కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిథరూర్ విషయమై ఇటీవల తలెత్తిన వివాదాన్ని గమనించినపుడు, ఆ పార్టీకి మొదటినుంచి గల ఉదారవాద సంప్రదాయాలు అనివార్యంగా గుర్తుకు వస్తాయి. ఆ పార్టీ 1885 లో ఆరంభమైనప్పటి నుంచి 1947లో దేశ స్వాతంత్య్రం వరకు, ఆ తర్వాత కూడా కొన్ని దశాబ్దాల పాటు కొనసాగిన ఈ సంప్రదాయాలు పార్టీ బలాలలో ఒకటిగా ఉండేవి. అందువల్లనే రాజకీయంగా అపుడపుడు ఒడిదుడుకులు ఎదురైనా, తీవ్రమైన సమస్యలంటూ సంస్థాపరంగా ఏర్పడలేదు. పాలనా పరమైన వైఫల్యాల వల్ల సమస్యలు వచ్చినా, సంస్థ మాత్రం పటిష్టంగానే కొనసాగింది. ఆ పరిస్థితుల కొంతకాలంగా మారుతున్నాయి. అందుకు ఒక ముఖ్యకారణం తన ఉదారవాదాన్ని వదలివేస్తుండటం.
థరూర్‌కు సంబంధించి జరిగిందేమిటో ముందుగా చూసి, తక్కిన చర్చలోకి తర్వాత వెళదాము. ఆయన కొచ్చిన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సభలో జనవరి 12న ప్రసంగిస్తూ, ఆ రాష్ట్రం సాధించిన ఆర్థిక ప్రగతి గురించి కొన్ని వివరాలు ప్రస్తావించారు. అవన్నీ ‘2024 గ్లోబల్ స్టార్టప్ ఎకో సిస్టమ్ రిపోర్టు’ నుంచి తీసుకున్నవి. ఆ నివేదిక మొత్తం ప్రపంచంలోని 45 లక్షల స్టార్టప్ కంపెనీల పనితీరును మదింపు చేసి రూపొందించినది. దాని ప్రకారం, కేరళ కంపెనీలు సాధించిన విలువ 1.7 బిలియన్ల అమెరికన్ డాలర్లు. 2021 జులై నుంచి 2023 డిసెంబర్ వరకు వాటి వృద్ధిరేటు మొత్తం ప్రపంచంలో సగటున 46 శాతం కాగా, కేరళ రేటు 254 శాతం. ఇది 5 రెట్ల కన్న ఎక్కువ. అదే నివేదికను ఆధారం చేసుకుంటూ కేరళ ఆర్థికాభివృద్ధి గురించి థరూర్ మరి కొన్ని వివరాలు కూడా పేర్కొన్నారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో కేరళ ర్యాంకులు పెరగటాన్ని ఉదహరించారు. అదే విధంగా ద న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లోనూ ఒక వ్యాసం రాసారు. దానితో కాంగ్రెస్ పార్టీ కేరళ శాఖ ఒక్కసారిగా థరూర్‌పై విరుచుకుపడింది. విమర్శలు చేయటమే గాక, ఆయన తన లెక్కలు సరిచూసుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. లెక్కలు సరిగానే ఉన్నాయని, క్షమాపణ చెప్పవలసిందేమీ లేదన్నిది ఆయన సమాధానం. అగ్నికి ఆజ్యం తోడైనట్లు తర్వాత రోజున మరొకటి జరిగింది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక మలయాళం పాడ్‌కాస్ట్ ఇంటర్వూలో తను మాట్లాడుతూ, రాజకీయాలు కాకుండా తనకు రచనలు, ప్రసంగాలు, ప్రపంచ వ్యాప్తంగా ఆహ్వానాలు, సమావేశాల వంటి ఇతర అవకాశాలు కూడా ఉన్నాయని, రాజకీయాలూ పార్లమెంట్ సమావేశాల వల్ల అన్నిటికీ వెళ్లలేకపోతున్నానని చెప్పారు.
