చివరి లీగ్ మ్యాచ్‌లోనూ గెలుపు
సెమీస్‌లో ఆస్ట్రేలియాతో తలపడనున్న టీమిండియా
దుబాయ్: టీమిండియా స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి దెబ్బకు కివీస్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. సుడులు తిరిగే బంతులతో న్యూజిలాండ్ బ్యాటర్లను తిప్పేశాడు. దీంతో చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 44 పరుగుల తేడాతో గెలుపొంది సగర్వంగా సెమీస్‌కు చేరింది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించి గ్రూప్-ఏ టాపర్‌గా నిలిచిన టీమిండియా సెమీస్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 249 పరుగులు చేసింది.
శ్రేయస్ అయ్యర్(79) హాఫ్ సెంచరీతో రాణించగా.. అక్షర్ పటేల్(42), హార్దిక్ పాండ్యా(45) కీలక ఇన్నింగ్స్ ఆడారు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ(5/42) ఐదు వికెట్లు తీయగా.. కైల్ జెమీసన్, విల్ రూర్కీ, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష ఛేదనకు దిగిన న్యూజిలాండ్ 45.3 ఓవర్లలోనే చాపచుట్టేసింది. లక్షం చిన్నదే అయినా భారత బౌలర్ల ధాటికి కివీస్ బ్యాటర్లు క్రీజులో నిలువలేకపోయారు. కేన్ విలియమ్సన్(81) మినహా మరే బ్యాటర్ రాణించలేదు. వరుణ్ చక్రవర్తీ(5/42) ఐదు వికెట్లతో న్యూజిలాండ్ పతనాన్ని శాసించగా..
హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీసారు. లక్ష్యచేధనలో న్యూజిలాండ్‌కు శుభారంభం దక్కలేదు. ఆరంభంలోనే రచిన్ రవీంద్ర(6)ను అక్షర్ పటేల్ స్టన్నింగ్ క్యాచ్‌తో హార్దిక్ పాండ్యా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన కేన్ మామతో కలిసి విల్ యంగ్ ఆచితూచి ఆడాడు. దాంతో పవర్ ప్లేలో కివీస్ వికెట్ నష్టానికి 44 పరుగులు చేసింది. పవర్ ప్లే ముగిసిన వెంటనే రోహిత్ శర్మ స్పిన్నర్లను బరిలోకి దించి న్యూజిలాండ్‌ను కోలుకోకుండా చేశాడు.