అండ, పిండ, బ్రహ్మాండంలో బ్రహ్మాండమే మానవ రూపం. మనిషి మేధస్సు ఈ అనంత విశ్వంలో అత్యంత సృజనాత్మకమైనది. విశ్వంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకుని సమస్యలను సమర్ధవంతంగా ఎదుర్కొనే ఏకైక ప్రాణి మనిషి. ఈ భూలోకంలో అత్యంత ప్రావీణ్యుడిగా తననుతానూ మెరుగుపరుచుకుంటూ తన రోజువారీ సమస్యలపై నిరంతరం పరిశోధనల ద్వారా ఆధునిక జీవనంలోని సవాళ్ళను అధిగమిస్తూ ముందడుగు వేస్తున్నాడు. ఆదిమ మానవుడిగా కొండగుహల్లో నివసిస్తూ నేటి నవతర మానవునిగా అవతరించి, తన రూపాన్నిమరమనుషులుగా నిర్మించి ఇతర గ్రహాలకు పంపేంత జ్ఞానాన్ని సంపాదించిన అద్భుతమైన మేధావి మనిషి.
మనిషి రాతి యుగంలో నుంచి జన సమూహాలుగా నివసిస్తూ స్థిర నివాసాలను ఏర్పరుచుకొని జీవనం కొనసాగిస్తూ పంటల పెంపకాన్ని మొదలుపెట్టాడు. అఖండ భారతదేశంలో సుమారుగా 7000 బిసి నుంచి పంటలను పెంపకాన్నీ మొదలుపెట్టారు. కాలక్రమేణా గ్రామాలుగా, పట్టణాలుగా విస్తరించి జనాభా పెరుగుదల మొదలైంది. ఐక్యరాజ్య సమితి అంచనా ప్రకారం 2050 నాటికి ప్రపంచ జనాభా 9.8 బిలియన్లకు పెరగనుంది. పెరుగుతున్న జనాభా ఆహార కొరతకు దారి తీస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా 2023లో సుమారుగా 733 మిలియన్ల జనాభా ఆకలితో బాధపడుతున్నారు అనగా ప్రతి పది మందిలో ఒకరు ఆకలితో అల్లాడుతున్నారు (ఎస్‌ఒఎఫ్‌ఐ 2024). ఈ తరుణంలో పెరుగుతున్న జనాభా ఆహార కొరతను ఎదుర్కోవాలంటే వ్యవసాయ రంగంలో నూతన అడుగులు వేయాలి.
వ్యవసాయ రంగం క్లిష్టమైనది, దాన్ని ఆధునీకరించడానికి అందులోని విభిన్న విభాగాలు, పద్ధతులను అధునాతన సాంకేతిక విధానాలను జోడించి ముందుకు సాగాలి. అందులో భాగంగా వ్యవసాయాన్ని అంతరిక్షంలోని ప్రయోగాలతో అనుసంధానం చేయడం వల్ల వ్యవసాయం మరింత మెరుగుపరచవచ్చు. అంతరిక్ష పరిశోధనలు సాగుకు జోడించడం వల్ల ముఖ్యంగా రెండు విధాలుగా ఉపయోగపడుతుంది. అందులో ఒకటి భూతలంలో కచ్చితమైన వ్యవసాయాన్ని సాధించవచ్చు. ఇంకా రెండవది భూఉపరితం వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా అంతరిక్షంలో సాగును చేపట్టడం. ఇందులో మొదటిది ప్రస్తుత కాలానికి సంబంధించినది కాగా, రెండోది భవిష్యత్తరాలకు సంబంధించింది.
ప్రస్తుతం మన దేశంలో అంతరిక్షలోని రిసోర్స్ శాట్- 2, రిసోర్స్ శాట్- 2ఎ, రిసాట్-, రిసాట్ -1ఎ, హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ ఉపగ్రహం, కార్టోశాట్- 1, కల్పన- 1, ఇన్సాట్- 3డి, ఇన్సాట్- 3డిఆర్ మొదలగు ఉపగ్రహాలను ఉపయోగించి పంట విస్తీర్ణం, దిగుబడి, ఉత్పత్తిలను అంచనా వేయడానికి, ప్రాథమిక నేల సమాచారాన్ని, పంట బీమా అందించడానికి, పంట వ్యవస్థ అధ్యయనాలు లాంటి అనేక అంశాలకు సంబంధించిన సేవలు భూనిధి, భువన్ పోర్టల్స్ ద్వారా ఉపగ్రహ డేటాను ఉచితంగా వివిధ రకాల వాటాదారులు అందిస్తూ వ్యవసాయానికి తోడ్పడుతున్నాయి.