ఆ పాడ్‌కాస్ట్ వారు ఆ పాఠాన్ని ఇంగ్లీషులోకి అనువాదం చేస్తూ, తనకు వేరే రాజకీయ అవకాశాలు కూడా ఉన్నాయన్నట్లు రాసారు. అందుకు తర్వాత క్షమాపణలు చెప్పారు గాని ఆలోగా భూకంపం రానే వచ్చింది. థరూర్‌పై దాడి చేసిన కాంగ్రెస్ నాయకులు మలయాళీలే. మలయాళ పాడ్ కాస్ట్‌లో ఏమున్నదో వారు చూడగలరు. చూసే ఉంటారు కూడా. అయినా అంతా రాజకీయమయం గనుక తమ విమర్శలు ఆపలేదు. ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ ది కేరళ అయినందున విషయాన్ని ఆయన ద్వారా రాహుల్ గాంధీకి చేరవేసారు. థరూర్‌కు కష్టాలు కట్టగట్టుకుని రావటంతో సమస్య అంతటితో ఆగలేదు. అదే రోజులలో, ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో సమావేశం కావటం మంచి పని అని ఆయన ఒక మాట అన్నారు. దానితో మీడియా సంస్థలు, “ఇతర అవకాశాలు” అనే మాటను దీనికి ముడిపెట్టి తను బిజెపిలో చేరనున్నారా అనే కథనాలు రాయటం మొదలుపెట్టాయి.
కేరళ అభివృద్ధి గురించి థరూర్ ప్రసంగాన్ని వేణుగోపాల్ సైతం అప్పటికే విమర్శించారు. కాని ప్రసంగం పూర్తి పాఠాన్నీ వీరెవరూ చదివినట్లు లేరు. అందులో మోడీపై చాలా విమర్శలున్నాయి. ఆర్థిక రంగం, పారిశ్రామికరంగం, మేకిన్ ఇండియా, ఉద్యోగ కల్పన, మహిళలకు అవకాశాలు మొదలైన పలు అంశాలు పరిస్థితిని థరూర్ స్పష్టంగా విమర్శించారు. అయినా ఆగని కేరళ కాంగ్రెస్ నాయకులు తనను పార్టీనుంచి వెళ్ళిపోవాలనటం మొదలుపెట్టారు. ఈ పరిస్థితులలో థరూర్ వాస్తవాలను వివరించేందుకు రాహుల్ గాంధీని అపాయింట్‌మెంట్ కోరారు. విశేషం ఏమంటే, థరూర్ ఎన్నిసార్లు కోరినా గత మూడేళ్లుగా తనను కలవని రాహుల్, ఈసారి మాత్రం అపాయింట్‌మెంట్ ఇచ్చారు.
ఆ సమయంలో వేణుగోపాల్ అక్కడే ఉన్నా లోపలకు పిలవలేదు. అరగంట పాటు సాగిన ముఖాముఖి సమావేశంలో ఏమి జరిగిందన్నది తెలియదు. థరూర్ నాల్గవసారి కాంగ్రెస్ ఎంపి. దేశంలోనే గాక విదేశాలలో పేరున్న విద్యాధికుడు, రచయిత. ఎంతో గౌరవనీయుడైన వ్యక్తి. ఐక్యరాజ్య సమితి ఉప కార్యదర్శిగా పనిచేసి, ప్రధాన కార్యదర్శి పదవికి భారతదేశం పక్షాన పోటీ పడినవాడు. ఇన్నిన్ని అర్హతలు గలవారు మరెవరూ కాంగ్రెస్‌లో ప్రస్తుతమైతే లేరు. అటువంటపుడు, ఉదారవాదంతో పుట్టి ఎదిగిన ఒక పార్టీ ఆయన పట్ల ఎట్లా వ్యవహరించాలి? అయితే ఇందుకు ఒక నేపథ్యం ఉంది. కాంగ్రెస్ బాగా బలహీనపడుతుండిన స్థితిలో 2020లో పార్టీకి చెందిన 23 మంది సీనియర్లు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఒక లేఖరాయటం తెలిసిన విషయమే. అ బృందంలో థరూర్ ఒకరు.
