దుబాయ్: ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీలో దూసుకుపోతుంది. ఇప్పటికే బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లపై విజయం సాధించిన భారత్.. ఆదివారం న్యూజిలాండ్‌ను కూడా చిత్తుగా ఓడించి టేబుల్ టాప్‌లో నిలిచింది. అయితే న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో కివీస్‌ను గెలిపించేందుకు స్టార్ ఆటగాడు కేన్ విలియమ్‌సన్ చాలా కష్టపడ్డాడు. లక్ష్య చేధనలో ఇతర బ్యాట్స్‌మెన్లు తడబడుతున్న.. అతను మాత్రం పట్టువదలకుండా బ్యాటింగ్ చేశాడు.
విలియమ్‌సన్ అలాగే బ్యాటింగ్ చేసి ఉంటే.. న్యూజిలాండ్ గెలిచే అవకాశాలు ఉండేవి. కానీ, అక్సర్ పటేల్.. ఆ అవకాశం కివీస్‌కి ఇవ్వలేదు. తన బౌలింగ్‌లో విలియమ్‌సన్‌ని ఔట్ చేసి.. భారత జట్టుకు ఊరట కలిగించాడు. అయితే ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అక్సర్.. విలియమ్‌సన్ వికెట్ తీయగానే అందరూ వచ్చి అతన్ని అభినందిస్తున్నారు. కానీ, విరాట్ కోహ్లీ మాత్రం కాస్త డిఫరెంట్‌గా అక్సర్‌ని మెచ్చుకున్నాడు. కోహ్లీ, ఏకంగా అక్సర్ కాళ్ల మీద పడి దండం పెట్టబోయాడు. వెంటనే అక్సర్ కూడా కిందకు ఒంగి అతన్ని ఆపాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.
కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేయగా.. కివీస్ 45.3 ఓవర్లలో 205 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ విజయంతో భారత్ మొదటి సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాతో, న్యూజిలాండ్ రెండో సెమీఫైనల్‌లో సౌతాఫ్రికాతో తలపడనున్నాయి. ఈ రెండు మ్యాచుల్లో గెలిచిన జట్లు ఫైనల్‌లో తలపడతాయి..