Thursday, March 6, 2025

చివరికి తోకముడిచిన జెలెన్ స్కీ

- Advertisement -
- Advertisement -

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని ఎలాంటి సాయం తమ నుంచి అందకుండా ఏకాకిని చేస్తే కానీ తమ దారికి రాడని ట్రంప్ నిర్ణయానికి రావడం, ఈ మేరకు ఒక వ్యూహంతో ఉక్రెయిన్‌కు మిలిటరీ సాయం తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు మంగళవారం (మార్చి 4, 2025) ప్రకటించడం అనూహ్య పరిణామాలకు దారితీసింది. ట్రంప్ తాజా నిర్ణయంతో ఆయుధాలు, ఇతరత్రా యుద్ధ సామగ్రి రూపంలో దాదాపు 100కోట్ల డాలర్ల విలువైనవి ఉక్రెయిన్‌కు వెళ్లాల్సి ఉండగా, అవన్నీ నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో కొన్ని గంటల్లోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ దిగివచ్చారు.

ఇటీవల శ్వేత భవనంలోని ఓవల్ ఆఫీసులో మీడియా ప్రతినిధుల ముందే ట్రంప్ వాదనలను గట్టిగా ఎదుర్కొని అతిసాహసవంతుడన్న ప్రపంచ దేశాల ముఖ్యంగా ఐరోపా యూనియన్ దేశాల ప్రశంసలు పొందిన జెలెన్‌స్కీ చివరికి తోకముడచక తప్పలేదు. రష్యా నుంచి భద్రతాపరమైన హామీలు పొందడం కన్నా అమెరికాతో ఖనిజ ఒప్పందాన్ని కుదుర్చుకుంటేనే ఉక్రెయిన్‌కు రక్షణ లభిస్తుందన్న వ్యూహంతో అమెరికా పెట్టిన షరతులన్నిటికీ పరోక్షంగా అంగీకరిస్తూ చివరకు దాసోహం కావడం అనూహ్య పరిణామం. చేసిన తప్పులు దండంతో సరి అన్నట్టు ఇటీవల ట్రంప్‌తో చర్చలు జరిగిన తీరుపై పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.

తమ దేశ ఖనిజాలను అమెరికా కొల్లగొట్టడానికి ఒప్పుకున్నారు. దీనివల్లనే భద్రతాపరమైన హామీలు లభిస్తాయని ఆశాభావంతో ఉన్నారు. ఇకపై ఇలాంటి చర్చలు, సహకారం నిర్మాణాత్మకంగా ఉండేలా చూసుకుంటామని కూడా స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌కు ఐరోపా దేశాలు బాసటగా నిలుస్తున్న సమయంలో ఈ పరిణామాలు సంభవించాయి. ఐరోపా యూనియన్‌తో సంబంధం లేకుండా లాటిన్ అమెరికా దేశాలతో బలమైన సంబంధాలను ఏర్పర్చుకుని కొత్త కూటమిని సిద్ధం చేసుకోవాలని ట్రంప్ ఎత్తుగడలు వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితిని గమనించి ఐరోపా యూనియన్ దేశాలు అమెరికా నుంచి తమను తాము రక్షించుకోడానికి, రష్యా దురాక్రమణ నుంచి ఉక్రెయిన్‌ను కాపాడడానికి వీలుగా ఉక్రెయిన్ సైనిక శక్తిని బలోపేతం చేయడానికి నిర్ణయించాయి.

దీనికి అనుగుణంగా 800 బిలియన్ యూరో (841 బిలియన్ అమెరికా డాలర్లు) విలువైన ప్యాకేజీని ఐరోపా యూనియన్ ఎగ్జిక్యూటివ్ మంగళవారం ప్రతిపాదించారు. గురువారం బ్రసెల్స్‌లో జరగనున్న 27 ఐరోపా యూనియన్ దేశాల సమావేశంలో ఈ ప్యాకేజీపై చర్చిస్తారు. మరి ఇప్పుడు జెలెన్‌స్కీ అమెరికాకు దాసోహం కావడంపై ఐరోపా యూనియన్ వైఖరి ఎలా ఉంటుందో చెప్పలేం. అమెరికాను కలుపుకోకుండా ఏదీ చేయలేమని ఐరోపా యూనియన్ దేశాలు మొదటినుంచి చెబుతున్నాయి. అయితే ఉక్రెయిన్‌కు ఆర్థికంగా, రక్షణపరంగా నేరుగా సహాయం అందించడానికి ఇదివరకటిలా అంత వెసులుబాటు కాకపోవచ్చు. దేనికైనా అమెరికా నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తేనే కానీ ఐరోపా దేశాలు ఏపనీ చేయలేవు.

