Tuesday, March 4, 2025

ఓ నాయకా! నా నాయకా!

- Advertisement -
- Advertisement -

ఓ దళసారథీ
నా నాయకా!
మన భయానక యాత్ర ముగిసింది
మన ఓడ ప్రతి బండరాయిని ఎండగట్టింది
మనం కోరుకున్న బహుమతి పొందాము
ఓడరేవు చాలా చేరువలో ఉంది
గంటల గణగణ ధ్వానాలు
నా చెవిన పడుతున్నవి
ప్రజలు ఉల్లాసంగా ఊగిపోతున్నరు
మన భయంకరమైన సాహసోపేత
నిబ్బర పడవ ప్రయాణాన్ని
కేరింతలతో స్వాగతిస్తున్నరు..

కానీ,
అయ్యో ! అయ్యయ్యో! ఇదేమిటి?
శీతల మృతప్రాయపు సారధి దేహ వేదిక మీద
ఎక్కడివీ ఎర్రెర్రని రుధిర ధారలు?

ఓ నాయకా! నా సారథీ!
లే, ఆ ఘంటారావాలు విను
లే, ఆ పతాక నీ కోసం ఎగురుతోంది
లే, ఆ ఢమరుకం నీ కోసం ధ్వనిస్తోంది

నీ కోసం
రకరకాల పూల గుత్తులు
రంగు రంగుల రిబ్బనులు
దండలుగా మారుతున్నవి
నీ కోసం
తీరాలు జనసంద్రాలై ఉప్పొంగుతున్నవి
ఉత్సుకత నిండిన ముఖాలతో
ఊగిపోతున్న జనం నిన్ను పిలుస్తున్నారు.

ఓ నా దళపతీ! ఓ ప్రియమైన నాయకా!
నీ శీతల మృతదేహపు శిరస్సు కింద
నా చేయి వేయి కలలు కంటోంది

నా సారథి నుండి స్పందన లేదు
పెదాలు పాలిపోయి స్తంభించినవి
అతను నా చేతి స్పర్శ అనుభూతిని
పొందలేకున్నడు
నిజానికి అతని జీవనాడి ఆడడం లేదు

ఓడ క్షేమంగా లంగరు వేయబడింది
దాని సముద్ర యానం ముగిసింది
భయానక యాత్ర ముగించి
నిర్ధేశిత లక్ష్యాల ఛేదించి
జయకేతన నావ తీరం చేరింది

ఓ తీరమా! కేరింతలు వేయి
ఓ ఢమరుకమా ఘనంగా మ్రోగు
నేను మాత్రం దఃఖభారంతో నడుస్తున్నాను
నా సారథి శీతల మృత కాయం వైపు.

ఓ క్యాప్టెన్! మై క్యాప్ట్‌న్-వాల్ట్ వైయిట్మాన్
కవిత స్వేచ్ఛానువాదం డా.కాసుల లింగారెడ్డి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News