అంతేకాకుండా, ప్రత్యేకంగా వ్యవసాయ రంగానికి సంబంధించి నూతనంగా 2024 లో ఏర్పరిచిన డిజిటల్ జియో- స్పేషియల్ ప్లాట్ ఫామ్ అయినా కృషి -నిర్ణయ మద్దతు వ్యవస్థ ద్వారా ఉపగ్రహ చిత్రాలు, వాతావరణ సమాచారం, భూగర్భ జలమట్టాలు, నేల ఆరోగ్య సమాచారం, వాతావరణ నమూనాలు, నేల పరిస్థితులు, పంట ఆరోగ్యం, పంట విస్తీర్ణం వంటి సమగ్ర డేటాను, ఎప్పుడైనా, ఎక్కడి నుండైనా సులభంగా పొందే విధంగా వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడే వాటాదారులకు, రైతుల ఉపయోగపడనుంది. అయితే ప్రస్తుతం ఉన్న ఉపగ్రహాల వల్ల భారత దేశ వ్యవసాయ ప్రాంతాన్ని నిత్యం నిఘా వుంచడానికి సాధ్యపడదని, అదే విధంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న రిమోట్ సెన్సింగ్ డేటాను వ్యవసాయానికి తక్కువ వినియోగం జరుగుతున్నదని మాజీ ఇస్రో చైర్మన్ డా. సోమనాథ్ ఒక ముఖాముఖిలో కార్యక్రమంలో పేర్కొన్నారు.
అంతేకాకుండా దేశం మొత్తం వ్యవసాయ ప్రాంతాన్ని కవర్ చేయడానికి కనీసం రెండు ప్రత్యేక ఉపగ్రహాలు అవసరమని అభిప్రాయపడ్డారు.ఇంకా రెండవ అంశం గ్రహాంతర వ్యవసాయం, మానవ కార్యకలాపాల వల్ల భూమి మీద సహజ వనరులు తగ్గి భూమి జీవసామర్థ్యం తక్కువై మనిషి మనుగడకు కష్టతరమవుతుంది. గ్లోబల్ ఫుట్‌ప్రింట్ నెట్‌వర్క్ ప్రకారం మానవులు 1.7 భూమి వనరులను ఉపయోగిస్తున్నారు అంటే మనిషి మనుగడకు సుమారుగా 1.7 భూగోళాలు అవసరం. ఇది ఇలాగే కొనసాగితే 2050 నాటికి మనిషి మనుగడకు 3 భూగోళాలు ఉత్పత్తి చేసే వనరులు అవసరమని అంచనా.
భూసహజ వనరులలో మార్పులు, సమతుల్యత దెబ్బతినడం వల్ల భూమి ప్రారంభ దశ నుండి సుమారుగా ఐదుసార్లు భూమి మీద జీవులు సామూహికంగా అంతరించిపోయాయని శాస్త్రవేత్తల అంచనా.మానవ కార్యకలాపాల వల్ల భవిష్యత్‌లో ఏనాడైనా ఆరవసారి సామూహికంగా అంతరించిపోయే అవకాశం వుందని నిపుణుల అంచనా. భవిష్యత్‌లో భూమి మీద ఉన్న జీవులు సామూహికంగా అంతరించిపోవడానికి కారణం ఒక మహమ్మారి, వాతావరణ మార్పులు, ఒక పెద్ద గ్రహశకలం భూమిని ఢీకొనడం లాంటి కారణాల వల్లకావచ్చు. ఈ నేపథ్యంలో మనిషి మనుగడకు మరొక ఆవాస, నివాస యోగ్యమైన ప్రదేశం అవసరం. అనేక పరిశోధనల ద్వారా అంగారక గ్రహం, చంద్రుని వాతావరణం భూవాతావరణానికి దగ్గర పోలికలున్నాయి తేలింది.
