ఎస్‌ఎల్‌బిసి ఘటనలో16 రోజుల
తరువాత ఓ మృతదేహం
వెలికితీత ఇంజనీర్ గుర్‌ప్రీత్
సింగ్‌గా గుర్తింపు కుళ్లిపోయిన
స్థితిలో లభ్యం నాగర్‌కర్నూల్
ఆస్పత్రికి తరలింపు, ఫోరెన్సిక్
పరీక్షలు నిర్వహణ
మన తెలంగాణ/నాగర్‌కర్నూల్ ప్రతినిధి ః ఎస్‌ఎల్‌బిసి సొరంగంలో సస్పెన్స్‌కు ఆదివారం సాయంత్రం తెరపడిం ది. డి2 ప్రాంతంలో ఆదివారం ఉదయం రెస్కూ బృం దాలు మృతదేహం ఆనవాళ్లను గుర్తించి తవ్వకాలు జరుపగా కుళ్లినస్థితిలో ఒక మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహం పంజాబ్ రాష్ట్రానికి చెందిన గురుప్రీత్ సింగ్‌ది గుర్తించినట్టు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. మృతుడు రాబిన్స్ ఇండియా కంపెనీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడని తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్టు వెల్లడించారు. వైద్య పరీక్షల అనంతరం ప్రత్యేక అంబులెన్స్‌లో మృతుడి స్వస్థలానికి తరలించనున్నట్టు తెలిపారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన గురుప్రీత్ సింగ్ స్వగ్రామం చీమకలాన్ కాగా తరణ్ తరణ్ జిల్లాకు చెందినవాడు. ఆయన దోమలపెంట వద్ద జరుగుతున్న ఎస్‌ఎస్‌బిసి 1లో రాబిన్‌సన్ ఇండియా కంపెనీలో టన్నెల్ బోరింగ్ మిషన్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఎస్‌ఎల్‌బిసి ఘటనకు ఆదివారానికి 16 రోజులు పూర్తయింది. ఆదివారం సొరంగం వద్ద సస్పెన్స్ కొనసాగుతుండడం అధికార యం త్రాంగం, రెస్కూ బృందాల ప్రతినిధులు ఈ అంశంపై గప్‌చుప్‌గా వ్యవహరిస్తుండడం, అసలు టన్నెల్‌లో ఏం జరుగుతుందో అన్న సస్పెన్స్ కొనసాగుతోంది. ఎట్టకేలకు ఒక మృతదేహం బయటపడడంతో సందిగ్ధతకు తెరపడింది. టన్నెల్‌లో చిక్కుకున్న మిగతా ఏడుగురి మృతదేహాల కోసం అన్వేషణ యధావిధిగా కొనసాగుతోంది.
నాగర్‌కర్నూల్ జిల్లా జనరల్ ఆసుపత్రికి మృతదేహం
ఎస్‌ఎల్‌బిసి టన్నెల్లో తవ్వకాల్లో ఆదివారం సాయంత్రం బయటపడిన మృతదేహాన్ని అంబులెన్స్ సహాయంతో నాగర్‌కర్నూల్ జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. అంబులెన్స్ వెంట జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, ఆర్‌డిఒ మాధవి జిల్లా ఆసుపత్రి వరకు వెంట వచ్చారు.
కుటుంబ సభ్యులకు మృతదేహం అప్పగింత
ఆదివారం ఎస్‌ఎల్‌బిసి టన్నెల్లో సహాయక బృందాలు వెలికితీసిన మృతదేహాన్ని జిల్లా జనరల్ ఆసుపత్రి మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించనున్నారు. దీంతో పాటు డిఎన్‌ఏ పరీక్షలు చేపట్టి, కుటుంబ సభ్యులు మృతుడి శరీరంపై ఉన్న దుస్తులు, ఒంటిపై ఉన్న ఉంగరాలు చేతికి ఉన్న కడియాన్ని గుర్తిస్తే ఆ మృతదేహం పంజాబ్ రాష్ట్రానికి చెందిన గురుప్రీత్‌సింగ్‌దిగా భావించాల్సి ఉంటుంది. ఇదిలాఉండగా గురుప్రీత్ సింగ్ కుటుంబ సభ్యులు గత 13 రోజులుగా దోమలపెంట వద్ద ఒక లాడ్జిలో ఉన్నారు. సహాయక చర్యలకు ఆలస్యం జరుగుతుందన్న భావనతో రెండు రోజుల క్రితమే సొంత రాష్ట్రానికి వెళ్లినట్లు సమాచారం.
