ఫోర్త్ సిటీ రోడ్డు (గ్రీన్ ఫీల్డ్ హైవే) కోసం అధికారులు తమ ప్రమేయం లేకుండానే తమ భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారంటూ ఓ రైతు జిల్లా కలెక్టరేట్ ముందు సోమవారం ఒంటిపై పెట్రోల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సకాలంలో స్పందించిన పోలీసులు రైతును నిలువరించగా.. అధికారులు బాధితుడితో చర్చించడంతో ఎట్టకేలకు శాంతించాడు. వివరాల్లోకి వెళ్తే..రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం మండలం, కొంగరకుర్దు (రావిరాల) రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 13లో పలువురు రైతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈక్రమంలోనే ఫోర్త్‌సిటీ వరకు నిర్మించనున్న 300 అడుగుల (గ్రీన్ ఫీల్డ్ హైవే) రోడ్డు కోసం సదరు రైతులకు చెందిన భూముల్లో అధికారులు సర్వే చేపట్టారు.
దీంతో ప్రభుత్వం తమ భూములను బలవంతంగా లాక్కునే యత్నం చేస్తోందంటూ వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కొందరు రైతులు సోమవారం జిల్లా కలెక్టర్‌ను కలిసేందుకు కొంగరకలాన్‌లోని కలెక్టరేట్‌కు చేరుకున్నారు. వారిలో బాల్‌రాజ్ అనే రైతు కలెక్టరేట్ ముందే ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో కాసేపు స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. అతనితో పాటు సుధాకర్, నర్సింహ అనే రైతులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. తమ జీవనాధారమైన భూములను తీసుకొని తమ పొట్టకొట్టొద్దంటూ వారు కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం జిల్లా అధికారులు బాధిత రైతులతో చర్చించి వారికి నచ్చజెప్పడంతో శాంతించారు. అయితే తమ ప్రాణాలు పోయినా భూములను మాత్రం వదులుకోమంటూ వారు స్పష్టం చేయడం గమనార్హం.