ఈ నేపథ్యంలో గత డిసెంబర్ 30వ తారీఖున భారతీయ అంతరిక్ష పరిశోధన స్థానం పిఎస్‌ఎల్‌వి- సి60 రాకెట్ ద్వారా రోదసిలో వ్యోమనౌకల అనుసంధానం చేయడానికి గాను స్పెస్ డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్‌ను చేపట్టింది. అందులో నాల్గవ దశ అయినా పిఎస్‌ఎల్‌వి ఆర్బిటల్ ఎక్స్‌పెరిమెంట్ మోడ్యూల్- 4 (పిఒఇఎం-4)లో తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం రూపొందించిన క్రాప్స్ (కాంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటాల్ ప్లాంట్ స్టడీస్) అనే చిన్న పెట్టెలో 8 అలసంద (బొబ్బర్లు) గింజలను ఉంచి సూక్ష్మగురుత్వాకర్షణ వాతావరణంలో రెండు ఆకుల దశవరకు పెంచారు.
అదే విధంగా అమిటీ విశ్వవిద్యాలయం నిర్మించిన అమిటీ ప్లాంట్ ఎక్స్‌పెరిమెంటల్ మాడ్యూల్స్ ఇన్ స్పేస్ (ఎపిఇఎంఎస్) పేలోడ్‌లో పాలకూర కణజాలం వృద్ధి చెందడంతో అంతరిక్షంలో సూక్ష్మగురుత్వాకర్షణ వాతావరణంలో మొక్కల సాగుకు చేపట్టిన పరిశోధనలు విజయవంతమయ్యాయి. ఈ రెండు ప్రయోగాలు భారతీయ గ్రహాంతర వ్యవసాయానికి చారిత్రాత్మక మైలు రాయిగా నిలిచాయి. ఈ ప్రయోగాల వల్ల భవిషత్‌లో నిర్మించబోయే భారతీయ అంతరిక్ష కేంద్రనికి తొలి అడుగులుగా పరిగణించవచ్చు. మొక్కలను అంతరిక్షంలో పెంచడం వల్ల వ్యోమగాముల దీర్ఘకాలం అంతరిక్షంలో వుండి పరిశోధనలు చేయడానికి వీలవుతుంది. అదే విధంగా అంతరిక్షంలో స్థిర నివాసాల అధ్యయనానికి తోడ్పడుతుంది.
ప్రస్తుతం రెండు అంతరిక్ష కేంద్రాలు క్రియాశీలకంగా ఉన్నాయి. అందులో ఒకటి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కాగా, రెండోది చైనా టియాంగాంగ్ అంతరిక్ష కేంద్రం. ఈ రెండింటిలోనూ సూక్ష్మగురుత్వాకర్షణ వాతావరణంలో మొక్కల పెరుగుదల సౌకర్యాలు వున్నాయి. ప్రధానంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అత్యాధునికమైన జీవపరిశోధన డబ్బాలు, కూరగాయల ఉత్పత్తి వ్యవస్థ, పెట్రి డిష్ ఫిక్సేషన్ యూనిట్, మొక్కల ప్రయోగ విభాగం/ కణ జీవశాస్త్రం ప్రయోగ సౌకర్యం, అధునాతన మొక్కల నివాసం లాంటి వసతులు ఉన్నాయి. ఇప్పటివరకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పాలకూర, క్యాబేజీ, ఆవాలు, అరబిడోప్సిస్ మొదలగు మొక్కలను విజయవంతంగా పెంచారు.
భారతదేశం చేపట్టిన చంద్రయాన్ 1 పరిశోధన వల్ల చంద్రుని పై నీటి ఆనవాళ్లు, చంద్రయాన్- 3 కాలు మోపిన ప్రదేశంలో అన్ని రకాల ప్రధాన మూలకాలు, అనేక తక్కువ ప్రధానమైన మూలకాలున్నాయని నిర్ధారించింది. ఈ ప్రయోగాల వల్ల భవిష్యత్ చంద్రునిపై సాగుకు, స్థిర నివాసాల పరిశోధనలకు పునాది రాళ్లు. ఈ విధంగా అంతరిక్షంలో సాగుకు మరిన్ని విజయాలు అందాలని కోరుకుంటూ, వ్యవసాయ అభివృద్ధికి మరిన్ని ప్రత్యేక కృత్రిమ ఉపగ్రహాలు ప్రయోగించాలని ఆశిస్తూ, అంతేకాకుండా భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి పరిధిలో ప్రత్యేకంగా అంతరిక్షంలో సాగుపై అధ్యయనానికి జాతీయ స్థాయిలో ఒక పరిశోధన సంస్థను లేదా కేంద్రాన్ని ఏర్పాటు చేసి దేశ రైతు సాగుకి తోడ్పడాలని కోరుకుందాం.
– రేపల్లె నాగన్న
-79908 42149