ప్రభుత్వ యంత్రాంగం అలర్ట్
ఎస్‌ఎల్‌బిసి టన్నెల్లో సహాయక చర్యలు ఊపందుకోవడం జీరో పాయింట్ వద్దకు విరివిగా బృందాలు చేరుకోవడం, రాడార్, కేరళకు చెందిన క్యాడవర్ డాగ్స్ మానవ అవశేషాలు ఉన్నట్లు భావిస్తున్న ప్రాంతంలో వాసనను పసిగట్టడం అక్కడ తవ్వకాల ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్న క్రమంలో ఆదివారం సాయంత్రం ఒక మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో దొరకడంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమై సంబంధిత శాఖ అధికారులను అందుబాటులో ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రధానంగా వైద్య శాఖ అధికారులను అలర్ట్ చేస్తూ జిల్లా జనరల్ ఆసుపత్రిలో సూపరింటెండెంట్‌తో పాటు వైద్యులను అందుబాటులో ఉండే విధంగా ఆదేశాలు జారీ చేశారు. మృతదేహాలు బయటపడితే టన్నెల్లో నుంచి నేరుగా జిల్లా జనరల్ ఆసుపత్రి మార్చురీకి తరలించి అక్కడే డిఎన్‌ఏ పరీక్షల కోసం నమూనాలు సేకరించడం, పోస్టుమార్టం నిర్వహించడం, మృతదేహాలకు కెమికల్ ప్రక్రియను కూడా ఇక్కడే చేపట్టాలని అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. నాగర్‌కర్నూల్ నుంచి నేరుగా వారి స్వస్థలాలకు మృతదేహాలను తరలించడానికి కూడా ఫ్రీజర్ బాక్సులు కలిగిన అంబులెన్స్‌లను కూడా సిద్ధంగా ఉంచారు. 12 రోజుల క్రితమే నాగర్‌కర్నూల్‌లో సిద్ధంగా ఉన్న అంబులెన్స్‌లను సహాయక చర్యలకు ఆలస్యం జరుగుతుండడంతో మళ్లీ వెనక్కి పంపించారు. తాజాగా మళ్లీ అంబులెన్స్‌లను రప్పిస్తున్నారు. సోమవారం నాటికి మరో రెండు మృతదేహాలు బయటపడితే ఈ నెల 11వ తేదీ నాటికి పూర్తిస్థాయిలో రెస్కూ ఆపరేషన్ ముగుస్తుందని తెలుస్తోంది.
టిబిఎం వెనుక భాగంలో మనుషుల ఆనవాళ్లు
ఎస్‌ఎల్‌బిసి సొరంగ నిర్మాణంలో భాగంగా అమర్చిన టన్నెల్ బోరింగ్ మిషన్ వెనుక భాగంలో ఆదివారం సింగరేణి, ర్యాట్‌హోల్ మైనర్స్ టీంలు సహాయక చర్యల్లో భాగంగా తవ్వకాలు జరుపుతుండగా డాగ్స్ గుర్తించిన డి=2 ప్రాంతంలో మనిషి ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. తవ్వకాలు జరిపిన క్రమంలో దుర్వాసన రావడం డాగ్ కూడా అక్కడే స్పాట్‌ను గుర్తించడం గమనార్హం. టన్నెల్ బోరింగ్ మిషన్ 12.40 మీటర్ల వ్యాసార్థం, 120 మీటర్ల బ్యాకప్ సిస్టం, 1,500 టన్నుల బరువు, 5,100 హెచ్‌పిల విద్యుత్ మోటర్లు అమర్చి ఉంటుంది. 120 మీటర్ల బ్యాకప్ సిస్టం వద్దే టిబిఎం ఆపరేటింగ్ జరుగుతుంది. ముందు భాగంలో తవ్వాల్సిన గోడ మాత్రమే ఉంటుంది. వెనుక భాగంలో ఆపరేటింగ్ సిస్టం ఉంటుంది. కాబట్టి వెనుక భాగంలోనే వీరంతా చిక్కుకుని ఉంటారు. ప్రస్తుతం సహాయక చర్యలు చేపడుతున్న వారికి టిబిఎం వద్దకు వెళ్లాలంటే అది ముందు భాగమవుతుంది.
