అనుమతి లేని అపార్ట్‌మెంట్‌లకు రిజిస్ట్రేషన్‌లు.!
స్పెషల్ ఆడిట్ పేరుతో ఉన్నతాధికారుల బెదిరింపు
సబ్ రిజిస్ట్రార్ల నుంచి అందినకాడికి డిఐజీల వసూళ్లు
అవినీతి ఆరోపణలు వచ్చిన ఓ డిఐజీ
పదవీ విరమణ వయస్సు పెంపు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు
ఆ అధికారి వల్లే తమకు పదోన్నతులు రావడం లేదని
మళ్లీ ఆయనకు ఎక్స్‌టెన్షన్ ఇస్తే ఆందోళన తప్పదని అధికారుల హెచ్చరిక
స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖపై ఐజీ పర్యవేక్షణ కరువు
మనతెలంగాణ/హైదరాబాద్: స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో ఓ డిఐజీకి మరో రెండు సంవత్సరాల పాటు పదవీ విరమణ వయస్సును పెంచేలా ప్రభుత్వానికి ఫైలును పంపించినట్టుగా తెలిసింది. ఈ అధికారి పదవీ విరమణ ప్రస్తుతం రెండు, మూడు నెలలే ఉంది. ఈ నేపథ్యంలోనే తనకు మరో రెండేళ్ల పాటు పదవీ విరమణ వయస్సును పెంచాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్టుగా తెలిసింది. గత సంవత్సరం జరిగిన సబ్ రిజిస్ట్రార్, డిఆర్ల బదిలీల్లోనూ భారీగా అక్రమాలు జరిగాయి. ఈ బదిలీల్లో ఈ డిఐజీ తన అనుచరులకే ముఖ్యమైన స్టేషన్‌లను ఇప్పించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం ఈ డిఐజీ తన పరిధిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్పెషల్ ఆడిట్ నిర్వహించి సబ్ రిజిస్ట్రార్లను బెదిరించి వసూళ్లపర్వం కొనసాగిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తప్పు చేసిన సబ్ రిజిస్ట్రార్లపై చర్యలు తీసుకోవాల్సిన ఈ డిఐజీ వారిని ప్రోత్సహించడంపై ఆ శాఖ అధికారులు మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ అధికారి పదవీ విరమణ వయస్సును పెంచితే ఇంకా పదోన్నతులు రాకుండా ఎన్ని రోజులు ఉండాలని సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన పదవీ విరమణ పెంచితే ఆందోళన చేపడుతామని ఆ శాఖ అధికారులు పేర్కొంటుండడం విశేషం.
పదోన్నతులు రాకుండా చక్రం తిప్పుతున్న
ఇప్పటికే జూనియర్ అసిస్టెంట్ నుంచి సీనియర్ అసిస్టెంట్లకు పదోన్నతి, సీనియర్ అసిస్టెంట్ నుంచి సబ్ రిజిస్ట్రార్లుగా పదోన్నతులు కల్పించాల్సి ఉన్నా మరో డిఐజీతో కలిసి ఈ డిఐజీ పదోన్నతుల ఫైలును తొక్కిపడుతున్నారని ఆ శాఖ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు పదోన్నతులు కల్పించాలని తాము విజ్ఞప్తి చేసినా ఈ ఇద్దరు డిఐజీలే వాటిని అడ్డుకుంటున్నారని ఆ శాఖ అధికారులు పేర్కొంటుండడం విశేషం. చేవెళ్లలో పనిచేసే ఓ సబ్ రిజిస్ట్రార్‌కు ఇప్పటికే డిఐజీ పదోన్నతి రావాల్సి ఉండగా కనీసం ఆయనకు డిఆర్‌గా కూడా పదోన్నతి రాకుండా ఈ ఇద్దరు డిఐజీలు అడ్డుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఫోకల్ పోస్టింగ్ తప్ప వేరే చోటుకు వెళ్లరు….
