Tuesday, March 4, 2025

హత్య కేసులో ఆరోపణలు: మహా మంత్రి రాజీనామా

- Advertisement -
- Advertisement -

ముంబయి : మహారాష్ట్రలోని బీడ్ జిల్లా మసాజోగ్ గ్రామ సర్పంచ్ సంతోష్ దేశ్‌ముఖ్ హత్య ఆ రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతోంది. ఆ ఘటనకు బాధ్యత వహిస్తూ ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ధనంజయ్ ముండే మంగళవారం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ధనంజయ సన్నిహిత సహచరుడు వాల్మిక్ కరాడ్‌ను సర్పంచ్ హత్య కేసులో సూత్రధారిగా పేర్కొన్న కొన్ని రోజుల తరువాత ఈ పరిణామం చోటు చేసుకున్నది. రాజీనామా చేయాలని ఆయనను ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఆ అంశంపై ఫడ్నవీస్ మీడియాతో మాట్లాడుతూ, ధనంజయ్ రాజీనామాను తాను ఆమోదించి గవర్నర్‌కు పంపానని తెలియజేశారు. ఎన్‌సిపి అజిత్ పవార్ వర్గంలో ధనంజయ్ కీలక నేతగా ఉన్నారు.

ఆయన సొంత జిల్లా బీడ్. సంతోష్‌ను కిడ్నాప్ చేసి, ఆ తరువాత చిత్రహింసలకు గురి చేసి చంపేశారు.ఆ హత్య కేసులో ధనంజయ్ సన్నిహితుడు వాల్మిక్ కరాడ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దీనికి బాధ్యత వహిస్తూ ధనంజయ్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ధనంజయ్‌కు వ్యతిరేకంగా ఉన్న ఆధారాలను అజిత్ పవార్‌కు తాను అందజేశానని సామాజిక కార్యకర్త అంజలి దమానియా చెప్పడంతో మంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్లు ఊపు అందుకున్నాయి. ఎన్‌సిపి (శరద్ పవార్) కార్యనిర్వాహక అధ్యక్షురాలు సుప్రియా సూలే కూడా ఢనంజయ రాజీనామా చేయాలని కోరారు. ఈ నేసథ్యంలో ధనంజయ్ ఇటీవల మాట్లాడుతూ, మంత్రి పదవికి రాజీనామా చేయాలని ముఖ్యమంత్రి ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ చెబితే వెంటనే రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఈ క్రమంలో చివరకు ధనంజయ రాజీనామా చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News