Friday, March 7, 2025

తెలంగాణ రైజింగ్ కాదు.. తెలంగాణ ఫాలింగ్:హరీష్‌రావు

- Advertisement -
- Advertisement -

సిఎం రేవంత్‌రెడ్డి పాలనపై మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్‌రావు ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. మీరు చేస్తున్నది తెలంగాణ రైజింగ్ కాదు.. తెలంగాణ ఫాలింగ్ అని సిఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. గత ఆరేళ్లలో ఫిబ్రవరి నెల జిఎస్‌టి కలెక్షన్ వృద్ధి రేటు (2021 కరోనా సంవత్సరం మినహా) ఎప్పుడూ 6 శాతం కంటే ఎక్కువే నమోదు అయిందని, కానీ రేవంత్ రెడ్డి పాలన కరోనా సమయాన్ని తలపిస్తూ 1 శాతం మాత్రమే నమోదు చేసిందని పేర్కొన్నారు. ఇది కాంగ్రెస్ పాలనలో తగ్గిన ప్రజల కొనుగోలు శక్తికి అద్దం పడుతున్నదని వ్యాఖ్యానించారు. హైడ్రా, మూసీ వంటి తలా తోక లేని నిర్ణయాలు, అనాలోచిత చర్యల వల్ల ఆగష్టు 2024 తర్వాత రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం గణీయంగా తగ్గిందని అన్నారు. 2024 ఏప్రిల్ నవంబర్, 2023 ఏప్రిల్ – నవంబర్ మధ్య కాలంలో వాహన విక్రయాలు పోల్చితే -0.8 శాతం నమోదు అయ్యినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని చెప్పారు. జిఎస్‌టి ఆదాయంలో తక్కువ వృద్ధి రేటు, రిజిస్ట్రేషన్లు, వెహికిల్ టాక్స్‌లో నెగెటివ్ వృద్ధి రేటు రేవంత్ రెడ్డి పాలన వైఫల్యాన్ని ఎండ గడుతున్నాయని విమర్శించారు. ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణలు చెప్పి పాలనపై శ్రద్ధ వహించాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు.

బడా కాంట్రాక్టర్లపై ఉన్న ధ్యాస, పేద విద్యార్థులపై లేదు
విదేశీ విద్యా పథకం కింద ఎంపికై, విదేశాలకు వెళ్లిన విద్యార్థులు స్కాలర్‌షిప్ డబ్బులు రాక ఆవేదన చేందుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేకపోవడం దుర్మార్గం అని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులు విడుదల చేయకుండా తాత్సారం చేస్తుండడం పేద, మధ్యతరగతి విద్యార్థులకు శాపంగా మారుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే విషయమై డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, విద్యార్థులు ఇబ్బంది పడుతున్న విషయం ప్రభుత్వం దృష్టికి రాలేదని, స్కాలర్‌షిప్స్ బకాయిల విడుదలకు మార్చి వరకు సమయం ఉందని మంత్రి సీతక్క సమాధానం చెప్పారని ఉగర్తు చేశారు. ఈ మాట చెప్పి మూడు నెలలు పూర్తి కావస్తుందని, ఇప్పటివరకు మూడు రూపాయల బకాయిలు కూడా చెల్లించిన దాఖలు లేవు అని పేర్కొన్నారు. రేవంత్ సర్కారుకు బడా కాంట్రాక్టర్లకు బిల్లులు విడుదల చేయడంపై ఉన్న ధ్యాస, పేద విద్యార్థుల చదువులకు బకాయిలు చెల్లించడంపై లేదని ఆరోపించారు. ఎస్‌సి,ఎస్‌టి, బిసి, మైనార్టీ సహా అగ్రవర్ణ పేద విద్యార్థులు విదేశాలకు వెళ్లి, ఉన్నత చదువులు చదవాలనే లక్ష్యంతో కెసిఆర్ ప్రారంభించిన విదేశీ విద్య పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగారుస్తున్నదని మండిపడ్డారు. ప్రభుత్వం మొద్దునిద్రను వీడి తక్షణమే స్కాలర్‌షిప్ బకాయిలను విడుదల చేయాలని, విదేశీ విద్య పథకం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి పేదలకు విదేశాల్లో చదివే అవకాశం కల్పించాలని హరీష్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News