దుబాయి: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ సమరానికి టీమిండియా, న్యూజిలాండ్ జట్లు సిద్ధమవుతున్నాయి. దుబాయి వేదికగా ఇరు జట్ల మధ్య ఆదివారం తుదిపోరు జరుగనుంది. లీగ్ దశలో కివీస్‌ను ఓడించిన భారత్ ఫైనల్లోనూ అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. దీంతో తుది పోరు హోరాహోరీగా సాగుతుందని విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు. ఐసిసి నాకౌట్ పోటీల్లో భారత్‌పై న్యూజిలాండ్ ఆధిక్యంలో ఉంది. గతంలో ఓసారి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్‌ను న్యూజిలాండ్ ఓడించింది. ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించేందుకు సిద్ధమైంది. డబ్లూటిసి ఫైనల్లో కూడా భారత్‌ను ఓడించిన న్యూజిలాండ్ ఆత్మవిశ్వాసంతో ఫైనల్ బరిలో దిగుతోంది. కానీ ఈసారి టీమిండియా ప్రతీకారం తీర్చుకోవాలనే లక్షంతో కనిపిస్తోంది.
కివీస్‌ను ఓడించి గతంలో ఎదురైన పరాజయాలకు జవాబివ్వాలని భావిస్తోంది. ఈసారి మెగా టోర్నమెంట్‌లో రెండు జట్లు కూడా మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాయి. లీగ్ దశలో భారత్ మూడు మ్యాచుల్లో విజయం సాధించింది. బంగ్లాదేశ్, పాకిస్థాన్, న్యూజిలాండ్‌లను మట్టికరిపించి లీగ్ దశలో అజేయంగా నిలిచింది. సెమీ ఫైనల్లోనూ బలమైన ఆస్ట్రేలియాను ఓడించింది. న్యూజిలాండ్ లీగ్ దశలో పాకిస్థాన్, బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. అయితే భారత్ చేతిలో మాత్రం పరాజయం చవిచూసింది. ఇక ఫైనల్ కోసం రెండు జట్లు సమరోత్సాహంతో సిద్ధమవుతున్నాయి. ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో కనిపిస్తున్నాయి. దీంతో తుది పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయమని చెప్పాలి.