Tuesday, April 8, 2025

300 ఏళ్లుగా వాళ్లకు దేవుడి దర్శనం దక్కలేదు

- Advertisement -
- Advertisement -

స్వాతంత్రం వచ్చి 77 ఏళ్లు గడిచినా ఇప్పటికీ దళితుల పట్ల కులవివక్ష కొనసాగుతోందంటే ఆశ్చర్యం కలగక మానదు. పశ్చిమబెంగాల్ లోని తూర్పు బుర్ద్వాన్ జిల్లాలోని కట్టోవా, ఇతర గ్రామాల్లో దాదాపు 130 దళిత కుటుంబాలు కులవివక్షకు గురవుతున్నాయి. ఆ ప్రాంతంలో 300 ఏళ్లనాటి శివాలయం ఉంది. దళితులకు మాత్రం అందులోకి ప్రవేశం లేదు. శివరాత్రి నాడు శివాలయంలో ప్రవేశించేందుకు దళిత కుటుంబాలు సిద్ధపడి, పోలీసు, గ్రామ పెద్దల సహకారం కోరినా.. దేవాలయంలోకి అడుగు పెట్టే అవకాశం లేకపోయింది. కానీ, ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గిధగ్రామ్ లోని దాస్పరా ప్రాంతంలో అందరి ఇంటిపేర్లు దాస్‌తో ఉంటాయి. వారంతా చెప్పులు కుట్టే, నేత పనిచేసేవారు, వ్యవసాయకూలీలు, పశువుల కాపరులు.

వారిని తక్కువ కులాలవారు అన్న సాకుతో అగ్రకులాలవారు శివరాత్రినాడు గిధేశ్వర్ శివాలయంలోకి రానివ్వడంలేదు. శివరాత్రి నాడు అనుభవం నేపథ్యంలో వారు పోరాటానికి సిద్ధమయ్యారు. రాష్ట్రప్రభుత్వం ఈ వివక్ష రూపమాపని పక్షంలో కోర్టులకు ఎక్కి, న్యాయపోరాటం సాగిస్తామని బాధితులు హెచ్చరిస్తున్నారు. ఆధునిక బెంగాల్ లో కులవివక్షకు తావులేదు. రాజ్యాంగం 25 అధికరణం ప్రకారం పౌరులందరికీ తమ ఇష్టమైన దైవాన్ని పూజించకునే స్వేచ్ఛ వారి మౌలిక హక్కు. కానీ, ఈ ప్రాంతంలో 300 ఏళ్లుగా దేవాలయంకి అగ్రకులాలవారు రానివ్వడం లేదు. ఫిబ్రవరి 26న శివరాత్రి నాడు వివక్షకు గురవుతున్న కుటుంబాలవారు దేవాలయంలో ప్రవేశానికి సిద్ధమయ్యారు. ఇద్దరు ఎమ్మెల్యేలు, పోలీసుల సమక్షంలో రెండు వర్గాలమధ్య ఓ అంగీకారం కుదిరినా, అది కాగితానికే పరిమితమైంది. శివరాత్రి సందర్భంగా జాతర జరుగుతున్నందువల్ల, దళితులు దేవాలయంలో ప్రవేశించే ప్రయత్నం చేస్తే.. శాంతి భద్రతల సమస్యకు దారితీస్తుందని, ఆ కుటుంబాలను పోలీసులు, గ్రామాధికారులు హెచ్చరించారు. తర్వాత వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులను అగ్రకులాలవారు ఇబ్బందుల పాలు చేస్తున్నారు.

మార్చి 7న జాతర ముగిసిన తర్వాత, దేవాలయంలో ప్రవేశించేందుకు వారిని రమ్మన్నా.. పోలీసులు, బిడివోతో కలిసి వెళ్లినా.. దేవాలయం గేటు మూసి,తాళం వేశారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఉండడంతో దళితులు వెనుదిరిగారు. అగ్రకులాల గ్రామస్తుల హెచ్చరికలతో దాస్‌లనుంచి పాల సేకరణ కంపెనీలు పాలు కూడా సేకరించడం లేదు. దీంతో దాదాపు 30-40 కుటుంబాలు నష్టపోతున్నాయి. 300 ఏళ్లుగా దళితులు ఎన్నడూ గుడిలో ప్రవేశించలేదని, ఆ ఆచారాన్ని ఉల్లంఘిస్తే.. గ్రామంలో అశాంతి తలెత్తే ప్రమాదం ఉందని,అందువల్ల పాలనా యంత్రాంగం జాగ్రత్తగా వ్యవహరించాలని ఆలయకమిటీ సభ్యుడు దీనబంధు మండల్ అంటున్నారు. అన్ని వర్గాలను ఒప్పంచడానికి కొంత కాలం పడుతుందని మంగళ్ కోట్ ఎమ్మెల్యే అపూర్బ చౌదరి అన్నారు. కాగా, కులవివక్ష తొలగించి, తమకు న్యాయం చేయాలని దాస కుటుంబాలు కోరుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News