Tuesday, March 11, 2025

ఓటర్ల జాబితాల తప్పులపై లోక్‌సభలో భగ్గుమన్న విపక్షాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఓటర్ల జాబితాల్లో అవతకవకలు జరుగుతున్నాయని, దేశ వ్యాప్తంగా ఆందోళనలు రావడమే కాక, ప్రశ్నలు తలెత్తుతున్నాయని దీనిపై లోక్‌సభలో చర్చలు జరగాలని లోక్‌సభలో విపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ జాబితాలపై చర్చలు జరిగాలని ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్నాయన్నారు. సోమవారం లోక్‌సభలో జీరో అవర్ సమయంలో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. “ ఓటరు జాబితాలను ప్రభుత్వం తయారు చేయడం లేదన్న మీ వ్యాఖ్యలను మేం అంగీకరిస్తాం. కానీ దీనిపై చర్చ జరగాలని మేం డిమాండ్ చేస్తున్నాం. ” అని రాహుల్ అన్నారు. మహారాష్ట్రతో సహా ప్రతిరాష్ట్రంలో ఓటరు జాబితాలపై విపక్షాల నుంచి ఆందోళనలు వస్తున్నాయన్నారు.

అంతకు ముందు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగతారాయ్ ఓటర్ల జాబితాల్లో కొన్ని అవకతవలకు ఉంటున్నాయని, ఒకే ఎలెక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డు సంఖ్యలతో ముర్షిదాబాద్, బర్దాన్ పార్లమెంట్ నియోజకవర్గాల్లోనూ , హర్యానాలోనూ ఓటరు కార్డులు ఉండటాన్ని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బయటపెట్టారని పేర్కొన్నారు. తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధి వర్గం దీనిపై కొత్త చీఫ్ ఎలెక్షన్ కమిషనర్‌ను కలుసుకుని ఓటరు జాబితాల్లోని తప్పులను చూపించినట్టు చెప్పారు. ఓటర్ల జాబితాలు ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలించవలసి ఉందన్నారు. ముఖ్యంగా పశ్చిమబెంగాల్, అస్సోం అసెంబ్లీల ఎన్నికలు వచ్చే సంవత్సరం జరగనున్నందున ఆయా రాష్ట్రాల ఓటర్ల జాబితాలను సమగ్రంగా పరిశీలించాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాల్లో ఎన్నో అవకతవలు వెల్లువలా చోటు చేసుకున్నాయని, ఇప్పుడు అవే తప్పులు పశ్చిమబెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో జరగడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ విధంగా పొరపాట్లు ఎందుకు జరుగుతున్నాయో ఎలెక్షన్ కమిషన్ సమాధానం చెప్పాల్సి ఉందన్నారు. తృణమూల్ కాంగ్రెస్ మరో ఎంపీ కల్యాణ్ బెనర్జీ ఎన్నికల కమిషన్‌కు వ్యతిరేకంగా చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా నిజాయితీగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడంలో ఎన్నికల కమిషన్ విఫలమైందని ఆరోపించారు.

డూప్లికేట్ ఓటరు కార్డుల విషయమై అనేక సార్లు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెలుగు లోకి తెచ్చారని, దీనికి ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిజాయితీగా, పారదర్శకంగా నిర్వహిస్తున్నామని ఎప్పుడూ ఒకేలా సమాధానం చెబుతోందని ఆక్షేపించారు. కమిషన్ ఇచ్చిన సమాధానం ఎన్నికల నిర్వహణ నిబంధనలను ఉల్లంఘిస్తోందని ధ్వజమెత్తారు. తప్పుల ఓటరు జాబితాలన్నవి తీవ్ర ఆందోళనకరమైన సమస్య అని, ఎన్నికల నిర్వహణ నిబంధనల్లో రూల్ 20 ని ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ సరిగ్గా వ్యవహరించడం లేదని, అందువల్ల కమిషన్‌పై సరైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News