Tuesday, March 4, 2025

రోహిత్ బరువుపై కాంగ్రెస్ నేత అనుచిత వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

టీం ఇండియా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రోహిత్ శర్మ జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు. గత ఏడాది టి-20 ప్రపంచకప్‌ను కూడా అతని సారథ్యంలోనే భారత్ అందుకుంది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ అంతగా రాణించలేకపోయాడు. 17 బంతులు ఎదురుకొని కేవలం 15 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై ఓ కాంగ్రెస్ నేత అనుచిత వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలు ఎదురుకుంటున్నారు. రోహిత్ శర్మ ‘లావుగా ఉండే క్రీడాకారుడు’ అంటూ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి షమా మహమద్ విమర్శించారు. అతను బరువు తగ్గాలని.. భారత కెప్టెన్‌లలో అత్యంత ఆకట్టుకోని సారథి రోహిత్ అంటూ ఆమె ట్వీట్ చేశారు.

అయితే ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. బిజెపి నేతలు షమాపై మండిపడుతున్నారు. క్రీడాకారులను కూడా వదలడం లేదని రాజకీయాల్లో విఫలమైన తమ నేత రాహుల్ గాంధీ ఇప్పుడు క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నారేమో అని బిజెపి అధికార ప్రతినిధి ప్రదీప్ బండారి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అయితే ఆ తర్వాత షమా మహమద్ వివరణ ఇచ్చుకున్నారు. తాను కేవలం సాధారణ కోణంలోనే చెప్పాను అని.. గత కెప్టెన్లు.. కపిల్ దేవ్, ధోనీ, కోహ్లీలతో పోలిస్తే.. రోహిత్ తక్కువ ఆకర్షనీయంగా ఉన్నాడు అని అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో తమకు మాట్లాడే హక్కు లేదా అని ఆమె ప్రశ్నించారు.

దీనిపై కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించింది. షమా మహమద్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగతమని.. దీనికి పార్టీతో ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. ఆమె చేసిన పోస్ట్‌లను వెంటనే డిలీట్ చేయాలని ఆదేశించినట్లు పార్టీ సీనియర్‌ నేత పవన్‌ ఖేడా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దేశ క్రీడాకారులను తమ పార్టీ గౌరవిస్తుందని.. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు మళ్లీ చేయకుండా ఉండాలని షమాకు సూచించామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News