Tuesday, March 4, 2025

సంస్కృతీ సంరక్షకుడు జగదీశ్ మిట్టల్

- Advertisement -
- Advertisement -

ఒక భాష అంతరించిపోతే ఒక జాతి చరిత్ర అంతరించిపోయినట్టే. ఈ సూత్రం కళలు, సాంస్కృతిక రంగాలకు కూడా వర్తిస్తుంది. చిత్ర లేఖనం, పేయింటింగ్స్‌ను పరిశీలిస్తే ఆ నాటి జీవన శైలి మనకు అర్థం అవుతుంది. వివిధ చారిత్రక దశల్లో వచ్చిన పేయింటింగ్స్‌ను ఒక వరుస క్రమంలో గమనిస్తే మనకు ఏకంగా మానవజాతి చరిత్రే బోధపడుతుంది. జగదీష్ మిట్టల్‌ను ఒకసా రి కలిసినా చరిత్రకు చిత్రలేఖనానికీ ఉన్న సంబంధం తెలిసేది.

1925 సెప్టెంబరు 16న ఉత్తరప్రదేశ్‌లోని బులంద్ షహర్‌లో పుట్టిన జగదీష్ మిట్టల్ ఈ ఏడాది జనవరి 7న హైదరాబాద్‌లో చనిపోయా రు. బాల్యం నుండే చిత్రకళ మీద ఆసక్తి పెంచుకు న్న జగదీష్ మిట్టల్ శాంతినికేతన్‌లో చేరి ప్రముఖ చిత్రకారుడు నందలాల్ బోస్ దగ్గర ఆ రంగంలో నైపుణ్యం సాధించారు. అక్కడే తన సహ విద్యార్థి, చిత్రకారిణి కమలను పెళ్ళి చేసుకున్నారు.
స్వాతంత్య్ర సమర యోధుడు, కార్మిక నాయకుడు అయిన బద్రీ విశాల్ పిట్టి 1950లలో జగదీష్ మిట్టల్‌ను హైదరాబాద్‌కు ఆహ్వానించి స్థాని క కళాకారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అప్పటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు కూడా పాలుపంచుకున్నారు. హైదరాబాద్ వాతావరణం, హైదరాబాదీల ఆతిథ్యం, హైదరాబాద్ సాంప్రదాయం అన్నీ నచ్చి హైదరాబాద్‌ను తన శాశ్వత నివాసంగా మార్చుకున్నారు జగదీష్. దోమల్‌గూడలోని గగన్ మహల్ ఎనిమిదవ వీధిలో ఆయన నివాసం ఉంది.

Jagadish Mittal save cultural

స్వతహాగా చిత్రకారులైన జగదీష్, కమల మిట్టల్ క్రమంగా కళాకృతుల సేకర్తలుగా మారిపోయారు. మనం చిత్రకారులుగా కొన్ని చిత్రాల్ని మాత్రమే వేయగలం. మన వ్యక్తిగత అభిరుచులకు ఒక రూపం ఇవ్వగలం. అది మనకు సంతృప్తిని ఇస్తుంది. కళ పరిధి అంతకన్నా విస్తారమైనది. మానవాళి చరిత్రను చరిత్రకారులు నమోదు చేస్తారు. మానవాళి అభిరుచుల్ని చిత్రకారులు నమోదు చేస్తారు అనేది ఆయన భావన. ఒక చిత్రకారునిగా ఎదగ డం వ్యక్తిగత విజయం అవుతుందనే జగదీశ్ మిట్టల్, మానవ జాతి చరిత్రను కళాకృతుల రూపంలో భావితరాలకు అందించడం ఒక గొప్ప సామాజిక బాధ్యత అవుతుందనేవారు. భావితరాలు తమ జాతి చరిత్రను తెలుసుకోవడానికి కళాకృతుల్ని భద్రపరచాలని వారు భావించేవారు.

గొప్పవాళ్ళతో మాట్లాడడం ఎప్పుడూ ఒక జ్ఞానమే. జగదీశ్ మిట్టల్‌ను కలవడం అంటే చరిత్రను, కళా సాంప్రదాయాల్నీ తెలుసుకోవడమే. తూర్పు చాళుక్యులు, పశ్చిమ చాళుక్యుల శిల్పకళారీతులు, చిత్రకళలో దక్కని సాంప్రదాయం, కుతుబ్ షాహీలు, నిజాం ఆర్ట్, మొఘల్ ఆర్ట్, అరేబియన్ ఆర్ట్, కళల్లో అరేబియన్ నైట్స్ ప్రభావం, చైనీస్ డ్రాగన్ ప్రభావాల గురించి వారు మాట్లాడుతుంటే ఆయనొక చిత్రకారుడిగా గాక ఒక గొప్ప చరిత్రకారునిగా కనిపించేవారు. ఆయన చిత్రలేఖనంలో చరిత్రను, చరిత్రలో చిత్రలేఖనాన్ని మాట్లాడేవారు. రెండు రంగాల్లోనూ ఆయనకు గొప్ప నైపుణ్యం ఉండేది.

జగదీష్ – కమల మిట్టల్ దంపతులు కొన్ని వందల కళాకృతుల్ని సేకరించి భద్రపరిచారు. నిండా నూరేళ్ళు బతికిన జగదీష్ మిట్టల్ చివరిక్షణం వరకూ కళాకృతుల సేకరణకే అంకితమయ్యారు. “జగదీశ్ అండ్ కమలా మిట్టల్ మ్యూజియం ఆఫ్ ఇండియన్ ఆర్ట్‌” పేరిట ఒక మ్యూజియాన్ని సొంత ఖర్చులతోనే ఏర్పాటు చేశారు. భారత్‌కు చెందిన అమూల్యమైన కళాఖండాలు, ప్రపంచంలో మరేచోటా లేనటువంటి భారతీయ కళాకృతులు జగదీశ్ అండ్ కమలా మిట్టల్ మ్యూజియం ఆఫ్ ఇండియన్ ఆర్ట్‌లో ఉన్నాయి. క్రీస్తు పూర్వం మొదటి శతాబ్దానికి చెందిన కళాకృతుల నుండి 19వ శతాబ్దపు చిత్రలేఖనాల వరకు అనేక కళాఖండాలు ఇక్కడ ఉన్నాయి.

