Monday, March 10, 2025

తీరని దాహార్తిలో దేశ జనాభా

- Advertisement -
- Advertisement -

భూమి మీద వృక్షాలు, జంతువులు మానవాళి మనుగడకు, వాటి పెరుగుదలకు గాలి తరువాత ముఖ్యమైనది నీరు. ఇది ప్రకృతి సమస్త జీవులకు ప్రసాదించిన ఒక అపురూపమైన పదార్థం. ప్రకృతిలో ఉన్న సమస్త జీవులకు నీరు ప్రాణాధారం. తొలి జీవిపుట్టుక నీటితోనే జరిగింది. తాగునీరు అరుదైన వస్తువుగా మారింది. గ్రామాల్లో, పట్టణాల్లో నివసించే కోట్లాది ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేసే ప్రక్రియ సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నాయి పలు దేశాలు. అధిక జనాభా కలిగిన భారతదేశం కూడా స్వచ్ఛమైన తాగు నీరు అందించలేకపోవడంతో అతిపెద్ద సమస్యగా రూపుదాల్చింది.

దేశంలోని 80% జనాభా మంచినీళ్ల రూపంలో విషం తాగుతున్నారు. ఆ విషయాన్ని ఇండియన్ పార్లమెంట్ సాక్షిగా బయటపెట్టారు. దిగ్భాంతి కలిగించేలా రాజ్యసభ చెప్పిన లెక్కల ప్రకారం దాదాపు భారతదేశ జనాభా విషపూరిత మంచినీళ్లు తాగుతున్నారు. అన్ని రాష్ట్రాల్లోని భూగర్భ జలాల్లో విషపూరిత లోహాలు అధికంగా ఉన్నట్లు వెల్లడించింది. దేశజనాభాలో 80 శాతానికి పైగా ప్రజలు భూమినుండి నీటిని పొందుతున్నారు. భూగర్భ జలాల్లో ప్రమాదకర లోహాలు నిర్దేశిత ప్రమాణాన్ని మించి ఉన్న నీళ్లను తాగుతున్నారని జల్‌శక్తి మంత్రిత్వ శాఖ చెబుతోంది. తాగునీటి వనరులు కలుషితమై ఉన్న నివాస ప్రాంతాల సంఖ్యను రాజ్యసభ బయటపెట్టింది.

ఆ నివేదిక ప్రకారం 671 ప్రాంతాలు ఫ్లోరైడ్, 814 ప్రాంతాలు ఆర్సెనిక్, 14,079 ప్రాంతాలు ఇనుము, 9,930 ప్రాంతాలు లవణీయత, 517 ప్రాంతాలు నైట్రేట్, 111 ప్రాంతాలు భారీ లోహాలతోఉన్న భూగర్భజలాలు ఉన్నాయని వివరించింది. భూగర్భ జలాల్లోని విషం నగరాల కంటే గ్రామాలలో చాలా తీవ్రంగా ఉంది. గ్రామాల్లో తాగునీటికి ప్రధాన వనరులు. చేతి పంపులు, బావులు, నదులు లేదా చెరువులు. సాధారణంగా గ్రామాల్లో ఈ నీటిని శుభ్రం చేయడానికి మార్గంలేదు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు విషపూరితమైన నీటిని తాగాల్సి వస్తోందని రాజ్యసభ వెల్లడించింది. ప్రభుత్వం జల్‌జీవన్ మిషన్‌ను ఆగస్టు 2019లో ప్రారంభించినట్లు లోక్‌సభకు తెలిపింది. దీని కింద 2024 నాటికి ప్రతి గ్రామీణ ఇంటికి కుళాయిల ద్వారా తాగునీరు సరఫరా చేయాలి.

కానీ, ప్రభుత్వం ఇచ్చిన డేటా ప్రకారం ఇప్పటివరకు 9.81 కోట్ల కుటుంబాలకు కుళాయి నీటిని సరఫరా చేస్తున్నారు. ఇది కాకుండా, అమృత్ 2.0 పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 2021లో ప్రారంభించింది. దీనికింద వచ్చే 5 సంవత్సరాలలో అంటే 2026 నాటికి అన్ని నగరాలకు కుళాయి నీటిని సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని రాజ్యసభ వేదికగా ప్రభుత్వం చెబుతోంది. నీరు రాష్ట్రానికి సంబంధించిన అంశమని, ప్రజలకు తాగునీరు అందించాల్సిన బాధ్యత రాష్ట్రాలదేనని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు వేదికగా తెలపడం గమనార్హం. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు అనేక పథకాలు అమలు చేస్తోందని వివరించింది.

