Monday, March 10, 2025

‘కప్పు’ కొట్టేదెవరు?

- Advertisement -
- Advertisement -

నేడు
ఛాంపియన్స్
ట్రోఫీ ఫైనల్
న్యూజిలాండ్‌తో
భారత్ ఢీ

దుబాయి: అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ఐసిసి వన్డే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ సమరానికి భారత్, న్యూజిలాండ్ జట్లు సమరోత్సాహంతో సిద్ధమయ్యాయి. ఇరు జట్ల మధ్య దుబాయి వేదికగా ఆదివారం తుది పోరు జరుగనుంది. భారత్ ఒక్క మ్యాచ్ ఓడకుండానే ఫైనల్‌కు చేరింది. అంతేగాక తుది పోరుకు అర్హత సాధించే క్రమంలో న్యూజిలాండ్‌ను కూడా మట్టికరిపించింది. తాజాగా ఇరు జట్ల మధ్య మరోసారి పోరు జరుగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ను ఓడించి ట్రోఫీని సొంతం చేసుకోవాలనే పట్టుదలతో న్యూజిలాండ్ ఉంది. మరోవైపు గతంలో ఛాంపియన్స్ ట్రోఫీ, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకోవాలనే లక్షంతో భారత్ బరిలోకి దిగుతోంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. దీంతో తుది సమరం నువ్వానేనా అన్నట్టు సాగడం ఖాయం.

ఓపెనర్లే కీలకం..
ఈ మ్యాచ్‌లో భారత్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మ న్ గిల్‌లు కీలకంగా మారారు. కొన్ని మ్యాచులుగా వీరిద్దరూ శుభారంభం అందించలేక పోతున్నారు. కీలకమై న ఫైనల్లో వీరు జట్టుకు మెరుగైన ఆరంభాన్ని అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన రోహిత్, గిల్‌లు త మదైన శైలీలో చెలరేగితే భారత్‌కు శుభారంభం ఖాయం.

అందరి కళ్లు కోహ్లిపైనే..
మరోవైపు కిందటి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో అద్భుత బ్యాటింగ్‌తో భారత్‌ను గెలిపించిన సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఫైనల్ పోరుకు ప్రత్యేక ఆకర్షణగా మారాడు. ఈ మ్యాచ్‌లో కూడా జట్టు అతనిపై భారీ ఆశలు పెట్టుకుంది. పాకిస్థాన్‌పై సెంచరీతో ఆకట్టుకున్న కోహ్లి ఆస్ట్రేలియాతో జరిగే సెమీస్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈసారి కూడా జట్టును ముందుండి నడిపించాలనే పట్టుదలతో ఉన్నాడు. కోహ్లి విజృంభిస్తే భారత్‌కు ఫైనల్లో భారీ స్కోరు ఖాయం. ఇక శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజాలతో భారత బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. ఈ ట్రోఫీలో వీరంతా మెరుగైన బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలుస్తున్నారు. ఫైనల్లోనూ సత్తా చాటాలనే లక్షంతో ఉన్నారు. బౌలింగ్‌లో కూడా భారత్‌కు ఎదురులేదు. వరుణ్ చక్రవర్తి, షమి, హార్దిక్, అక్షర్, జడేజా తదితరులు మెరుగైన బౌలింగ్‌తో అలరిస్తున్నారు. ఫైనల్లో కూడా మెరుగైన ప్రదర్శన చేయాలనే పట్టుదలతో కనిపిస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలంగా ఉన్న భారత్ ఈ మ్యాచ్‌లో ఫెవరేట్‌గా బరిలోకి దిగుతోంది.

తక్కువ అంచనా వేయలేం..
ఇక న్యూజిలాండ్ టీమ్‌ను తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. అత్యంత నిలకడైన ఆటకు మరో పేరుగా కివీస్‌ను చెప్పొచ్చు. తమదైన ఆటతో ఎంత పెద్ద జట్టునైనా మట్టికరిపించే సత్తా న్యూజిలాండ్‌కు ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో జట్టు సమతూకంగా ఉంది. విల్ యంగ్, కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, టామ్ లాథమ్, డారిల్ మిఛెల్, బ్రేస్‌వెల్, సాంట్నర్ తదితరులతో కివీస్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. ఈ టోర్నమెంట్‌లో విలియమ్సన్, రచిన్, యంగ్‌లు ఆకాశమే హద్దుగా చెలరేగి పోతున్నారు. భారత్‌తో జరిగే ఫైనల్లోనూ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. బౌలింగ్‌లోనూ కివీస్ బలంగానే ఉంది. మ్యాట్ హెన్రీ, బ్రేస్‌వెల్, ఓరౌర్కే, సాంట్నర్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు జట్టులో ఉన్నారు. రెండు విభాగాల్లోనూ బలంగా ఉన్న కివీస్ భారీ ఆశలతో ఫైనల్‌కు సిద్ధమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News