ఆ లేఖకు వారు ‘అసమ్మతిలేఖ’ (లెటర్ ఆఫ్ డిస్సెంట్) అని పేరు పెడుతూ, పార్టీ విషయాలపై “ఉమ్మడి ఆలోచనలు, ఉమ్మడి నిర్ణయాలు” జరగాలని కోరారు. పార్లమెంటరీ బోర్డుకు, వర్కింగ్ కమిటీకి ఎన్నికలు జరగాలని సూచించారు. ఈ సంస్థలు నామకార్థం ఉన్నా ఆలోచనలు నిర్ణయాలు, నియామకాలు ఎట్లా జరిగేదీ రహస్యం కాదు. అందువల్ల పార్టీ బలహీనపడుతున్నదని, కనుక బలోపేతం చేయాలని కూడా వారన్నారు. నాయకత్వం నుంచి సోనియా వైదొలగాలని కపిల్ సిబ్బల్ కోరగా, ఆ మాటను గులాం నబీ ఆజాద్ ఖండించారు కూడా. ఆ సీనియర్లు పార్టీ వ్యతిరేకులు ఎంత మాత్రం కారు. సోనియాను వ్యతిరేకించేవారు కాదు. పార్టీ శక్తివంతం కావాలని బలంగా కోరుకున్నారు.
కాకపోతే, రాహుల్ గాంధీకి శక్తిసామర్థాలు లేవన్న భావన అంతటా ఉండేది గనుక, ఉమ్మడి భాగస్వామ్యం ద్వారా బలమైన నాయకత్వం పార్టీ భవిష్యత్తుకు అవసరమని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌కు గనుక తన సంప్రదాయికమైన ఉదార స్వభావం, ప్రజా స్వామికత ఉండి ఉంటే, సంస్థ క్షేమాన్ని కోరే ఆ సీనియర్లతో చర్చించి అవసరమైన మార్పు చేర్పులు చేసుకోవాలి. కాని అందుకు ఏమాత్రం ప్రయత్నించకుండా ఉదయపూర్‌లో జరిగిని చింతన్ శిబిర్‌లో వారి సూచనలను మొత్తంగా తిరస్కరించారు. కనీసం చర్చించి అందులోని మంచి చెడులను వారికి, పార్టీకి వివరించి ఆ మేరకు నిర్ణయించి ఉంటే అది కాంగ్రెస్ ఉదారవాద సంప్రదాయానికి, ప్రజాస్వామికతకు అనుగుణంగా ఉండేది.
అందుకు బదులు రకరకాలు యుక్తులతో ఆ బృందాన్ని కకావికలు చేసారు. బృందంలోని సభ్యుడైన థరూర్ ఆ తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష స్థానానికి సోనియా గాంధీతో పోటీ చేసారు. తన వంటి స్థాయి గల వానికి రాహులో మూడేళ్లుగా అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవటం వెనుక ఈ నేపథ్యమంతా ఉందని భావిస్తే కాదనటం కష్టం. కాని ఆ క్రమంలో రాహుల్ ఎంత ఉదారవాదో, ప్రజాస్వామిక వాదో అందరికీ మరింతగా తెలియవచ్చింది. ఆ కుటుంబపు తత్తం మరింత బోధపడింది.కాంగ్రెస్ పార్టీకి అది వ్యవస్థాపితమైన 1885 నుంచే అద్భుతమైన ప్రజాస్వామిక, ఉదారవాద చరిత్ర ఉంది. ఈ లక్షణాలు పాశ్చాత్య దేశాలలో ఆర్థికాభివృద్ది క్రమంలో రాగా, భారత దేశంలో అపుడున్నది భూస్వామ్య, రాచరిక, వలస పాలనా వ్యవస్థ అయినప్పటికీ వచ్చాయి.
