Tuesday, March 4, 2025

మండలి కోసం మస్తు పోటీ

- Advertisement -
- Advertisement -

ఎంఎల్‌ఎ కోటా ఎంఎల్‌సి స్థానాల
కోసం కాంగ్రెస్‌లో పోటాపోటీ
అధికారపక్షం గెలిచే నాలుగు
స్థానాల కోసం 20మంది పోటీ
మిత్ర ధర్మం ప్రకారం కనీసం ఒక్కొక్క
సీటైనా ఇవ్వాలంటున్న సిపిఐ, టిజెఎస్
ఐదు స్థానాలకు నోటిఫికేషన్
10వరకు నామినేషన్ల దాఖలు
20న పోలింగ్, అదే రోజు కౌంటింగ్

మన తెలంగాణ/హైదరాబాద్: ఎం ఎల్‌ఎ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. నోటిఫికేషన్ వెలువడటం తో అధికార కాంగ్రెస్ పార్టీలోని ఆశావ హులు జోరుగా ప్రయత్నాలు చేస్తున్నా రు. వివిధ సందర్భాల్లో ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని హామీ దక్కించుకున్నవారు ఈసారి గట్టి ప్రయత్నాలు చేస్తుండగా, ఈ ఎమ్మెల్సీలో తమకు ఓ అవకా శం ఇవ్వాలని కాంగ్రెస్ మిత్ర పక్షాలు సైతం కాంగ్రెస్‌పై ఒత్తిడి తెస్తున్నాయి. తాజాగా మిత్రపక్షాలు ఒకవైపు, పార్టీ ఆశావహులు ఒకవైపు పిసిసి అధ్యక్షుడిని, సిఎం రేవంత్‌లపై ఒత్తిడి తెస్తున్నట్టుగా సమాచారం. అయితే, పార్టీ ఆశావహుల్లో సుమారుగా 20 మంది ఎమ్మెల్సీ సీటుకోసం దరఖాస్తు చేసుకున్నట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే మిత్రపక్షాలకు ఎన్ని కేటాయించాలి, పార్టీ ఆశావహుల్లో ఎవరికీ ఈ సీట్లు కేటాయించాలన్న దానిపై టిపిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, సిఎం రేవంత్‌లు ఎలా ముందుకెళ్లాలన్న దానిపై తర్జనభర్జన పడుతున్నట్టుగా తెలిసింది.

సిపిఐ, టిజేఎస్‌లు ఒక్కో సీటు కావాలని డిమాండ్….
ఇందులో భాగంగా ఇప్పటికే సిపిఐ రాష్ట్ర నేతల బృందం సోమవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో టిపిసిసి చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్‌ను కలిశారు. తమ పార్టీ నుంచి ఒకరికి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని పిసిసి అధ్యక్షుడిని కోరారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో సిపిఐ, టిజేఎస్ కాంగ్రెస్ మధ్య పొత్తు కుదిరింది. అప్పటి నుంచి మిత్రపక్షంగా ఉన్న సిపిఐ, టిజేఎస్ పార్టీలు నామినేటెడ్ పోస్టులు, ఆయా ఎన్నికల్లో తమ వాటా కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో సిపిఐ ఒక సీటు కోసం ప్రయత్నాలు చేసింది. కానీ, బిజెపిని ఓడించాలంటే తమ అభ్యర్థులే పోటీలో ఉండాలని కామ్రేడ్‌లనును కాంగ్రెస్ ఒప్పించింది. ఆ తర్వాత సిపిఐ నేతలు పలు సందర్భాల్లో ముఖ్యమంత్రిని కలిసి పదవుల విషయంలో చర్చలు జరుపుతూనే ఉన్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో తాజాగా పిసిసి చీఫ్‌ను కలిసి ఎమ్మెల్సీ అవకాశంతో పాటు నామినేటెడ్ పోస్టులపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ మిత్రపక్షంగా ఉన్న టిజేఎస్ సైతం ఎమ్మెల్సీ స్థానం కోసం అంతర్గతంగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆ పార్టీ అధినేత కోదండరాంకు కాంగ్రెస్ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది. అయితే ఒప్పందంలో భాగంగా మరో ఎమ్మెల్సీ, నామినేటెడ్ పదవులు కోరాలని టిజెఎస్ నేతలు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

