మన తెలంగాణ/నాగర్‌కర్నూల్ ప్రతినిధి ః ఎస్‌ఎల్‌బిసి టన్నెల్ ప్రమాదం జరిగి పది రోజులు పూర్తి కావడం…సహాయక చర్యలకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతూ ఉండడం హై రిస్క్…! హై టెన్షన్..! వాతావరణం నెలకొంది. ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గంట పాటు రెస్కూ ఆపరేషన్ చేపడుతున్న బృందాల ప్రతినిధులతో విస్తృత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించా రు. తదనంతరం జరిగిన విలేకరుల సమావేశం లో సిఎం మాట్లాడుతూ ఒక ప్రమాదంలో తొందరపాటు చర్యలకు పోయి మరో ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడం ఎందుకన్న భావనను వ్యక్తం చేశా రు. ప్రస్తుతం పది రోజులుగా అహర్నిశలు సొరంగంలో చిక్కుకున్న వారిని కాపాడడానికి శ్రమిస్తు న్న వారికి చిన్న గాయం కూడా కాకూడదన్న సం కల్పంతో ముందుకు పోతున్నట్లు వివరించారు. అవసరమైతే టన్నెల్‌లో చిక్కుకున్న వారిని కాపాడడానికి
రోబోల సహాయమైనా తీసుకుంటాం కానీ రెస్కూ సిబ్బందిని రిస్కులో వేయకూడదని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. సహాయక బృందాలకు సొరంగంలో పరిస్థితిలు అనుకూలంగా లేకపోవడం సొరంగంలో చిక్కుకున్న వారి కుటుంబాలలో హైటెన్షన్ నెలకొందని చెప్పవచ్చు. సొరంగం కూలిన జీరో పాయింట్ వద్ద ప రిస్థితులు దారుణంగా ఉన్నట్లు తెలుస్తోంది. పది రోజులుగా శ్రమిస్తున్న కార్మికులకు ఎస్‌ఎల్‌బిసి సొరంగంలోని పరిస్థితులు అంతుచిక్కకుండా ఉ న్నాయి. తట్టెడు మట్టిని తీయడానికి కదిలిస్తే అం తే మోతాదులో సొరంగం పైకప్పు భాగం నుంచి మట్టి కూలుతుండడంతోరెస్కూ ఆపరేషన్‌కు ప్రధాన అడ్డంకిగా మారిందని చెప్పవచ్చు. సహాయక చర్యలకు వెళ్లిన కార్మికులు వారికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతినిధులు ముట్టుకుంటే మరో ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడం అవుతుందని, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చినట్లు సమాచారం.
జిపిఆర్ గుర్తించింది కన్వేయర్ బెల్ట్ శిథిలాలు
సొరంగంలో ప్రమాదం జరిగిన సమయంలో కన్వేయర్ బెల్ట్ కూడా పూర్తిగా ధ్వంసమైంది. ఆ సమయంలో మట్టి శిథిలాల మధ్య బెల్ట్ ధ్వంసమై పడిన దృశ్యాలను రాడార్ గుర్తించిందని తెలుస్తోంది. సహాయక బృందాలు తవ్విన సమయంలో ఇనుము, కన్వేయర్ బెల్ట్ శిథిలాలు బయటపడినట్లు విశ్వసనీయ సమాచారం మేరకు తెలిసింది. ఇదిలా ఉండగా రాడార్ ఇప్పటివరకు గుర్తించింది సొరంగంలో చిక్కుకున్న వారి మృతదేహాలు కావని స్పష్టమవుతోంది.
సంఘటన రోజు పరిణామాలపై దృష్టి పెట్టాలి
ఫిబ్రవరి 22వ తేదీన ఎస్‌ఎల్‌బిసి సొరంగం కూలిన రోజు ఉదయం 8.30కు జరిగిన సంఘటనపై సహాయక బృందాలు, అధికారులు దృష్టి పెట్టాలి. మొత్తం 50 మంది కార్మికులు, టెక్నీషియన్‌లు సొరంగంలోకి వెళ్లిన తరుణంలో పనులకు ఉపక్రమించగా 8 మంది టిబిఎం వద్ద ఉన్నారు. టిబిఎం వద్ద ఉన్నవారే మిగతా 42 మందిని తమ వైపు రావద్దని, సొరంగంలో మట్టి కూలుతుందని హెచ్చరించిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ సమయంలో టిబిఎం వద్ద ఉన్న వారు అప్రమత్తమై ఉండి ఉంటే వారంతా కలిసికట్టుగా ఒకేచోటికి ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఒక మూలగా దాగి ఉంటారని లేదా టిబిఎం చుట్టూ ఉన్న మట్టిపెళ్లలు పడకుండా కాపాడుకోవడం కోసం తల దాచుకుని ఉండి ఉంటారన్న కోణంలో కూడా దృష్టి పెట్టాలి. ప్రస్తుత పరిస్థితుల్లో రాడార్ ద్వారా ఎంత ప్రయత్నించినా సొరంగంలో చిక్కుకున్న వారి ఆచూకీ దొరకడం లేదంటే ఖచ్చితంగా వారు టిబిఎంను అనుసరించి తలదాచుకుని ఉంటారనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈ కోణంలో కూడా సహాయక బృందాలు దృష్టి పెట్టాల్సి ఉంది. టిబిఎంపై కూడా మట్టి పేరుకుపోవడంతో రాడార్‌కు సిగ్నల్స్ చిక్కకపోవడం కూడా దాని పనితీరుపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
రోబోల ప్రస్తావనతో మరింత ఆందోళన
సొరంగంలో చిక్కుకున్న వారిని కాపాడడానికి రోబోల సహాయం తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్‌ఎల్‌బిసి పర్యటన అనంతరం విలేకరులకు తెలిపారు. దీనిని బట్టి చూస్తే మనుషులు అక్కడికి వెళ్లి పని చేసే పరిస్థితులు కనిపించడం లేదని స్పష్టమవుతోంది. ఇదే విషయాన్ని సమీక్షలో సహాయక బృందాల ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించినట్లు స్పష్టమవుతోంది. అందుకే ముఖ్యమంత్రి రెస్కూను రిస్క్‌లో పడేయడం భావ్యం కాదని భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. కాగా, సొరంగంలో చిక్కుకున్నవారు ప్రాణాలతో బయటపడడం అనేది జరిగితే అది ఒక మిరాకిల్‌గా భావించాల్సి ఉంటుంది. సొరంగంలో కూలిపోయిన 12 కిలోమీటర్ల లోపు ఓపెన్ టన్నెల్‌లో శ్వాసకు ఇబ్బందులు ఎదురవుతున్న తరుణంలో మట్టిలో కూరుకుపోయిన వారికి ఆక్సిజన్ అందడం ప్రశ్నార్థకంగా మారింది. వారు మట్టిలో కూరుకుపోయినట్లు సహాయక బృందాలు ఒక అంచనాకు వచ్చినా.. అది పూర్తి అంచనా కాదని సిఎం స్పష్టం చేశారు.
