రాజ్యసభలో సోమవారం జీరో అవర్‌లో ఓటర్ల జాబితాల్లోని తప్పులపై విపక్ష నాయకుడు , కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చర్చను లేవదీయడానికి ప్రయత్నించగా దానికి అనుమతి లభించలేదు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ ఈ సందర్భంగా చర్చకు అనుమతించక పోవడంపై వివరిస్తూ రూల్ 267 కింద డజను నోటీసులు వచ్చాయని, ఈరోజు జరగాల్సిన చర్చను పక్కన పెట్టి అత్యవసర అంశాలపై చర్చించాలని డిమాండ్ చేశాయని, కానీ అవన్నీ తిరస్కరించడమైందని పేర్కొన్నారు. దాంతో విపక్షాలు వాకౌట్ చేశాయి. “ ఓటర్ల జాబితాల నుంచి అకస్మాత్తుగా, అనవసరంగా ఓటర్లను తొలగించడం, డూప్లికేట్ ఓటరు కార్డులు, తదితర కీలకమైన అవకతవకలు మన ఎన్నికల వ్యవస్థ సమగ్రతను దెబ్బ తీస్తుంది. దీనిపై తక్షణం అప్రమత్తం కావడంతోపాటు పార్లమెంట్‌లో సమగ్రంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది ” అని ఖర్గే తన ఎక్స్ పోస్టులో డిమాండ్ చేశారు.
స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగాల్సిన ఎన్నికలకు ఈ భారీ ఎత్తున అక్రమాలు ప్రమాదకరంగా ఉంటున్నాయని హెచ్చరించారు. అందువల్ల పార్లమెంట్‌లో సమూలంగా చర్చ జరిగేలా చొరవ తీసుకోవడం మోడీ ప్రభుత్వానికి తప్పనిసరి అని సూచించారు. ప్రజాస్వామ్యం పైన, రాజ్యాంగం పైన ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని పరిరక్షించడం పార్లమెంట్ కర్తవ్యంగా ఆయన పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో డూప్లికేట్ ఓటరు కార్డులు ఉంటున్నాయని, ఇది ఓటరు గుర్తింపును, ఎన్నికల ప్రక్రియను తీవ్రంగా అణగదొక్కడమేనని విమర్శించారు. మహారాష్ట్రలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల మధ్య కేవలం ఆరు నెలల్లోనే అకస్మాత్తుగా కొన్ని లక్షల ఓటర్లు జబాతాల్లో చేరడాన్ని ప్రస్తావించారు. ఈ అవకతవకలను తమ పార్టీ లేవదీసిందని పేర్కొన్నారు. ఓటింగ్‌కు వినియోగించేలా ఓటరు ఫోటోలతో కూడిన జాబితాలను ఎక్స్‌సెల్ ఫార్మేట్‌లో ఉంచాలన్న తమ డిమాండ్‌కు ఎన్నికల కమిషన్ ఇంకా స్పందించలేదన్నారు.