దుబాయ్: టీం ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ రికార్డులకు పెట్టింది పేరు. ఇప్పటికే ఎన్నో అనితరసాధమైన రికార్డలను తన ఖాతాలో వేసుకున్నాడు కోహ్లీ. అయితే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ సాధించిన కోహ్లీ.. వన్డేల్లో అత్యధిక సెంచరీలు(51) సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అయితే ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి సెమీ ఫైనల్‌లోనూ విరాట్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
వన్డే మ్యాచుల్లో అత్యధిక క్యాచులు అందుకున్న ఫీల్డర్ల జాబితాలో విరాట్ రెండో స్థానంలో నిలిచాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ రెండు క్యాచ్‌లను అందుకొని మొత్తం వన్డేల్లో 161 క్యాచ్‌లు అందుకొన్న ఫీల్డర్‌గా రికార్డు సాధించాడు. జడేజా బౌలింగ్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు జోష్ ఇంగ్లిస్ క్యాచ్, షమీ బౌలింగ్‌లో నాథన్ ఎల్లీస్ క్యాచ్‌లను కోహ్లీ అందుకున్నాడు. మొత్తం ఫీల్డర్‌గా 161 క్యాచ్‌లను అందుకొని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ రికార్డును దాటేశాడు కోహ్లీ. ఈ జాబితాలో 218 క్యాచ్‌లతో శ్రీలంక దిగ్గజ ఆటగాడు మహేల జయవర్ధనే మొదటి స్థానంలో ఉన్నారు.