రాష్ట్రంలో కరువు కాలం తెచ్చింది కాదని, రేవంత్‌రెడ్డి తెచ్చిన కరువని మాజీ మంత్రి, సిద్దిపేట ఎంఎల్‌ఎ హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. సోమవారం జనగామ ఎంఎల్‌ఎ క్యాంప్ కార్యాలయంలో పార్టీ ఎంఎల్‌ఎలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కౌశిక్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బిఆర్‌ఎస్ పాలనలో ఎందుకు పంటలు ఎండిపోలేదని, ఇప్పుడు ఎందుకు ఎండిపోతున్నాయని ప్రశ్నించారు. దేవాదుల ఓ అండ్ ఎం కాంట్రాక్టర్‌కు రూ.7,000 కోట్ల బిల్లులు చెల్లించకపోవడం వల్ల 33 రోజులు పంపుల మోటార్లు ఆన్ చేయలేదన్నారు. 33 రోజులు దేవాదుల పంపుల మోటార్లు ఆన్ చేసి ఉంటే రిజర్వాయర్లు నిండేవని, పొలాలకు నీళ్లు వచ్చేవన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తప్పు చేసి ప్రకృతిపై నింద మోపుతున్నారని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి 20:20 మ్యాచ్ ఆడుతున్నాడని వ్యాఖ్యానించారు. ఫైనాన్స్‌లో బిల్లులు ఇవ్వాలన్నా, రెవెన్యూ డిపార్ట్‌మెంట్లలో భూములకు క్లియరెన్స్ ఇవ్వాలంటే 20 శాతం కమీషన్ డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ వైఫల్యం వల్లనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంటలు ఎండిపోయి ప్రజలు నష్టాలపాలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి నిర్లక్షం వల్ల వేలాది టిఎంసిల నీళ్లు గోదావరిలో కలిశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్ సిఎంగా ఉన్నప్పుడు ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టుకున్నామని అన్నారు. గోదావరి ప్రవాహం ప్రారంభమైందని తెలియగానే మోటార్లు ఆన్ చేసి రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు నింపి ఉండాల్సిందని అన్నారు. సకాలంలో ఓ అండ్ ఎం పనులు పూర్తి చేసుకొని ఎండాకాలం కోసం నీళ్లు సిద్ధం చేసుకోవాల్సిందని అన్నారు. జనగామ ఎంఎల్‌ఎ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి రాష్ట్రానికి పట్టిన గ్రహణమన్నారు. తాను ఇరిగేషన్ మంత్రి, సెక్రటరీ వెంటపడి 30 రోజులకు ఏడు కోట్ల రూపాయలు విడుదల చేయించుకొని మోటార్లు రిపేర్ చేయించినట్లు తెలిపారు. 33 రోజులు మోటార్లు బాగు చేసి భీమ్‌ఘన్‌పూర్ నింపుకొని చలివాగు, ధర్మసాగర్ నింపుకొని, గడ్డిరామారం, బొమ్మకూరు, తపాస్‌పల్లి వరకు నీళ్లు తెచ్చుకునే వాళ్లమన్నారు. ఇప్పుడు మోటార్ ఆన్‌చేసినా నీళ్లు అందని పరిస్థితి వచ్చిందన్నారు.
రేవంత్‌రెడ్డి గురువు చంద్రబాబు కృష్ణానదిలో నీటిని దోచుకుపోతుంటే అడ్డుకునే ప్రయత్నం చేయలేదన్నారు. బాబును ప్రశ్నించే దమ్ము రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి లేదన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో కూడా పంటలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొండ, మహబూబ్‌నగర్‌లో పంటలు ఎండిపోవడానికి ఆంధ్రప్రదేశ్ అడ్డగోలుగా నీటిని తరలించడమే కారణమన్నారు. పంటలు ఎండిపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. వర్షాకాలం రైతుబంధు, యాసంగి రైతుబంధు జమచేయాలని, రుణమాఫీ పూర్తి చేయాలని, ఎరువుల తిప్పలు లేకుండా చూడాలని, పెండింగ్‌లో ఉన్న రూ.400 కోట్ల సన్నవడ్ల బోనస్ వెంటనే చెల్లించాలన్నారు. యాసంగి పంట కోతకొచ్చినా ఇప్పటికీ వర్షాకాలం పంట బోనస్ డబ్బులు రైతుల ఖాతాల్లో జమచేయలేదని విమర్శించారు. తాము రైతుల పక్షాన నిరంతరం పోరాడుతామని, ప్రభుత్వాన్ని అడుగడుగునా ఎండగడతామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.