కాంగ్రెస్‌లోని ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ, రెడ్డిలకు ఒక్కో సీటు ఇవ్వాలని….
ప్రస్తుత పార్టీ బలబలాలను పరిశీలిస్తే కాంగ్రెస్ కు 4 ఎమ్మెల్సీ సీట్లు, బిఆర్‌ఎస్‌కు 1 ఎమ్మెల్సీ సీటు దక్కే అవకాశం ఉంది. ఐదు కన్నా ఒక్క నామినేషన్ ఎక్కువగా దాఖలైతే పోలింగ్ ఉంటుంది. లేకుంటే అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. అయితే ఈ నాలుగు సీట్లు కాంగ్రెస్ కేడర్‌కే కేటాయించాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నట్టుగా తెలిసింది. ఇప్పటికే 20 మంది ఆశావహులు ఈ ఎమ్మెల్సీ సీటు కోసం దరఖాస్తు చేసుకోవడంతో పాటు తమవంతు ప్రయత్నంగా లాబీయింగ్ చేస్తున్నట్టుగా తెలిసింది. అయితే ఒక్కో సామాజిక వర్గానికి ఒక్కో ఎమ్మెల్సీ సీటును ఇవ్వాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నట్టుగా తెలిసింది. అయితే ఇందులో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ, రెడ్డి సామాజిక వర్గాలు తమకే ఎమ్మెల్సీ సీటును కేటాయించాలని అధిష్ఠానానికి విజ్ఞప్తి చేసినట్టుగా సమాచారం.

ఈసారి లంబాడా వర్గానికి ఎమ్మెల్సీ….!
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి 4 ఎమ్మెల్సీలు మాత్రమే ఉండడంతో ఏ సామాజిక వర్గాన్ని ఎలా సంతృప్తి పరచాలన్న దానిపై పార్టీ తర్జన భర్జన పడుతున్నట్టుగా తెలిసింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనుండడంతో అన్ని వర్గాల వారిని సంతృప్తి పరచడం కాంగ్రెస్‌కు కత్తిమీది సాములా మారింది. ఎస్సీ సామాజిక వర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ( మాదిగ ), పిసిసి ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ ( మాల), ఎస్టీల నుంచి మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ( లంబాడా), ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్ (లంబాడా ) సీటు ఆశిస్తున్నారు. మంత్రి వర్గంలో ఆదివాసీలకు ( సీతక్క ) ప్రాతినిథ్యం ఉండడంతో, ఈసారి లంబాడా వర్గానికి ఎమ్మెల్సీ ఇవ్వాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడిందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.

బిసిల నుంచి యాదవ, కుర్మ, ముదిరాజ్‌లు
ఇక బిసిల నుంచి యాదవ, కుర్మ, ముదిరాజ్ లు బలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. యాదవుల నుంచి మాజీ ఎంపి అంజన్ కుమార్ యాదవ్, పిసిసి ఉపాధ్యక్షుడు చరణ్ కౌశిక్, ఇటు కుర్మ సామాజిక వర్గం, మహిళా కోటా కింద గద్వాల జడ్పీ మాజీ చైర్పర్సన్ సరితా యాదవ్, ముదిరాజ్ , మహిళా కోటా కింద రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు ప్రయత్నాలు చేస్తున్నారు. పిసిసి క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధు యాష్కీ కూడా ఈ సీటు ఆశిస్తున్నట్టుగా తెలిసింది. మైనార్టీ కోటాలో సీనియర్ నేత షబ్బీర్ అలీ, నాంపల్లి ఇన్‌చార్జీ ఫిరోజ్ ఖాన్, సిఎం రేవంత్ సన్నిహితుడు ఫహీం ఖురేషీలు కూడా పోటీ పడుతున్నట్టుగా తెలిసింది. వీరితో పాటు ఓసీలో రెడ్డి సామాజిక వర్గం నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షుడు రోహిణ్ రెడ్డి, పిసిసి మీడియా ఇన్‌చార్జి సామ రాంమ్మోహన్ రెడ్డి, ఓసీ బ్రాహ్మణ కోటాలో ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, కమ్మ సామాజిక వర్గం నుంచి కుసుమ కుమార్ ఈ సీట్లపై ఆశలు పెట్టుకోవడం విశేషం.

ఐదు స్థానాలకు నోటిఫికేషన్ విడుదల
రాష్ట్రంలో ఐదు ఎంఎల్‌ఎ కోటా ఎంఎల్‌సి స్థానాలకు ఈనెల 20న ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన సోమవారం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్ దాఖలుకు అవకాశం ఉంటుంది. 11వ తేదీన నామినేషన్ల పరిశీలన, 13 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. ఈనెల 20వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనున్నది. అదేరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది. తెలంగాణలో ఈనెల 29 నాటికి ఐదుగురి ఎంఎల్‌సిల పదవీకాలం ముగియనుంది. పదవీకాలం ముగిసే వారిలో సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, శేరి సుభాష్‌రెడ్డి, ఎగ్గె మల్లేశం, మీర్జా రియాజుల్ హాసన్ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఎంఎల్‌ఎ కోటా ఎంఎల్‌సి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News