Wednesday, March 5, 2025

పని ప్రదేశాల్లో పాలివ్వడాన్ని అవమానంగా చూడొద్దు : సుప్రీం కోర్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : పని ప్రదేశాల్లో తల్లి తన బిడ్డకు పాలివ్వడం తప్పేమీ కాదని సుప్రీం కోర్టు పేర్కొంది. మహిళల గౌరవానికి భంగం కలిగించే పద్ధతులను త్యజించాలని స్పష్టం చేసింది. పాలిచ్చే తల్లులకు తమ బిడ్డ సంరక్షణలో అది భాగమని, దాన్ని అందరూ గౌరవించాలని పేర్కొంది. అది వారి హక్కు కూడా కాబట్టి బహిరంగ ప్రదేశాల్లో , పని ప్రదేశాల్లో తల్లి బిడ్డకు పాలివ్వడాన్ని తప్పు పట్టొద్దని ధర్మాసనం వెల్లడించింది. ఈమేరకు ప్రభుత్వ స్థలాల్లో, భవనాల్లో చైల్డ్‌కేర్ గదుల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సలహాలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను / కేంద్ర పాలిత ప్రాంతాలను కోరుతూ దాఖలైన పిటిసన్లుపై జస్టిస్‌లు బివి నాగరత్న, పీబీ వరలే లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పుని వెలువరించింది.

అంతేకాదు ఇలా బహిరంగ ప్రదేశాల్లోనూ, పని ప్రదేశాల్లోనూ తల్లి పాలివ్వడాన్ని అవమానకరంగా చూస్తే మహిళలు అనవసరమైన ఒత్తిడి లేదా బెదిరింపులకు గురవుతారంటూ యూఎన్ నివేదికను వెల్లడించింది. అలాగే తల్లిపాలిచ్చే హక్కును గురించి కూడా స్పష్టం చేసింది. ఇది భారత రాజ్యాంగం లోని ఆర్టికల్ 21 అంతర్జాతీయ చట్టంలో పొందుపరిచిన పిల్లల ప్రయోజనాలు, అనే ప్రాథమిక సూత్రం , 2015 జువెనైల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ) చట్టంలో నుంచి ఈ హక్కు ఉద్భవించిందని తెలియజేసింది. అంటే అందుకు తగిన సౌకర్యాలు, వాతావరణాన్ని అందించాల్సిన బాధ్యత రాష్ట్రాలపై ఉందని దీని అర్థం అని కూడా స్పష్టం చేసింది.

ఈ విషయంలో ఫిబ్రవరి 27, 2024న కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ కార్యదర్శి, కార్మిక ఉపాధి మంత్రిత్వశాఖతో కలిసి ప్రభుత్వ భవనాల్లో ఫీడింగ్ గదులు, క్రెచ్లు వంటి వాటి కోసం స్థలాలు కేటాయించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరుతూ ఆదేశించిన సలహాను ధర్మాసనం పరిగణన లోకి తీసుకొని ఇలా తీర్పు వెల్లడించింది. ఇది తల్లుల గోప్యత, శిశువుల ప్రయోజనార్ధం సూచించిన సలహాగా పేర్కొంది. ఆ దిశగా ప్రభుత్వాలు చర్య తీసుకుంటే తల్లీబిడ్డల గోప్యతకు భంగం వాటిల్లకుండా చేయడం సులభమవుతుందని తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News