దేశవ్యాప్తంగా జనాభా తాగుతున్న విషపూరిత మంచి నీళ్ల గురించి రాజ్యసభ వేదికగా కేంద్రం చెప్పిన అంశాలు: 25 రాష్ట్రాల్లోని 209 జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాల్లో లీటరుకు 0.01 మి.గ్రా కంటే ఎక్కువ ఆర్సెనిక్ ఉంటుంది. 29 రాష్ట్రాల్లోని 491 జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాల్లో ఐరన్ లీటరుకు 1 మి.గ్రా కంటే ఎక్కువగా ఉంటుంది. 11 రాష్ట్రాల్లోని 29 జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాల్లో కాడ్మియం లీటరుకు 0.003 మి.గ్రా కంటే ఎక్కువగా ఉంటుంది. 16 రాష్ట్రాల్లోని 62 జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాల్లో క్రోమియం లీటరుకు 0.05 మి.గ్రా కంటే ఎక్కువగా ఉంటుంది. 18 రాష్ట్రాల్లోని 152 జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాల్లో యురేనియం లీటరుకు 0.03 మి.గ్రా కంటే ఎక్కువగా ఉంటుంది. ఒక వ్యక్తి ప్రతిరోజూ సగటున 3 లీటర్ల నీరు తాగుతాడని సాధారణంగా నమ్ముతారు.

అయితే ప్రభుత్వ పత్రాల ప్రకారం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ కనీసం 2 లీటర్ల నీరు తాగాలి. మీరు ప్రతిరోజూ 2 లీటర్ల నీరు తాగితే, కొంత మొత్తంలో విషం శరీరంలోకి ప్రవేశిస్తుంది. భూగర్భ జలాల్లోని ఆర్సెనిక్, ఇనుము, సీసం, కాడ్మియం, క్రోమియం, యురేనియం నిర్దేశిత ప్రమాణం కంటే ఎక్కువగా ఉండటం వల్ల మన ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. అధిక ఆర్సెనిక్ అంటే చర్మవ్యాధులు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అధిక ఇనుము అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి నాడీ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులను సూచిస్తుంది. నీటిలో అధిక మొత్తంలో సీసం మన నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. అధిక స్థాయి కాడ్మియం మూత్రపిండాల వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.

అధిక మొత్తంలో క్రోమియం చిన్న ప్రేగులలో వ్యాపించే హైపర్ప్లాసియాకు కారణమవుతుంది, ఇది కణితుల ప్రమాదాన్ని పెంచుతుంది. తాగే నీటిలో యురేనియం అధికంగా ఉండటం వల్ల కిడ్నీవ్యాధులు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. మొత్తం మీద విషపూరిత మంచినీళ్లు తాగుతూ దేశజనాభా అనారోగ్యానికి గురవుతున్నారు. ఫలితంగా అనారోగ్య భారత్ దిశగా పాలకులు దేశాన్ని తీసుకెళుతున్న పరిస్థితి నెలకొంది. అరవై శాతం దేశజనాభా నీళ్లు లేక నానాయాతనలు పడుతున్నారని, ప్యూరిఫైడ్ వాటర్ అందక ఏటా దాదాపు రెండు లక్షల మంది చనిపోతున్నారని గతంలో నీతిఆయోగ్ వెల్లడించింది. 2030 నాటికి ఇప్పుడు ఉన్న నీటికి రెండింతల డిమాండ్ అవసరమవుతుందని అంచనా వేసింది.

2030 నాటికి దేశ జనాభాలో 40 శాతం మందికి గొంతు తడుపుకోవడానికి నీళ్లే దొరకని పరిస్థితి వస్తుందని ‘కాంపోజిట్ వాటర్ మేనేజ్‌మెంట్ ఇండెక్స్ (సిడబ్ల్యుఎంఐ)’ రిపోర్ట్ కూడా గతంలో వెల్లడించింది. మూడేళ్ల క్రితం నాటి నివేదిక ప్రకారం నీళ్లకు సంబంధించి దేశం డేంజర్ జోన్‌లో ఉంది. ఈ సంక్షోభం నుంచి బయటపడటానికి ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని కోరింది. యుద్ధప్రాతిపాదికన వాటర్ రిసోర్సెస్ మేనేజ్‌మెంట్‌ను పక్కాగా అమలు చేయాలని సూచించింది. మంచినీళ్లు దొరక్కపోవడంతో చాలా మంది కలుషిత నీళ్లనే తమకు తెలిసిన పద్ధతిలో శుద్ధి చేసుకుని తాగుతున్నారు. దీంతో ప్రతి ఏడాది రెండు లక్షల మంది కలుషిత నీళ్లు తాగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అడుగంటిపోతున్న గ్రౌండ్ వాటర్‌ను సిడబ్ల్యుఎంఐ సీరియస్‌గా తీసుకుంది. గ్రౌండ్ వాటర్‌ను అదే విధంగా వ్యవసాయానికి అవసరమైన నీళ్లను పెంచుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.

– దయ్యాల అశోక్                                                                                                              -95508 89907

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News