జీరో పాయింట్ వరకు ఉడెన్ బ్రిడ్జి
ఎస్‌ఎల్‌బిసి సొరంగంలో చిక్కుకున్న వారిని కాపాడడానికి రెస్కూ బృందాలు అనేక మార్గాలను అన్వేషిస్తున్నాయి. మట్టి, టిబిఎం తవ్విన రాళ్లు, నీటి ఊట కారణంగా బురదమయంగా మారి సహాయక చర్యలకు ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో సొరంగ మార్గాలలో బురదమయంగా ఉన్న ప్రాంతాలలో వినియోగించే ఉడెన్ బ్రిడ్జిల తరహాలో తాత్కాలిక బ్రిడ్జిల నిర్మాణం పైకప్పు భాగం కూలకుండా అదే కట్టెలతో సెంట్రింగ్ మాదిరిగా ఇనుప షీట్లను అమర్చుకుంటూ మట్టిలో చిక్కుకున్న వారి వద్దకు చేరేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకోసం ఆదివారం ఉదయం ఒక డిసిఎంలో ఉడెన్ బ్రిడ్జి నిర్మాణం కోసం ఒకే సైజులో ఉండే కట్టెలను తెప్పించారు. మెత్తటి ప్రాంతాలలో సొరంగాలు నిర్మించే క్రమంలో మట్టి కూలిన ప్రదేశాలలో చిన్న పాటి మనిషి దూరే విధంగా కట్టెల సహాయంతో సొరంగాలను నిర్మించడం వంటి టెక్నాలజీని సైతం ఇక్కడ వినియోగిస్తూ రెస్కూను కొనసాగిస్తున్నారు. ఉడెన్ బ్రిడ్జి నిర్మా ణం వల్ల సొరంగంలో చిక్కుకున్న వారిని వెలికి తీయ డం, బయటకు తీసుకురావడం కోసం ఎంతగానో ఉపయోగపడుతుందని బృందాలు చెబుతున్నాయి.
3 జెసిబిలతో మట్టి తొలగించే ప్రక్రియ
జీరో పాయింట్ వద్దకు చేరి సహాయక చర్యలను ముమ్మరం చేసే విధంగా చేపడుతున్న పనుల్లో భాగంగా మూడు జెసిబిలను లోకో ట్రైన్ ద్వారా తరలించారు. ఒక జెసిబి గత వారం రోజుల క్రితమే సొరంగంలోకి తీసుకువెళ్లగా తాజాగా ఆదివారం నాటికి మరో రెండు జెసిబిలను తరలించి మట్టిని ఎత్తిపోయడం చదును చేయడం వంటి వాటి కోసం వినియోగిస్తున్నారు.రెండు మూడు మీటర్ల లోతు వరకు సింగరేణి ర్యాట్ హోల్ మైనర్స్ ద్వారా తవ్వకాలు జరిపి అక్కడ మృతదేహాల ఆనవాళ్లు లేవని గుర్తించిన తర్వాత జెసిబిల సహాయంతో మట్టిని తొలగిస్తున్నట్లు సమాచారం. జెసిబిలను పూర్తి స్థాయిలో వినియోగిస్తే మట్టిలో కూరుకుపోయిన మృతదేహాలకు నష్టం జరుగుతుందని భావించి క్రమక్రమంగా మట్టిని తొలగిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.