నీరు, ఆహారం లేకుండా ఆక్సిజన్ అందితే పది నుంచి 15 రోజులు వరకు బతికే అవకాశాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. అయితే, ఎస్‌ఎల్‌బిసి సొరంగంలో పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి. నీటి ఊట అధికంగా ఉండడం, మట్టి మొత్తం తడిసి ముద్దగా ఉండడం, సొరంగంలో చిక్కుకున్నవారు చలికి తట్టుకునే పరిస్థితులు కూడా ఒక రోజుకు మించి ఉండబోవని వైద్యులు చెబుతున్నారు. ఈ నిర్ధారణకు వచ్చిన తర్వాతే చిక్కుకున్నవారు కచ్చితంగా చనిపోయి ఉంటారని భావిస్తున్న కార్మికుల కుటుంబాల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఖరాఖండీగా చెప్పడం లేదని స్పష్టమవుతోంది. జరిగిన నష్టం ఎలాగో జరిగిపోయింది..మళ్లీ కొత్త నష్టాన్ని కొని తెచ్చుకోకుండా పకడ్భందీ ప్రణాళికతో రక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వం సహాయక బృందాల ప్రతినిధులు భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
పదవ రోజు కొనసాగిన రెస్కూ
ఎస్‌ఎల్‌బిసిలో ప్రమాదం జరిగి సోమవారానికి పది రోజులు పూర్తయింది. ముఖ్యమంత్రి పర్యటించి వెళ్లిన మరుసటిరోజు కూడా 11 రెస్కూ బృందాలు సొరంగ మార్గంలో షిఫ్టుల వారీగా సహాయక చర్యలు చేపట్టారు. ప్రధానంగా రాడార్స్ ద్వారా చిక్కుకున్న వారిని గుర్తించే పనిని యధావిధిగా కొనసాగిస్తున్నారు. మరొక ఇనుప విడుదలను గ్యాస్, ప్లాస్మా కటింగ్ విధానంతో తొలగిస్తున్నారు. అనుమానం ఉన్నచోట మట్టిని తవ్వుతూ శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారా కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
కన్వేయర్ బెల్ట్ కీలకం
ఎస్‌ఎల్‌బిసి సొరంగ నిర్మాణంలో కన్వేయర్ బెల్ట్ పాత్ర కీలకమైంది. టన్నెల్ బోరింగ్ మెషిన్ తవ్విన మట్టిన 13 కిలోమీటర్ల మేర బయటకు తరలించేందుకు కన్వేయర్ బెల్ట్ ప్రధాన భూమికను పోషిస్తోంది. ప్రమాద ఘటన నేపథ్యంలో కూడా ఈ బెల్టే ప్రధానం కావడం విధితమే. ప్రమాదం జరిగిన రెండవ రోజే కన్వేయర్ బెల్ట్ ప్రాధాన్యతను ‘మన తెలంగాణ’ దినపత్రిక ద్వారా పాఠకులకు తెలియజేసిన విషయం తెలిసిందే. ఈ బెల్ట్ ద్వారానే వ్యర్థాలను సైతం బయటకు పంపే వీలుంటుందని, మంగళవారం నాటికి కన్వేయర్ బెల్ట్ మరమ్మతులు పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కన్వేయర్ బెల్ట్ అందుబాటులోకి వస్తే రెండు రోజులు సొరంగంలో ఉన్న వ్యర్థాలను బయటకు పంపడం జరుగుతుంది. ఆ తర్వాత రెస్కూ ఆపరేషన్ పకడ్భందీగా చేపట్టడానికి సొరంగంలో యంత్రాలు ఇతర పరికరాలను సమకూర్చడానికి వీలుంటుంది.
రెస్కూ నిరంతర ప్రక్రియ
సొరంగంలో చిక్కుకున్న వారిని కాపాడడానికి రెస్కూ ఆపరేషన్ నిరంతరాయంగా కొనసాగిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించిన సందర్భంగా తెలిపిన విషయం విధితమే. అవసరమైతే రోబోలు, ఇతర చర్యలు కూడా చేపట్టడానికి వెనుకాడబోమని స్పష్టం చేసిన విషయం విధితమే. ప్రస్తుతం జరుగుతున్న సహాయక చర్యలను బట్టి చూస్తే మరో నాలుగు రోజుల్లో రెస్కూను పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.