Tuesday, March 4, 2025

ఒక నెల పసి బాలునిపై కిరాతకం

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్ : ఒడిశాలోని నవరంగ్‌పూర్ జిల్లాలో ఒక వ్యాధి చికిత్స నిమిత్తం ఒక నెల వయస్సు ఉన్న పసిబాలునిపై వేడి ఇనుప కడ్డీతో దాదాపు 40 సార్లు వాతలు పెట్టారని, దీనితో ఆ బాలుని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారని అధికారులు సోమవారం వెల్లడించారు. ఆ బాలుడు నవరంగ్‌పూర్ జిల్లా చందాహండి బ్లాక్‌లోని గంభారిగూడ పంచాయతీ పరిధిలోని ఫుండెల్‌పాడ గ్రామ వాసి. అతనిని చికిత్స కోసం ఉమెర్‌కోట్ సబ్ డివిజనల్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిని సందర్శించిన నవరంగ్‌పూర్ ముఖ్య జిల్లా వైద్యాధికారి (సిడిఎంఒ) డాక్టర్ సంతోష్ కుమార్ పాండా ఆ శిశువు ఆరోగ్య స్థితి ఇప్పుడు స్థిరంగా ఉందని తెలియజేశారు.

‘బాలుని పొట్ట మీద, తలపైన దాదాపు 30 నుంచి 40 వరకు వాతలు ఉన్నాయి. ఒక శిశువును కనుక వేడి లోహంతో వాతలు పెట్టినట్లయితే అతనికి వ్యాధులు నయం అవుతాయనే మూఢనమ్మకం ఒకటి ఉన్నది’ అని ఆయన చెప్పారు. బాలునికి పది రోజుల క్రితం జ్వరం వచ్చిందని, శరీర ఉష్ణోగ్రత బాగా అధికంగా ఉందని, అతను విపరీతంగా ఏడుస్తున్నాడని డాక్టర్ తెలిపారు. బాలుడు ఏదో దుష్ట శక్తి ప్రభావానికి గురయ్యాడని కుటుంబ సభ్యులు విశ్వసించారని, వైద్య సహాయం కోరడానికి బదులు కుటుంబం అతనికి నయం అవుతుందనే నమ్మకంతో వేడి కడ్డీతో 30, 40 సార్లు వాతలు పెట్టారని సిడిఎంఒ వివరించారు.

వాతలు పెట్టడంతో బాలుడు తీవ్ర అస్వస్థతకు గురైనప్పుడు అతనిని ఉమెర్‌కోట్ ఆసుపత్రిలో చేర్పించారని, అటువంటి పద్ధతులు మారుమూల ప్రాంతాల్లో చాలా కాలంగా కొనసాగుతున్నాయని సిడిఎంఒ తెలిపారు. చందాహండి బ్లాక్‌పై దృష్టి కేంద్రీకరించి, వేడి కడ్డీతో వాతలు పెట్టే బదులు పిల్లలను చికిత్స కోసం ఆసుపత్రులకు తీసుకువెళ్లేలా ప్రజల్లో చైతన్యం కలిగించాలని ఆరోగ్య శాఖ నిర్ణయించినట్లు కూడా సిడిఎంఒ తెలియజేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News