజిస్ట్రేషన్ కానీ ప్లాట్లకు సంబంధించిన ఎల్‌ఆర్‌ఎస్ ఫీజును చెల్లించగానే వెంటనే రిజిస్ట్రేషన్ అయ్యేలా స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో దానికి ఛార్జీలను నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఓపెన్‌ప్లాట్ విస్తీర్ణం ఆధారంగా ఈ చార్జీలను ఆటోమెటిక్‌గా సిస్టం అప్‌డేట్ చేస్తోంది. ఆ చార్జీలను చెల్లించిన తరువాత క్రమబద్దీకరణ ప్రక్రియ పూర్తి అవుతుంది. 26.08.2020 సంవత్సరంలో ఉన్న ధరలనే ప్రస్తుతం క్రమబద్ధీకరణ చార్జీలుగా చెల్లించాల్సి ఉంటుంది. శుక్రవారం నుంచే ఈ ప్రక్రియను ట్రయల్న్ కింద చాలా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రారంభించారు. అయితే శనివారం కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సర్వర్ డౌన్ కావడంతో ఈ రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియ నిలిచిపోయినట్టుగా తెలిసింది. శనివారం శంషాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ బుద్ధప్రకాశ్ సందర్శించి ఎల్‌ఆర్‌ఎస్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్‌లను ఆయన సబ్ రిజిస్ట్రార్‌ను అడిగి తెలుసుకున్నారు.

100 గజాల లోపు ప్లాట్లకు రూ.200లు

అనుమతి లేని లే ఔట్‌లలో ప్రభుత్వం నిర్ణయించిన ధరలు ఇలా ఉన్నాయి. 100 గజాల లోపు ఉన్న ఓపెన్ ప్లాట్లకు (గజానికి రూ.200లు), 101 గజాల నుంచి 300 గజాల ప్లాట్‌కు (గజానికి రూ.400లు), 301 గజాల నుంచి 500 గజాల ప్లాట్‌కు (గజానికి రూ.600లు), 500ల పైచిలుకు గజాలు ఉన్న ప్లాట్లకు (గజానికి రూ.750లు) క్రమబద్ధీకరణ కింద ప్రభుత్వానికి ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆయా ప్రాంతాలను బట్టి ఈ ధరలు మారుతుంటాయని ప్రభుత్వం సూచించింది.

3 వేల గజాలలోపు ప్లాట్లకు 20 శాతం క్రమబద్ధీకరణ ఫీజు

ఇక అనుమతి లేని లే ఔట్‌లలోని అధిక విస్తీర్ణం ఉన్న ప్లాట్లకు సంబంధించి ధరలను ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా 3 వేల గజాలలోపు ప్లాట్లకు 20 శాతం క్రమబద్ధీకరణ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దీంతోపాటు 3,001 గజాల నుంచి 5 వేల గజాలలోపు ప్లాట్లకు 30 శాతం ఫీజు, 5,001 నుంచి 10,000ల గజాల లోపు ప్లాట్లకు 40 శాతం ఫీజు, 10,001ల నుంచి 20 వేల గజాలలోపు ప్లాట్లకు 50 శాతం ఫీజు, 20,001ల నుంచి 30 వేల గజాలలోపు ప్లాట్లకు 60 శాతం ఫీజును, 30,001 గజాల నుంచి 50 వేల గజాలలోపు ప్లాట్లకు 80 శాతం ఫీజును, 50 వేల గజాల పైచిలుకు ప్లాట్లకు 100 శాతం ఫీజును లే ఔట్ యజమానులు చెల్లించి వాటిని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

33 మాడ్యూల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునేలా…

ఆనధికార లే ఔట్‌లలోని (కటాఫ్ తేదీ నాటికి) ప్లాట్ల క్రమబద్దీకరణ కోసం రిజిస్ట్రేషన్‌ల శాఖ ప్రత్యేక మాడ్యూల్‌ను సిద్ధం చేసింది. ప్లాట్ల రిజిస్ట్రేషన్ సమయంలో ఎల్‌ఆర్‌ఎస్ కోసం ఉచిత దరఖాస్తు, క్రమబద్ధీకరణ ఫీజు చెల్లించేందుకు అవకాశాన్ని కల్పించింది. registration.telangana.gov.in వెబ్‌సైట్‌లో దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు ప్రత్యేక విధి, విధానాలను ప్రభుత్వం ప్రకటించింది. ఈ వెబ్‌సైట్‌లో ఎల్‌ఆర్‌ఎస్ లేని ప్లాట్లకు ఉచిత రిజిస్ట్రేషన్ సదుపాయాన్ని పొందుపరిచింది. ఈ లింకు ద్వారా దరఖాస్తు చేసుకుంటే అవసరమైన ఫీజును ఈ వెబ్‌సైట్ జనరేట్ చేస్తోంది. ఎల్‌అర్‌ఎస్ కింద ఇప్పటికే -దరఖాస్తు చేసినా కొత్తగా చేయాల్సి ఉన్న అన్ని ఓపెన్ ప్లాట్లు (లింకు డాక్యుమెంట్లు ఉన్నవి లేనివి) కొత్త 33 మాడ్యూల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునేలా ప్రభుత్వం సదుపాయం కల్పించింది.

11 శాతం ఓపెన్ స్పేస్ ఛార్జీలు చెల్లించాలి

అనధికార లే ఔట్‌లకు సంబంధించి కటాఫ్ తేదీ (26.08.2020 సంవత్సరం) నాటికి కనీసం పదిశాతం ప్లాట్‌ల విక్రయం జరిగితే, సంబంధిత లే ఔట్ వేసిన స్థిరాస్తి వ్యాపారి ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసినా చేయకున్నా వాటిని కొనుగోలు చేసిన ప్రజలు తాజాగా రిజిస్ట్రేషన్ చేసుకునేం దుకు అర్హులుగా ప్రభుత్వం పేర్కొంది. ఒకవేళ ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకుంటే క్రమబద్ధీకరణ ఫీజుతో పాటు 11 శాతం ఓపెన్ స్పేస్ ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు రిజిస్ట్రేషన్ విభాగం వెబ్‌సైట్‌లో చెక్ పారామీటర్ పేరిట ప్రత్యేక లింకును సైతం పొందుపరిచింది. ఎల్‌ఆర్‌ఎస్- కింద గతంలో దరఖాస్తు చేశారా? లేదా? అన్న వివరాలను కూడా ఈ వెబ్‌సైట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించిన తరువాత ఆ రసీదును డౌన్‌లోడ్ చేసుకోవాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News