Thursday, March 6, 2025

మహారాష్ట్ర అసెంబ్లీ నుంచి ఎంఎల్‌ఎ అబు అజ్మి సస్పెన్షన్

- Advertisement -
- Advertisement -

మొగల్ చక్రవర్తి ఔరంజేబును ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యలపై సమాజ్‌వాది పార్టీ (ఎస్‌పి) ఎంఎల్‌ఎ అబు అజ్మిని బుధవారం మహారాష్ట్ర శాసనసభ సభ్యత్వం నుంచి సస్పెండ్ చేశారు. ప్రస్తుత బడ్జెట్ సెషన్ ముగిసేంత వరకు అజ్మి సస్పెన్షన్ కొనసాగుతుంది. శాసనసభ బడ్జెట్ సెషన్ ఈ నెల 26న ముగియనున్నది. అజ్మి సస్పెన్షన్ కోసం తీర్మానాన్ని రాష్ట్ర మంత్రి చంద్రకాంత పాటిల్ బుధవారం సభలో ప్రవేశపెట్టారు. సస్పెన్షన్ తీర్మానాన్ని సభ మూజువాణి వోటుతో ఆమోదించింది. ‘ఔరంగజేబును ప్రశంసిస్తూ, శంభాజీ మహారాజ్‌ను విమర్శిస్తూ అజ్మి చేసిన వ్యాఖ్యలు శాసనసభ సభ్యుని హోదాకు తగినవి కావు, శాసనసభ ప్రజాస్వామ్య వ్యవస్థకు అవమానకరం’ అని పాటిల్ అన్నారు. ఔరంగజీబు హయాంలో భారతదేశ సరిహద్దు ఆఫ్ఘనిస్తాన్, బర్మా (మయాన్మార్) వరకు ఉన్నది. మన జిడిపి (ప్రపంచ జిడిపిలో) 24 శాతం మేర ఉన్నది.

భారత్‌ను (ఆయన హయాంలో) బంగారు పావురంగా పేర్కొన్నారు’ అని ముంబయిలోని మాన్‌ఖుర్ద్ శివాజీ నగర నియోజకవర్గం ఎంఎల్‌ఎ అయిన సమాజ్‌వాది పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అబు అజ్మి వ్యాఖ్యానించారు. ఔరంగజేబు, మరాఠా రాజు ఛత్రపతి శంభాజీ మహారాజ్ మధ్య పోటీ గురించి అడిగినప్పుడు అది ఒక రాజకీయ పోరాటం అని అజ్మి సమాధానం ఇచ్చారు. అజ్మి వ్యాఖ్యలపై మంగళవారం రాష్ట్ర ఉభయ శాసనసభల్లో దుమారం రేగింది. అజ్మిని సస్పెండ్ చేయాలని, దేశద్రోహానికి ఆయనపై కేసు నమోదు చేయాలని అధికార పక్ష సభ్యులు డిమాండ్ చేశారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని అజ్మి మంగళవారం ‘ఎక్స్’ పోస్ట్‌లో ఆరోపించారు. ‘ఔరంగజేబుపై నేను అన్న మాటలు ఏవైనా ఉంటే అవి చరిత్రకారులు, రచయితలు అన్నవే. శివాజీ మహారాజ్, శంభాజీ మహారాజ్ లేదా ఏ జాతీయ దిగ్గజాలపైనైనా నేను కించపరిచే ఎటువంటి వ్యాఖ్యలూ చేయలేదు. అయినప్పటికీ, నా వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే నా ప్రకటనలను, వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను’ అని అజ్మి తన పోస్ట్‌లో తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News