Sunday, March 9, 2025

ఔషధాల తయారీలో నాణ్యత ప్రమాణాలు ముఖ్యం

- Advertisement -
- Advertisement -

భారత్ నుంచి వచ్చే ఫార్మాస్యూటికల్స్‌తో సహా అనేక కేటగిరీల దిగుమతులపై 25% టారిఫ్ విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించడం అనేక ప్రకంపనలకు దారితీస్తోంది. ఇలాంటి ప్రతీకార సుంకాలవల్ల భారత్‌లోని ఫార్మారంగానికి ఎదురయ్యే సమస్యలు ఎలా ఉన్నా అమెరికా ఆరోగ్య భద్రతా వ్యవస్థకే ఎక్కువ నష్టం కలుగుతుందని అనేక మంది నిపుణులు ఉదహరిస్తున్నారు. భారత్‌నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే ఫార్మా ఉత్పత్తుల్లో జనరిక్, భారీ డ్రగ్స్, వ్యాక్సిన్లు, కేన్సర్, ఇతర సంక్లిష్ట వ్యాధుల నివారణకు అవసరమయ్యే బయోసిమిలర్స్ ఉంటాయి. అమెరికాలో ప్రిస్ర్కైబ్ చేసిన సగానికి మించి జనరిక్ ఔషధాలు భారత్‌నుంచి ఎగుమతి అవుతున్నవే. భారత్, చైనా నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే అతి చవకైన జనరిక్ ఔషధాలవల్ల అమెరికా ఆరోగ్యభద్రతా వ్యవస్థ 2022లో 408 బిలియన్ డాలర్ల వరకు ఆదా చేయగలిగింది.

భారత్‌కు చెందిన 50 బిలియన్ డాలర్ల ఫార్మా పరిశ్రమకు చెందిన సగానికి సగం ఎగుమతులు ప్రపంచం మొత్తం ఎగుమతుల్లో మూడో స్థానంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత్ నుంచి దిగుమతి అయ్యే ఫార్మా ఉత్పత్తులపై అత్యధిక సుంకాలు విధించడం కేవలం భారత ఔషధ కంపెనీలకే కాదు, అమెరికా ప్రజారోగ్య వ్యవస్థపై కూడా తీవ్ర పరిణామాల ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ పరిస్థితుల్లో భారత ఫార్మారంగం తాను ఉత్పత్తి చేసే ఔషధాల నాణ్యతలో ఎలాంటి కళంకం లేకుండా ఉన్నత ప్రమాణాలు పాటించవలసి ఉంది. గతంలో భారత్‌లో తయారైన ఔషధాలు రోగులపై దుష్పరిణామాలు కలిగిస్తున్నాయని విదేశాల్లో చెడ్డపేరు తీసుకొచ్చిన సంఘటనలు జరిగాయి.

కామెరాన్, గాంబియా, ఉజ్బెకిస్థాన్ దేశాల్లో పిల్లల మరణాలకు భారత్ నుంచి వచ్చిన ఔషధాల వాడకమే కారణమైందన్న అప్రతిష్ఠ వచ్చింది. గాంబియాలో దగ్గు, జలుబునుంచి ఉపశమనం పొందడానికి వాడే సిరప్‌లతో 66 మంది చిన్నారులు మృత్యువాతపడడం సంచలనం కలిగించింది. భారత్‌లో ఓ కంపెనీ తయారు చేసిన సిరప్‌లే చిన్నారులను బలి తీసుకున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ సిరప్‌ల వల్లనే అనేక మంది కిడ్నీలు దెబ్బతిన్నాయని పేర్కొంది. అంతేకాదు ఈ మందుల దుష్ఫలితాలపై ఇతర దేశాలను కూడా హెచ్చరించింది. భారత్‌లోని హర్యానాలో మైడెన్ ఫార్మా స్యూటికల్స్ తయారు చేసిన సిరప్‌లే చిన్నారులను బలిగొన్నాయని సాక్షాత్తు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ వెల్లడించడం చెప్పుకోతగ్గది.

దీనిపై ఆనాడు భారత ప్రభుత్వం దర్యాప్తు చేపట్టి చిన్నారుల మృతికి కారణమైన సిరప్‌లను ఆ సంస్థ అసలు భారత్‌లోనే విక్రయించలేదని, కేవలం విదేశాలకు ఎగుమతి చేయడానికే తయారు చేశారని ప్రకటించింది. దీన్ని బట్టి విదేశాలకు భారత్ నుంచి ఎగుమతి అవుతున్న ఔషధాల్లో నాణ్యత ఎంత లోపభూయిష్టంగా ఉంటోందో వెల్లడవుతోంది. ఈ పరిస్థితుల్లో భారత్‌లో ఔషధాల తయారీ నాణ్యతపై దృష్టి కేంద్రీకరించవలసి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ట్రంప్ విధించిన 25% టారిఫ్‌ల ప్రభావ అవకాశాలను దేశీయ ఔషధ పరిశ్రమ అర్థం చేసుకుంటున్న తరుణంలోనే మరో కళంకం తెరపైకి వచ్చింది. ముంబై కేంద్రంగా ఉన్న ఏవియో ఫార్మాస్యూటికల్స్ విదేశాల్లో అక్రమంగా ఔషధాలను విక్రయిస్తోందని బయటపడడం, దీనిపై దర్యాప్తు ప్రారంభం కావడం ఆలోచించవలసిన అంశం.

ఈ కంపెనీ పశ్చిమాఫ్రికా దేశాల్లో తమకు విక్రయించే లైసెన్సు లేకున్నా ఓపియాయిడ్స్ (నల్లమందు గసగసాల మొక్కలో లభించే సహజ పదార్ధాల నుంచి ఉత్పన్నమయ్యే ఔషధాలు)ను ఎగుమతి చేస్తున్నట్టు బిబిసి పరిశోధనలో బయటపడింది.ఈ నివేదికతో నైజీరియా, ఘనా, కోటే డి ఐవోయిర్ తదితర దేశాల ప్రజారోగ్యవ్యవస్థల్లో ఆందోళన చెలరేగింది. ఏవియో సంస్థ టాపెంటాడోల్ అనే స్ట్రాంగ్ ఓపియాయిడ్‌తో, కండరాల సడలింపునకు వాడే ఔషధం కారిసోప్రోడాల్‌తో కలిపి తయారు చేస్తున్నట్టు బయటపడింది. ఈ మాత్రల దిగుమతులను నైజీరియా 2018లో నిషేధించిన తరువాత భారత్‌లో కూడా దీనిపై నియంత్రణ చర్యలు మరింత కఠినతరం చేశారు.

అన్ని రకాల అనుమతులు లేని టాపెంటాడోల్, కారిసోప్రోడాల్ కాంబినేషన్లు ఎగుమతులకు క్లియరెన్స్ సర్టిఫికెట్లను ఫిబ్రవరి 21న ఇండియా డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఉపసంహరించింది. అనేక సంవత్సరాలుగా భారత్‌లో తయారవుతున్న ఔషధాలు విషపూరితమని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అభ్యంతరాలు చెప్పడంతో విదేశాల్లో తిరస్కారం ఎదురైంది.ఔషధాల తయారీలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం, సమగ్రత లోపించిన డేటా, నిబంధనల ఉల్లంఘన ఫలితంగా ఔషధ ఉత్పతులు చెల్లుబాటు కావడంలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News