మరోవైపు ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే విషయంలో అమెరికా, ఐరోపా యూనియన్ మధ్య విభేదాలు నెలకొనడంతో దీన్ని అదునుగా చైనా ఉపయోగించుకోవాలనుకుంటోంది. అగ్రరాజ్యం తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా ఐరోపా యూనియన్‌తో కలిసి పనిచేసేందుకు చైనా ప్రయత్నాలు ప్రారంభించింది. దీనికి తాము సిద్ధంగా ఉన్నామని చైనా పార్లమెంట్ ప్రతినిధి లౌ కినిజియాన్ ప్రత్యేకించి వెల్లడించడం గమనార్హం. ట్రంప్‌పుతిన్ మధ్య సయోధ్య పెరుగుతుండడం రష్యాకు మిత్రదేశమైన చైనాకు ఆందోళన కలిగిస్తోంది. దీన్ని గమనించిన రష్యా అమెరికాతో తాము జరుపుతున్న చర్చల ఆంతర్యాన్ని వివరించడానికి తమ ఉన్నత భద్రతాధికారి షెర్గీ సోయిగును చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ వద్దకు పంపించింది.

ఇదిలా ఉండగా ట్రంప్ 1980లో వ్యాపారవేత్తగా ఉన్న సమయంలో ట్రంప్‌ను తమ గూఢచారిగా రష్యా 1987లో నియమించుకుందని మీడియా కథనాలు ప్రచారంలోకి వస్తున్నాయి. సోవియట్ విచ్ఛిన్నం తరువాత ట్రంప్ కజకిస్థాన్‌లో పనిచేశారని, అప్పుడు ట్రంప్ కోడ్ నేమ్ క్రస్నోవ్ అని సోవియెట్ ఇంటెలిజెన్స్ అధిపతిగా పనిచేసిన అల్నూర్ ముస్సాయేవ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం సంచలనం కలిగిస్తోంది. 2020 ఎన్నికల్లో తనకు జెలెన్‌స్కీ ఏమాత్రం సాయం చేయలేదని ట్రంప్ ద్వేషం పెంచుకున్నారని కూడా కథనాలు వస్తున్నాయి. అందుకనే నాటో కూటమిలో సభ్యత్వం పొందాలన్న జెలెన్‌స్కీ ఆశలకు ట్రంప్ మొదటినుంచీ గండి కొట్టడానికి పాత వైరుధ్యమే ముఖ్యమైన కారణంగా ఊహాగానాలు వస్తున్నాయి.

నాటో కూటమికి మొదటి నుంచీ సారథ్యం వహిస్తోంది అమెరికాయే. అందువల్ల జెలెన్‌స్కీ అనుకున్నవేమీ నెరవేరే పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదు. ట్రంప్ అధికారం చేపట్టక ముందు వరకు గత అధ్యక్షుడు జో బైడెన్ సహకారమే జెలెన్‌స్కీని ముందుకు నడిపించింది. రష్యాతో ఎంతకాలం యుద్ధం సాగించినా అంతకాలం తాము అండదండలు అందిస్తామని గతంలో జో బైడెన్ భరోసా ఇచ్చారు. కానీ ఇప్పుడు సీన్ తారుమారైంది. జో బైడెన్ తీసుకున్న నిర్ణయాలన్నీ తప్పుడు నిర్ణయాలని, అమెరికాకు తీవ్ర నష్టం కలిగించేవే అని ట్రంప్ తెరపైకి తెస్తున్నారు.

అమెరికా ద్రవ్యోల్బణం పెరగడానికి జో బైడెన్ విధానాలే కారణమని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ పరిస్థితుల్లో ట్రంప్ ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి ముందుకు వెళ్లడమే ఉక్రెయిన్‌కు, ఐరోపా దేశాలకు తప్పనిసరి అవుతోంది. ఇప్పటికే రష్యాపై అవ్యాజ ప్రేమ ఒలకబోస్తున్నారన్న కళంకం ట్రంప్ మూటగట్టుకున్నారు. అందువల్ల రష్యాతో ఎలాంటి తుది ఒప్పందం చేసుకున్నా ఉక్రెయిన్ భద్రత విషయంలో ఎలాంటి ప్రమాదం లేకుండా అమెరికా పెద్దరికం వహించవలసిన బాధ్యత ఉంది. ఖనిజాల వ్యాపారం కన్నా కొన్ని వేల ప్రాణాలను పరిరక్షించడం ట్రంప్ తక్షణ కర్తవ్యం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News