ప్రస్తుతం రంగారెడ్డి జాయింట్ సబ్ రిజిస్ట్రార్ 2గా (మూసాపేట్‌లో) విధులు నిర్వహిస్తున్న ఓ సబ్ రిజిస్ట్రార్ ఫోకల్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు కార్యాలయం తప్ప వేరే చోట ఆయన పనిచేయరన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో ఆయన మల్కాజిగిరి, ఉప్పల్, శేరిలింగంపల్లిలో పనిచేశారు. శేరిలింగంపల్లి తరువాత ఆయన్ను పరిగి సబ్ రిజిస్ట్రార్‌గా బదిలీ చేస్తే రెండేళ్లపాటు ఆయన సెలవుపై వెళ్లారు. ప్రస్తుతం ఆయన రంగారెడ్డి జాయింట్ సబ్ రిజిస్ట్రార్ 2గా (మూసాపేట్‌లో) విధులు నిర్వహిస్తున్నారు. కనీసం ఉన్నతాధికారులను కూడా ఆయన గౌరవించరని, పోస్టింగ్ కోసం ఆయన రాజకీయ పలుకుబడిని వినియోగిస్తారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన గతంలో చేసిన పలు డాక్యుమెంట్‌లతో పాటు ప్రస్తుతం పనిచేస్తున్న చోట ఆయన చేసిన డాక్యమెంట్‌లపై ప్రభుత్వానికి ఫిర్యాదు అందడం విశేషం. రంగారెడ్డి జాయింట్ సబ్ రిజిస్ట్రార్ 1గా పనిచేస్తున్న ఓ సబ్ రిజిస్ట్రార్‌కు విధులు అప్పగించకుండా ఈ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ 2 చక్రం తిప్పారని దీంతో గ్రేడ్ 1 సబ్ రిజిస్ట్రార్ మనస్థాపంతో లాంగ్‌లీవ్‌పై సెలవుతో వెళ్లారని అక్కడ పనిచేసే ఉద్యోగులు బాహాటంగా పేర్కొంటుండడం విశేషం.
ఏసిబి డిఎస్పీకే తప్పలేదు…
ఇక, ఎల్బీనగర్‌లో పనిచేసే ఓ సబ్ రిజిస్ట్రార్ ఎక్కడ పనిచేసినా వివాదాలకు, అవినీతికి కేరాఫ్‌గా నిలుస్తున్నారు. ప్రస్తుతం ఎల్బీనగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విధుల్లో చేరినప్పటి నుంచి చేయి తడిపితేనే రిజిస్ట్రేషన్లు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య ఏకంగా ఒక ఏసిబి డిఎస్పీని సైతం ఒక రిజిస్ట్రేషన్‌కు సంబంధించి ఎల్బీనగర్ సబ్ రిజిస్ట్రార్ డబ్బులు డిమాండ్ చేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వీరితో పాటు సరూర్‌నగర్, అబ్ధుల్లాపూర్ మెట్, పెద్ద అంబర్‌పేట్‌లో పనిచేసే సబ్ రిజిస్ట్రార్లు కాసుల కోసం ప్రజలను ఫీడిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక, అశోక్‌నగర్‌లో ఉన్న (చిక్కడపల్లి సబ్ రిజిస్ట్రార్)లో ఏకంగా ప్రైవేటు వ్యక్తులదే ఇంకా పెత్తనం కొనసాగుతుండడం విశేషం.
ఎస్‌ఎఫ్‌టి ఆధారంగా లక్ష నుంచి రూ.5 లక్షలు
సర్వే నెంబర్లు వేయకుండా ప్రభుత్వ భూములను, గ్రామకంఠాలకు ఒక రేట్‌ను ఫిక్స్ చేసుకొని, అనుమతి లేని అపార్ట్‌మెంట్‌లలోని ప్లాట్‌లకు వాటి ఎస్‌ఎఫ్‌టి ఆధారంగా లక్ష నుంచి రూ.5 లక్షల వరకు కొందరు సబ్ రిజిస్ట్రార్ వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మేడ్చల్ 1, భువనగిరి, చౌటుప్పల్, బీబీనగర్, కీసర, ఘట్‌కేసర్, ఫరూక్‌నగర్, కల్వకుర్తి, వనపర్తి తదితర ప్రాంతాల్లో పనిచేస్తున్న సబ్ రిజిస్ట్రార్‌లపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడం విశేషం. మరికొన్ని చోట్ల నాలా కన్వర్షన్ లేకుండానే ఈ రిజిస్ట్రేషన్లు జరుగుతుండడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
సికింద్రాబాద్‌లో పనిచేస్తున్న ఓ సీనియర్ అసిస్టెంట్
గతంలో హయత్‌నగర్‌లో ఇన్‌చార్జీ సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేసిన ఓ సీనియర్ అసిస్టెంట్ భారీగా అక్రమాలకు పాల్పడారని గతంలో ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలోనే ఆ సీనియర్ అసిస్టెంట్‌ను సికింద్రాబాద్‌లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి బదిలీ చేశారు. అయినా అక్కడి డాక్యుమెంట్ రైటర్లతో కలిసి అవినీతి దందా అధికంగా చేస్తున్నారని ఆయనపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. రిజిస్ట్రేషన్ వచ్చిన వారు కచ్చితంగా డబ్బులు ఇస్తేనే రిజిస్ట్రేషన్ చేసేలా సంబంధిత సబ్ రిజిస్ట్రార్‌పై ఈ సీనియర్ అసిస్టెంట్ తెస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కొన్ని జిల్లాల డిఐజీలు కూడా ఆడిట్ చేసినా తప్పుడు డాక్యుమెంట్లు చేసిన సబ్ రిజిస్ట్రార్లపై చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తోంది. తప్పు చేసిన సబ్ రిజిస్ట్రార్లను బెదిరించి వారిని తాము కూడా ఆ తప్పులో భాగస్వామ్యం అవుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.