నాటక పోటీలు నిర్వహించి కళాకారులకు అవార్డులు ఇస్తాం
ప్రతి ఏటా అధికారికంగా భక్త రామదాసు జయంతి ఉత్సవాలు
భక్త రామదాసు జయంతి వేడుకల్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
కళలు సమాజ వికాసానికి దోహదపడాలి : బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
మన తెలంగాణ / హైదరాబాద్ : ఉగాది పండుగ నుంచి గద్దర్ సినీ అవార్డులు ఇవ్వనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఎల్.బి స్టేడియంలో నిర్వహించిన భక్త రామదాసు జయంతి వేడుకలను నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ, రోడ్లు భవనాల శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ఈ ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ కళలను ప్రజా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. దశాబ్ద కాలంగా గత ప్రభుత్వం కళాకారులకు నంది అవార్డులు ఇవ్వలేదని గుర్తుచేశారు.
ప్రజా ప్రభుత్వం రాగానే సినిమా కళాకారులను ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ క్రమంలోనే నంది అవార్డులకు గద్దర్ పేరు పెట్టామని, ఈ అవార్డులను ఉగాది పండుగ నుంచి ఇవ్వబోతున్నట్లు స్పష్టం చేశారు. నాటక పోటీలను నిర్వహించి కళాకారులకు అవార్డులు ఇవ్వనున్నట్లు చెప్పారు. కళాకారులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని, కళారంగ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని ఆయన అన్నారు. సినిమా కళాకారులకు పురస్కారాలు ఇచ్చినట్లుగా సంగీత నాటక కళాకారులకు అవార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కళలను ముందుకు తీసుకెళ్లే వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు ప్రజా ప్రభుత్వం కల్పిస్తున్నదని చెప్పారు.
ప్రతి ఏటా అధికారికంగా జయంతి ఉత్సవాలు : కళలను కళాకారులను చిత్తశుద్ధితో ప్రోత్సహిస్తున్న ప్రజా ప్రభుత్వం మనదని, ఇకపై ప్రతి యేటా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భక్త రామదాసుగా పిలవబడే కంచర్ల గోపన్న జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. తమిళనాడు తిరువయ్యుర్ లో యేటా జరిగే త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలు మాదిరిగా ఇక ప్రతి ఏటా తెలంగాణలో వాగ్గేయకారుడు భక్త రామదాసు జయంతి ఉత్సవాలు నిర్వహిస్తామని మల్లు భట్టి విక్రమార్క హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. భక్త రామదాసు జన్మించిన జిల్లా నుంచి తాను ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు చాలా గర్వంగా ఉందన్నారు.
తానీషా పాలనలో తహసీల్దార్ గా ఉన్న కంచర్ల గోపన్న ప్రజల నుంచి వసూలు చేసిన శిస్తు సొమ్ములను పాలకులకు పంపించకుండా శిధిలావస్థలో ఉన్న భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం పునరుద్దరించారని గుర్తు చేశారు. తానీషా ప్రభువు ఆగ్రహానికి గురై భక్త రామదాసు గోల్కొండ కోటలో ఖైదీగా మారిన చరిత్ర మనకు తెలిసిందేనని అన్నారు. ఎన్ని చిత్రహింసలు పెట్టినప్పటికీ తన శ్రీరామ భక్తిని కోల్పోకుండా కీర్తనలు గానం చేసిన గొప్ప భక్తిమయుడు భక్త రామదాసు అని కీర్తించారు. భక్త రామదాసును స్ఫూర్తిగా తీసుకుని సంగీత విద్వాంసులుగా, వాగ్గేయకారులుగా ఎదగాలని మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.
