Tuesday, March 4, 2025

ప్రతీకార సుంకాల ప్రకంపనలు

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ :ట్రంప్ ప్రతీకార సుంకాల ప్రకంపనలు తీవ్రంగా ఉంటున్నాయి. కెనడా, మెక్సికో దేశాల ఉత్పత్తులపై 25 శాతం వరకు విధించిన సుంకాలు మంగళవారం నుంచి అమలు లోకి రాగా, ఆ దేశాలు కూడా అమెరికా ఉత్పత్తులపై 25 శాతం వరకు సుంకాలు విధించాయి. అవి మార్చి 10 నుంచి అమలు లోకి రానున్నాయి. ఇప్పటికే చైనా ఉత్పత్తులపై 10 శాతం ప్రతీకార సుంకాలు విధించిన ట్రంప్ తాజాగా 20 శాతానికి పెంచడం తెలిసిందే. ఫెంటనిల్ డ్రగ్స్ అక్రమ రవానాను అడ్డుకోవడంలో బీజింగ్ విఫలమవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని ట్రంప్ ప్రకటించారు.

చైనాపై సుంకాలు గత నెల నుంచే అమలు కాగా, తాజాగా వాటిని 20 శాతానికి పెంచడం గమనార్హం. దీనికి తగ్గట్టు చైనా కూడా అమెరికాకు గట్టి బదులిచ్చింది. అమెరికా నుంచి దిగుమతి అవుతోన్న వస్తువులపై 10 నుంచి 15 శాతం ప్రతీకార సుంకాలు విధించింది. సోయాబీన్, పోర్క్, ఇతర ఉత్పత్తులపై 10 శాతం , చికెన్, మొక్కజొన్న, పత్తి వంటి ఉత్పత్తులపై 15 శాతం సుంకాలు విధిస్తామని ప్రకటించింది. మార్చి 10 నుంచి అవి అమలు లోకి వస్తాయని చైనా ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రకటించింది. మరోవైపు కెనడా, మెక్సికో దిగుమతులపై 25 శాతం సుంకాల విషయంలో ఎలాంటి మార్పు లేదని ట్రంప్ వెల్లడించారు.

మార్చి 4 (అమెరికా కాలమానం ప్రకారం ) నుంచి అవి యథావిధిగా అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. దీనికి ప్రతిగా ట్రూడో కూడా అమెరికాపై సుంకాలు విధించారు.అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఆల్కహాల్, పండ్లు, సహా 107 బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై తాము కూడా 25 శాతం సుంకం విధిస్తున్నట్టు వెల్లడించారు. ఇవి కూడా మంగళవారం నుంచే అమల్లోకి వస్తున్నట్టు తెలిపారు. ట్రంప్ సుంకాల దెబ్బకు అమెరికా మార్కెట్లు కుదేలయ్యాయి. ఆసియా పసిఫిక్,ఆస్ట్రేలియా మార్కెట్ల పైనా ఈ ప్రభావం పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News