కన్నడ నటి రన్యా రావు దగ్గర నుంచి బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ. 12.56 కోట్లు విలువ చేసే బంగారు కడ్డీలను తాము స్వాధీనం చేసుకున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ (డిఆర్‌ఐ) బుధవారం వెల్లడించింది. రన్యా రావు సీనియర్ ఐపిఎస్ అధికారి రామచంద్ర రావు సవతి కుమార్తె అని పోలీస్ సీనియర్ అధికారి ఒకరు ‘పిటిఐ’తో చెప్పారు. డిజిపి ర్యాంక్ అధికారి అయిన రామచంద్రరావు ప్రస్తుతం కర్నాటక రాష్ట్ర పోలీస్ గృహనిర్మాణ, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ సిఎండిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ కేసులో మొత్తం స్వాధీనం చేసుకున్న బంగారం, ఆస్తుల విలువ రూ. 17.29 కోట్లు. వాటిలో రూ. 4.73 కోట్లు విలువ చేసే ఆస్తులు కూడా ఉన్నాయి. సంఘటిత బంగారం అక్రమ రవాణా నెట్‌వర్క్‌లకు ఆ స్వాధీనం పెద్ద దెబ్బే. డిఆర్‌ఐ అధికారుల సమాచారం ప్రకారం, 14.2 కిలోల బంగారం స్వాధీనం ఇటీవలి కాలంలో బెంగళూరు విమానాశ్రయంలో బంగారం స్వాధీనం చేసుకున్న అతిపెద్ద ఘటనల్లో ఒకటి.
రన్యా రావు బంగారాన్ని తొడలు, నడుముతో సహా తన శరీరానికి బంగారాన్ని టేప్‌తో అంటించుకోవడం ద్వారా, తన దుస్తుల లోపల, సవరించిన జాకెట్ లోపల గోప్యంగా ఉంచడం ద్వారా భద్రత సిబ్బంది తనిఖీని తప్పించుకున్నట్లు అధికారులు తెలియజేశారు. రన్యా రావు గత ఏడాదిగా 30 సార్లు దుబాయికి వెళ్లి, ప్రతి ట్రిప్‌లోను కిలోల కొద్దీ బంగారం తీసుకువస్తుండేది. అక్రమ రవాణా చేసిన కిలో బంగారానికి ఒక లక్ష రూపాయలు వంతున ఆమెకు చెల్లించారని, అలా ఆమె ట్రిప్‌నకు రూ. 1213 లక్షలు ఆర్జించించిందని అభిజ్ఞ వర్గాలు తెలిపాయి. ఆమె తన స్మగ్లింగ్ కార్యకలాపాల కోసం సవరించిన జాకెట్లు, నడుము బెల్ట్‌లు వాడుతుండేదని దర్యాప్తులో వెల్లడైంది. ఆమె తన ప్రయాణాలకు ఒకేవిధమైన జాకెట్లు, బెల్ట్‌లు ధరిస్తుండేది. ఈ దఫా ఆమె సవరించిన తన జాకెట్‌లో బంగారం కడ్డీలు దాచింది. సోమవారం రాత్రి ఎమిరేట్స్ విమానంలో దుబాయి నుంచి వచ్చిన రన్యా రావుపై తరచు అంతర్జాతీయ ప్రయాణాల కారణంగా డిఆర్‌ఐ వర్గాలు నిఘా వేసి ఉంచాయి. డిఆర్‌ఐ ప్రోటోకాల్స్ ప్రకారం,
ఆ ప్రాంతానికి పదే పదే ట్రిప్‌లు వేస్తుండే ప్రయాణికులను నిశితంగా తనిఖీ చేస్తుంటారు. భద్రత తనిఖీని తప్పించుకోవడానికి రన్యా రావు తన పలుకుబడిని వినియోగించుకుందని, బెంగళూరుకు రాగానే ఆమె తనకు ఇంటి వరకు రక్షణగా రావడానికి స్థానిక పోలీస్ సిబ్బందిని పిలిపించిందని తెలుస్తోంది. రాజకీయ ప్రముఖులు, వాణిజ్యవేత్తలు, పోలీస్ అధికారుల కుటుంబాలతో సహా భారీ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌తో ఆమెకు గల సంబంధాలను కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. విమానాశ్రయంలో బసవరాజ్ అనే పోలీస్ కానిస్టేబుల్ రన్యా భద్రత తనిఖీలు తప్పించుకునేందుకు సాయం చేసినట్లు తెలుస్తోంది. ఈ దఫా డిఆర్‌ఐ అధికారులు రన్యను నిలదీసినప్పుడు బసవరాఝ్ జోక్యం చేసుకుని, ‘ఆమె ఎవరో మీకు తెలుసా? ఆమె డిజిపి రామచంద్రరావు కుమార్తె’ అని చెప్పినట్లు సమాచారం. అయితే, ముందస్తు సమాచారం ఆధారంగా వ్యవహరించిన డిఆర్‌ఐ ఆమెను అడ్డుకుని, బంగారం సరకులతో ఆమెను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నది. ఇటీవలే లావెల్లి రోడ్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లోకి మారిన రన్య ప్రముఖ ఆర్కిటెక్ట్ జితిన్ హుక్కెరిని మూడు నెలల క్రితమే తాజ్ వెస్ట్ ఎండ్‌లో వైభవంగా వివాహం చేసుకున్నది.
దుబాయిలో వాణిజ్య సంబంధాలు ఏవీ లేకపోయినా ఆమె గడచిన 15 రోజుల్లో నాలుగు సార్లు దుబాయిని సందర్శించింది. దీనితో దర్యాప్తు అధికారులకు మరిన్ని అనుమానాలు కలిగాయి. డిఆర్‌ఐ అధికారులు ప్రశ్నించినప్పుడు, బంగారం అక్రమ రవాణా చేసేలా తనను బ్లాక్‌మెయిల్ చేశారని రన్య చెప్పింది. ఆమె ఆర్థిక లావాదేవీలు, సంబంధాలపై అధికారులు ఇప్పుడు మరింతగా దర్యాప్తు జరుపుతున్నారు. కాగా, రన్యా రావును ఆర్థిక నేరాల కోర్టులో ప్రవేశపెట్టగా ఆమెను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి కోర్టు పంపింది.
ఆమెతో సంబంధాలు లేవు
ఇది ఇలా ఉండగా, బంగారం స్మగ్లింగ్ చేస్తూ రన్య పట్టుబడిన ఘటనపై సీనియర్ ఐపిఎస్ రామచంద్రరావు ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ, ఆమె కార్యకలాపాలతో తనకు ఎటువంటి సంబంధమూ లేదని స్పష్టం చేశారు. ఆమెకు ఈ మధ్యే వివాహం అయిందని, అప్పటి నుంచి ఆమె తమ ఇంటికి రాలేదని ఆయన చెప్పారు. భర్తతో పాటు ఆమె ఎటువంటి వ్యాపార లావాదేవీలు చేస్తున్నదీ తమకు తెలియదని ఆయన స్పష్టం చేశారు. తాజా పరిణామంతో షాక్‌కు గురయ్యామని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన చెప్పారు.