భక్తిరస వాగ్గేయకార సంకీర్తనల ప్రచారం ద్వారా సమాజంలో సేవాభావం పెంపొందుతుందని, భవిష్యత్ తరాలకు అందించాలని ఆయన కోరారు. గత దశాబ్ద కాలపు ప్రభుత్వంలో కళాకారులకు ప్రోత్సాహమే లేదని, ప్రతి యేటా ఇవ్వాల్సిన నంది అవార్డులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేశారని మల్లు భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే కళాకారులను ప్రోత్సహించాలనే లక్ష్యంగా గద్దర్ అవార్డులను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. అలేఖ్య పుంజాల విజ్ఞప్తి మేరకు నాటక రంగంలో రాణిస్తున్న కళాకారులను కూడా ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. నంది నాటకోత్సవాల మాదిరిగా ప్రతి యేటా రాష్ట్ర వ్యాప్తంగా పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరచిన కళాకారులకు అవార్డులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
కళలు సమాజ వికాసానికి దోహదపడాలి : బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
భగవంతుడు ఇచ్చిన కళలను ప్రజలకు పంచి సమాజ వికాసానికి దోహదపడాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. భగవంతుడు అందరికీ కళా ప్రతిభ ఇవ్వలేదని, కొంతమంది అదృష్టవంతులకు మాత్రమే ఆ అవకాశం ఇచ్చారని కోరారు. మంత్రి ధనసరి సీతక్క మాట్లాడుతూ కళాకారులు ఆనందంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉంటుందని, కళాకారులకు ప్రభుత్వం నుంచి మెండుగా ఆశీస్సులు ఉన్నాయని కళాకారులు అందరికీ ఈ విషయం చెప్పమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనను పంపించినట్లు చెప్పారు. అన్ని జిల్లాల నుంచి 600 మంది సంగీత కళాకారులు ఈ ఉత్సవంలో పాల్గొన్నట్లు తెలిపారు. మే 4న త్యాగరాజ స్వామి జయంతిని కూడా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చేస్తున్నదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతున్నట్లుగానే ఆధ్యాత్మికంగా కూడా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలు ప్రొఫెసర్ అలేఖ్య పుంజాల అన్నారు.
సీఎం సూచనల మేరకు భక్త రామదాసు 392వ జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్త రామదాసు జయంతి ఉత్సవాల కోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 26 సంగీత గాన బృందాలు తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు వివరించారు. ప్రముఖ సంగీత విద్వాంసులు పద్మశ్రీ డా. యెల్లా వెంకటేశ్వర రావు, పద్మశ్రీ డా. శోభారాజు, పద్మశ్రీ డి. ఉమా మహేశ్వరి, కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీతలు హైదరాబాద్ బ్రదర్స్ డా. రాఘవాచార్యులు, హైదరాబాద్ సిస్టర్స్ హరిప్రియ, కళాకృష్ణ, కోవెల శాంత, ప్రేమ రామమూర్తి, డా.జయప్రద, శేషులత, మంథా శ్రీనివాస్, నేలకొండపల్లి నుంచి భక్త రామదాసు వారసుడు వెంకట రమణ తదితరులను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఘనంగా సత్కరించారు. 10 గంటల పాటు మొత్తం 26 బృందాలు రామదాసు కీర్తనలు ఆలపించి భక్తిభావంతో ముంచెత్తారు. శ్రీరామ నామంతో ఎల్‌బి స్టేడియం హోరెత్తింది. సాంస్కృతిక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్, సాంస్కృతిక సారధి అధ్యక్షురాలు గుమ్మడి వెన్నెల తెలంగాణ సంగీత నాటక అకాడమీ కార్యదర్శి బి. మనోహర్, ఆర్. వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా ట్యాంక్ బండ్ పై ఉన్న భక్త రామదాసు విగ్రహానికి సంగీత కళాకారులు పూలమాలలు సమర్పించి ఊరేగింపుగా ఎల్ బి స్టేడియంకు చేరుకున్నారు. నవరత్న రామదాసు కీర్తనల గాన గోష్టితో ఆరంభమై శ్రీరామ సంకీర్తనలు గానం చేసి భక్తి రసానంద లోకంలో ముంచెత్తారు.