Monday, March 10, 2025

అయామ్ ఫైన్!

- Advertisement -
- Advertisement -

బాగున్నావా అని నన్నడక్కు
బాగున్నానో లేదో కూడా తెలియని
సందిగ్ధావస్థ! తెలిసినా ఎలా ఉన్నానో కూడా చెప్పడానికి తరతరాలుగా తర్జుమా కాని
నిశ్శబ్ద భాష నాది!

గొంతు పెగలకముందే వెయ్యి ప్రశ్నల
వేటకుక్కలు సిద్ధంగా ఉంటాయి బాగా లేనంటే..
ఎందుకు? ఎప్పట్నించి? ఎవరి వల్ల?
ఏం చేసావ్.. ఎలా మరి..ఏం చేద్దామని..
ఒక్క పదంలోనూ పరామర్శ తడిలేని
ఆరాల పులి ఆత్మగౌరవంపై స్వారీ చేస్తుంది

అబ్బే.. నేను బాగానే ఉన్నాను..
నిజం ఈ కన్నీళ్ళన్నీ ఆనందబాష్పాలు..
ఛఛ.. వాతలు కావివి చిలిపిచేతలు..
ఒట్టండీ.. అంతా వట్టిదే..

అమ్మను చూడ్డానికి కూడా అనుమతి
పొందాల్సిన ఆగత్యంతో అందరి భోజనాలయ్యే
దాకా ఆకలిగొంతు నొక్కాల్సిన దౌర్భాగ్యంలో
నేను భేషుగ్గా బ్రతుకుతున్నాను..
ఇంటి పేరు నాది కాదు నా ఒంట్లోంచి పుట్టిన
పిల్లల నొసళ్ళపైనా నా గీతలుండవు
చస్తూ పుడుతూ నెత్తికెత్తుకున్న రత్నాలు
పొదిగిన అమ్మతనపు కిరీటం
నడుం వంగినా మోకాళ్ళరిగినా కిందికి దిగదు..

దింపుడు కళ్ళెం కాడ కూడా ఏమే వేన్నీళ్ళు
పెట్టావా.. అమ్మా ఆమ్లేటేస్తున్నావా అని చెవుల్లో పిలుస్తున్నట్టే వినబడుతుంటే.. నేను
సంతోషంగా సచ్చిపోతున్నాను..!

కొండనాల్కలు తెగిన తగాదాల్లో
తీవ్రతల కొలతలకు నేనో పనిముట్టునై
జాగకోసమో జాడకోసమో
పేరుకోసమో పెత్తనానికో తలపడ్డ
మీ దాష్టీకాలకు అణువణువూ
సజీవహననమవుతున్న బరిబాతల ఊరేగింపునై..

కావరమెక్కిన మదపుటేనుగుల కత్తిమొనలకు
రక్తసిక్తమవుతున్న పాపనై..
కన్యనై అమ్మనై.. అవ్వనై..
సర్వసత్తాక స్వతంత్ర దేశంలో సగర్వంగా
తలెత్తుకొని ఆనంద తాండవం చేస్తున్నాను..

యస్.. నేను బ్రహ్మాండంగా ఉన్నాను. అ.. యా.. మ్.. పర్ఫెక్ట్లీ.. ఫైన్..
నిర్మలా రాణి తోట

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News