ఢిల్లీ నీటిపారుదల, వరద నియంత్రణ శాఖ మంత్రి పర్వేష్ వర్మ బుధవారం ఒక పడవలో యమునను తనిఖీ చేశారు. గడచిన పది రోజుల్లో నదిలో నుంచి 1300 టన్నుల చెత్తను తొలగించినట్లు మంత్రి వెల్లడించారు. ఆ తరువాత నది ప్రక్షాళన కృషిలో పురోగతిని మదింపు వేయడానికి మంత్రి అధికారులతో సమావేశం నిర్వహించారు. ‘ఢిల్లీలో అన్ని డ్రెయిన్లను మురుగునీటి శుద్ధి ప్లాంట్ (ఎస్‌టిపి)లకు అనుసంధానం చేస్తాం. శుద్ధి చేయని వ్యర్థజలాలు నదిలోకి ప్రవహించకుండా నివారించేందుకు వాటి సామర్థాన్ని పెంచుతాం’ అని పర్వేష్ వర్మ చెప్పారు.
ఢిల్లీ అసెంబ్లీకి ఇటీవల నిర్వహించిన ఎన్నికలకు ముందు బిజెపి చేసిన కీలక వాగ్దానాల్లో యమున ప్రక్షాళన ఒకటి. మురుగునీటి శుద్ధికి సంబంధించిన ఫిర్యాదులను పరిశీలిస్తామని, అన్ని ఎస్‌టిపిలను రెండు సంవత్సరాల్లోగా ఏర్పాటు చేయవచ్చునని మంత్రి ప్రజలకు హామీ ఇచ్చారు. ‘2023లో ఢిల్లీ వరద సమస్యను ఎదుర్కొన్నది. గతంలో అన్ని ఫ్లడ్‌గేట్లను మూసివేశారు. కానీ ఇప్పుడు వాటిని మరమ్మతు చేసి, మున్ముందు వరద ప్రవాహాన్ని నివారించేందుకు ఎత్తు పెంచారు’ అని మంత్రి తెలిపారు.