ఈ మ్యూజియం గురించి స్థానికులకు తెలిసిన దానికన్నా ప్రపంచానికి తెలిసిందే చాలా ఎక్కువ. ఈ కళాఖండాలను దర్శించడానికి వివిధ దేశాల నుండి ఎందరో కళాభిమానులు హైదరాబాద్ వస్తుంటారు. అలా వచ్చిన సందర్శకుల్లో నోబెల్ బహుమతి గ్రహీతలే 22 మంది ఉన్నారంటే ఈ మ్యూజియం గొప్పతనాన్ని అర్థం చేసుకోవ చ్చు. భారతీయ చిత్రకళ మీద అంతర్జాతీయ ఎగ్జిబిషన్లు జరిగినప్పుడల్లా సందర్శకులలో జగదీశ్ మిట్టల్ పేరు తప్పకుండా వినిపిస్తుంది. ప్రపంచం లోని ప్రతి పేయింటింగ్ మీద జగదీష్ మిట్టల్ వ్యాఖ్యానానికి ఒక ప్రత్యేక విలువ ఉండేది.

జగదీశ్ మిట్టల్ సృష్టించిన పేయింటింగ్స్ హైదరాబాద్‌లోని స్టేట్ మ్యూజియం, సాలార్‌జంగ్ మ్యూజియంలతో పాటు జాతీయ స్థాయిలోనే గాక విదేశాల్లోని మ్యూజియంలలోనూ ప్రదర్శించారు. చివరి రోజుల్లో ల్యాండ్ స్కేప్ పేయింటింగ్స్ మీద ఎక్కువగా అధ్యయనం సాగించారు మిట్టల్. అది గొప్ప మానసిక ప్రశాంతతను ఇస్తుందనేవారు. జగదీశ్ మిట్టల్ సమాజాన్ని పూర్తిగా పాజిటివ్ దృక్పథంతో చూసేవారు. సమాజంలోని కులవ్యవస్థ చిత్రకళలో ప్రతిబింభిస్తుందని వారికి తెలుసు. ముఖ్యంగా, తెలంగాణలో ఒక కుగ్రామమయిన చేర్యాలలో (సిధ్ధిపేట- జనగాం మార్గంలో ఉంది) పుట్టిన స్క్రోల్ ఆర్ట్‌లో కులం మరీ స్పష్టంగా కనిపిస్తుందని వారు వివరించేవారు. అయితే, కళారంగంలో కులవ్యవస్థ మీద శ్రామిక కులాల ధిక్కారం, తిరుగుబాట్లను వారు పట్టించుకోలేదు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1974లో “మిడియవల్ హిస్టరీ ఆఫ్ దక్కన్‌” అనే ఓ బృహత్తర పుస్తకా న్ని ప్రచురించింది. అందులో “దక్కనీ పెయింటిగ్స్‌” అనే అధ్యాయాన్ని జగదీశ్ మిట్టల్ రాశారు. జగదీశ్ మిట్టల్ దాదాపు రెండు వేల కళాకృతుల్ని సేకరించారు. తాము సేకరించిన కళాకృతులన్నిం టి ఫొటోలు తీయించి, వాటి ప్రత్యేకతల్ని వివరిస్తూ ఒక గొప్ప గ్రంథాన్ని ప్రచురించారు. 2007లో వచ్చిన ఈ గ్రంథం పేరు “Sublime delight through works of Art from Jagadish Mittal and Kamala Mittal”. కళా రంగంలో అదొక గొప్ప ఆవిష్కరణ.

హైదరాబాద్, ముంబాయి, ఢిల్లీ, కలకత్తాల్లోనేగాక లండన్, న్యూయార్క్ మాన్ హట్టన్, ప్యారిస్ నగరాల్లోనూ కళాప్రియులు జగదీశ్ మిట్టల్‌ను సన్మానించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. లండన్‌లోని ‘విక్టోరియా అండ్ అల్బర్ట్ మ్యూజి యం’, న్యూయార్క్‌లోని ‘మెట్రోపాలిటన్ మ్యూజియమ్ ఆఫ్ ఆర్ట్’ తదితర ప్రపంచ విఖ్యాత మ్యూజియంలలో ఆయన సన్మానాలు అందుకున్నారు. భారత ప్రభుత్వం 1990లో జగదీశ్ మిట్టల్‌కు పద్మశ్రీ అవార్డు ప్రదానం చేసింది.

సన్మానాలు అవార్డుల కన్నా తన తరువాత ఈ కళాకృతుల్ని ఎవరు సంరక్షిస్తారు అనే ఆవేదన మిట్టల్ దంపతులకు ఉండేది. 1993లో కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ మూడులో మ్యూజియం నిర్మాణానికి స్థలాన్ని కేటాయించాలనే ఒక ప్రతిపాదన ముందుకు వచ్చింది. 1994 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోవడంతో ఆ కదలికలన్నీ ఆగిపోయాయి. ఇప్పుడయినా ప్రభుత్వాధినేతలు ఆ మ్యూజియం ప్రాజెక్టును చేపట్టి పూర్తిచేస్తే ఆ కళాకారునికి నిజమయిన నివాళి ఇచ్చినట్టు వుం టుంది.
ఉషా యస్ డానీ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News