అందుకు కారణాలను వివరంగా చర్చించలేముగాని, విద్యావంతుల తరగతి పెరుగుతుండటం, ఒక మేర జరిగిన పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, పాశ్చాత్య విద్యలూ వాటి భావజాలాల ప్రభావాలు, కొన్ని సంస్కరణ వాద ఉద్యమాలు, విప్లవ సంస్థల కార్యకలాపాలు, జాతీయతా భావనలు వ్యాప్తి, ఈ సువిశాల దేశంలోని వైవిధ్యతల దృష్టా అన్నిప్రాంతాలను, వర్గాలను జాతీయోద్యమంలో ఏకం చేయవలసిన అవసరం, వేర్వేరు భావజాలాల చర్చలు, సంఘర్షణల వంటివన్నీ కలిసి కాంగ్రెస్‌ను ప్రజాస్వామికంగా ఉదారవాద స్వభావ పూరితంగా రూపుదిద్దుతూ పోయాయి.
దానిని ఒక అంబరెల్లా పార్టీగా మార్చాయి. ఇదంతా స్వాతంత్య్రానంతరం రాజ్యాంగంలో ప్రతిఫలించటం, కాంగ్రెస్‌తో తీవ్రంగా విభేదించిన శక్తులను, అంబేద్కర్, శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ వంటి వ్యక్తులను కూడా తమతో కలుపుకొని తీసుకు వెళ్లటం దేశ ప్రగతికి సమిష్టి కృష్టి అవసరమని భావించటం తెలిసిన విషయాలే. ఇటువంటి క్రమం వలస పాలన నుంచి విముక్తి చెందిన మరే దేశంలోనూ జరగలేదు. అదే సంప్రదాయాలను కొనసాగిస్తూ పోయి ఉంటే పరిస్థితులు మరొక విధంగా ఉండేవి. కాని పలు స్వయంకృతాల వల్ల కాంగ్రెస్ బలహీన పడుతూ రాగా, ఉదారవాద, ప్రజాస్వామిక లక్షణాలు కూడా బలహీనపడటం ఇందిరా గాంధీ కాలం నుంచి మొదలైంది. అన్నీ కేంద్రీకృతం కావటం విమర్శను కాదు గదా కనీసం భిన్నాభిప్రాయాలను సహించలేని దశకు కాంగ్రెస్ చేరుకుంది.
మధ్యలో రాజీవ్ గాంధీ కొంత మేర భిన్నంగా వ్యవహరించారు. ఆ తర్వాత అంతా మాయమైపోయింది. రాహుల్ తాను ప్రజాస్వామిక మార్పులు తీసుకు రాగలనని, పార్టీ సభ్యత్వంతో పాటు అన్ని స్థాయిలకు ఎన్నికలు జరిపించగలనని ఒక దశలో చేసిన ఆర్భాటాలు ముందుకు సాగలేదు. ఈ పరిణామాలను మధ్య తన కసలు ఉదారవాద, ప్రజాస్వామిక లక్షణాలు ఉన్నాయా అనే సందేహం కలుగుతుంది. కాని, ఇండియా వంటి దేశంలో కాంగ్రెస్‌కు జన్మనిచ్చిన వైవిధ్య సమాజంలో మరీ ముఖ్యంగా వర్తమాన క్లిష్ట పరిస్థితులలో, తన సంప్రదాయిక ఉదారవాదం, ప్రజాస్వామికతలను తిరిగి ఆవాహన చేసుకోవటం కాంగ్రెస్‌కు ఒక తప్పనిసరి అవసరం.
– టంకశాల అశోక్
-దూర దృష్టి