న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానాన్ని తమిళనాడు అధికార పార్టీ డీఎంకే వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ అంశాన్ని లోక్‌సభలో డీఎంకే ఎంపీలు లేవనెత్తడంతో గందరగోళ వాతావరణం నెలకొంది. బడ్జెట్ సమావేశాల సెకండ్ సెషన్ సోమవారం ప్రారంభమైంది. ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ డిఎంకె వైఖరిపై విరుచుకుపడడంతో పార్లమెంట్‌లో విపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి. దీంతో స్పీకర్ ఓం బిర్లా సభను 30 నిమిషాల పాటు వాయిదా వేసి తిరిగి ప్రారంభించారు. కొత్త విద్యా విధానాన్ని తమిళనాడులో అమలు చేయడంపై డీఎంకే ఎంపీలు నిరసన తెలియజేస్తూ వెల్ వైపు వెళ్లడంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమిళనాడు విద్యార్థుల భవిష్యత్తును డీఎంకె నాశనం చేస్తోందని ధ్వజమెత్తారు. లోక్‌సభలో సోమవారం పీఎం శ్రీ స్కీమ్‌పై అడిగిన ప్రశ్నకు బదులిస్తూ జాతీయ విద్యా విధానాన్ని దేశం మొత్తం మీద అమలు చేసే అంశంలో దేశాన్ని డిఎంకె తప్పుతోవ పట్టిస్తోందన్నారు. హిందీ భాష అమలు అంశంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రజలను తప్పుతోవపట్టిస్తున్నారని ఆరోపించారు. త్రిభాషా విద్యా విధానాన్ని తమిళనాడు వ్యతిరేకిస్తోందని, తమిళనాడు ప్రభుత్వం ఈ అంశాన్ని రాజకీయం చేస్తోందని,తమిళనాడు విద్యార్థుల భవిష్యత్తును గందరగోళం లోకి నెట్టేస్తోందని విమర్శించారు.
డీఎంకే అనాగరికంగా, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందన్నారు. అంతేగాక డీఎంకేలో అంతర్గత కలహాలు ఉన్నాయని, గత ఎన్నికల సందర్భంగా ఇవి బయటపడ్డాయని మంత్రి ఆరోపించారు. అంతర్గత కలహాలను కప్పిపుచ్చుకునేందుకే హిందీభాషపై వివాదం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. జాతీయ విద్యావిధానంపై ఒప్పందం కుదుర్చుకుంటే ఆ రాష్ట్రానికి నిధులు మంజూరవుతాయన్నారు. అయితే మొదట ఆ ఒప్పందం కుదుర్చుకునేందుకు తమిళనాడు సర్కారు సిద్ధమైందని, కానీ ఇప్పుడు ఆ పార్టీ తన వైఖరిని మార్చుకుందని ఆరోపించారు.
కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ వంటి బీజేపీయేతర రాష్ట్రాలు ఒప్పందం కుదుర్చుకున్నాయని చెప్పారు. పీఎం శ్రీ స్కీమ్ కింద ఒప్పందం కుదుర్చుకోడానికి తమిళనాడు వద్ద ఇంకా 20 రోజుల సమయం ఉందన్నారు. మంత్రి వ్యాఖ్యలను ఖండిస్తూ కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా డీఎంకె ఎంపీలు నినాదాలు చేశారు. సభ సజావుగా సాగేందుకు స్పీకర్ ఓం బిర్లా ఎంతగా ప్రయత్నించారు. కానీ స్పీకర్ అభ్యర్థనను డీఎంకె ఎంపీలు తోసి పుచ్చారు.