కరీంనగర్ పట్టభద్రుల ఎంఎల్‌సి
ఎన్నికల్లో బిజెపిదే గెలుపు
మూడు రోజులపాటు సాగిన
లెక్కింపు ప్రక్రియ రెండో
ప్రాధాన్యత ఓటులో తేలిన ఫలితం
53 మంది అభ్యర్థుల ఎలిమినేషన్
5వేలకు పైగా మెజారిటీతో విజయం
మన తెలంగాణ/ఉమ్మడి కరీంనగర్ బ్యూరో: కరీంనగర్,- ఆదిలాబాద్,- నిజామాబాద్, -మెదక్ పట్టభద్రుల ఎంఎల్‌సిగా బిజెపి అభ్యర్థి సిహెచ్ అంజిరెడ్డి విజయం సాధించారు. రెండు రోజుల పాటు జరిగిన కౌంటింగ్ ప్రక్రియలో రెండో ప్రాధాన్యత ఓట్లతో విజయం సాధించారు. బిజెపి, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య హోరా హోరీగా సాగిన లెక్కింపు చివరి దాకా లో టెన్షన్ నింపింది. పట్టభద్రుల స్థానంలో మొత్తం 2,52,029 ఓట్లు పోలు కాగా, 28,288 ఓట్లు చెల్లలేదు. 2,23,943 చెల్లుబాటయ్యాయి. వీటిలో 75,675 బిజెపి అభ్యర్థికి, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 75,565, బిఎస్‌పి అభ్యర్థి హరికృష్ణకు 80,419 ఓట్ల వచ్చాయి. గెలుపుకోసం అవసరమైన కోటా 1,11,672 ఓట్లు పొందిన అభ్యర్థిని విజేతగా ప్రకటించాల్సి ఉండగా, మొదటి ప్రాధాన్యతలో ఏ అభ్యర్థి కూడా ఓట్లు పొందలేదు. రెండో ప్రాధాన్యత లెక్కింపు చేపట్టారు. ఇందులో కూడా బిజెపి అభ్యర్థికే అత్యధిక ఓట్లు వచ్చిన.. గెలుపు కోటాకు అవసరమైన ఓట్లు రాలేదు. అత్యధిక ఓట్లు సాధించటంతో మూడో ప్రాధాన్యతకు వెళ్ళకుండా తన సమీప ప్రత్యర్థి అంగీకరించడంతో అంజిరెడ్డి గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. అంజిరెడ్డికి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ఎన్నికల పరిశీలకులు బుద్ధ ప్రకాష్ జ్యోతి, అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్ గెలుపు ధ్రువీకరణ పత్రం అందజేశారు.