చెన్నై : తమిళనాడులో మార్చి 3 నుంచి ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థులకు వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. తిరునల్వేలి లోని వల్లయూర్‌కు చెందిన సునీల్ కుమార్ కొద్ది గంటల్లో పరీక్షకు వెళ్తాడనగా, గుండె సమస్యతో అతడి తల్లి ఆకస్మికంగా చనిపోయింది. ఆరు సంవత్సరాల క్రితమే తండ్రిని కోల్పోయాడు. ఆ తల్లే సునీల్, అతడి సోదరిని పెంచి పెద్ద చేసింది. వారికి ఆమే ఆధారం. ఇలాంటి సమయంలో తల్లిని కోల్పోయిన ఆ పిల్లాడు ఎంతో వేదనకు గురయ్యాడు. కానీ బంధువులు ,చుట్టుపక్కల వారి ప్రోత్సాహంతో బాధ దిగమింగుకొని పరీక్ష రాయడానికి వెళ్లాడు.
వెళ్లే ముందు చివరిసారిగా తల్లి పాదాల వద్ద హాల్‌టికెట్ ఉంచి ఆశీశ్సులు తీసుకున్నాడు. కానీ అప్పుడు తనను తాను నియంత్రించుకోలేక వెక్కివెక్కి ఏడ్చాడు. కానీ ఇతర సభ్యులు అతడిని ఓదార్చి ఎగ్జామ్ సెంటర్ వద్ద దిగబెట్టారు. బాగా చదవాలని తల్లి కోరుకునేదని గుర్తు చేశారు. మరోవైపు సోదరి భవిష్యత్తు అతడి కళ్ల ముందు కదలాడింది. ఈ సంఘటన తమిళనాడు ప్రభుత్వం దృష్టికి చేరింది. విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేశ్ బృందం సునీల్‌తో మాట్లాడింది. అవసరంలో అండగా ఉంటామని భరోసా ఇచ్చింది. ఈ హృదయ విదారక సంఘటనపై సీఎం స్టాలిన్ ఎక్స్ వేదికగా స్పందించారు.