టిజిపిఎస్‌సి వెబ్‌సైట్‌లో మెయిన్స్ మార్కుల జాబితా 24వ తేదీ వరకు
రీకౌంటింగ్ దరఖాస్తులకు ఆహ్వానం నేడు గ్రూప్—2 ఫలితాలు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గ్రూప్- 1 పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. 563 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన ప్రొవిజినల్ మార్కులను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టిజిపిఎస్‌సి) విడుదల చేసింది. టిజిపిఎస్‌సి కార్యాలయంలో సోమవారం కమిషన్ సభ్యులతో కలిసి చైర్మన్ బుర్రా వెంకటేశం గ్రూప్1 మెయిన్స్‌లో పేపర్ల వారీగా అభ్యర్థులు పొందిన మార్కుల జాబితాను విడుదల చేశారు. గత ఏడాదిలో జరిగిన గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలకు 21,093 మంది హాజరయ్యా రు.
టిజిపిఎస్‌సి అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థులు తమ టిజిపిఎస్‌సి ఐడీ, మెయిన్స్ హాల్‌టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలతో పాటు క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి పేపర్ల వారీగా మార్కులను పొందొచ్చు. గతేడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్ -1 సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. మొత్తం ఏడు పేపర్లుగా నిర్వహంచిన ఈ పరీక్ష వాల్యుయేషన్ ప్రక్రియను పూర్తి చేసిన అధికారులు.. మార్కుల వివరాలను తాజాగా అభ్యర్థుల లాగిన్‌లలో అందుబాటులో ఉంచారు. ఈ మార్కులను ఈ నెల 16 సాయంత్రం 5 గంటల వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు మెయిన్స్‌లో సాధించిన మార్కుల షీట్‌లను డౌన్‌లోడ్ చేసుకొని రిక్రూట్‌మెంట్ ప్రక్రియ పూర్తయ్యే వరకు దాచి ఉంచాలని కమిషన్ సూచించింది.
రీకౌంటింగ్‌కు అవకాశం
గ్రూప్ 1 మెయిన్స్‌లో అభ్యర్థులు తమ మార్కుల రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకునేందుకు టిజిపిఎస్‌సి అవకాశం కల్పించింది. అభ్యర్థులు టిజిపిఎస్‌సి వెబ్‌సైట్‌లో సోమవారం(మార్చి 10) నుంచి ఈనెల 24వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఒక్కో పేపర్‌కు రూ.1000 చొప్పున చెల్లించి మార్కుల రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికోసం కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రీకౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత అభ్యర్థులందరి మొత్తం మార్కులను కమిషన్ వెబ్‌సైట్‌లో ఉంచుతారు. తుది జనరల్ ర్యాంకింగ్స్ జాబితాను విడుదల చేసి.. దాని ఆధారంగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు పిలవనున్నారు. నోటిఫికేషన్‌లో సూచించినట్లుగా అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఇతర డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచుకోవాలని టిజిపిఎస్‌సి సూచించింది. మార్కుల షీట్‌లు డౌన్‌లోడ్, రీకౌంటింగ్ దరఖాస్తుకు సంబంధించి ఏవైనా సాంకేతికపరమైన సమస్యలు ఎదురైతే.. అభ్యర్థులు 040 -23542185/040- 23542187 లేదా helpdesk@tspsc.gov.in ద్వారా సంప్రదించవచ్చని సూచించింది.
నేడు గ్రూప్ 2 జిఆర్‌ఎల్ విడుదల
షెడ్యూల్ ప్రకారం మంగళవారం గ్రూప్ 2 అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిజిపిఎస్‌సి) ప్రకటించనున్నది. ఆ తర్వాత ఈనెల 19 వరకు గ్రూప్- 3 సహా ఇతర పరీక్షల ఫలితాలను వెల్లడించనున్నట్లు కమిషన్ తెలిపింది. ఈనెల 14న గ్రూప్- 3 పరీక్ష జనరల్ ర్యాంకింగ్ జాబితాను విడుదల చేస్తారు. వీటితో పాటుగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు నిర్వహించిన పరీక్షల తుది ఫలితాలను ఈనెల 17న, ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ ఉద్యోగ పరీక్షల జనరల్ ర్యాంకింగ్ జాబితా ఈనెల 19న ప్రకటించనున్నారు. రాష్ట్రంలో 563 గ్రూప్- 1 ఉద్యోగాలు, 783 గ్రూప్ -2, 1,365 గ్రూప్ -3 పోస్టులతో పాటు 581 వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు గతంలో పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.
అభ్యర్థులు ఎలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు : గ్రూప్-1 పోస్టులపై తప్పుడు వార్తలను టిజిపిఎస్‌సి ఖండించింది. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని ఈ నెల 5న టిజిపిఎస్‌సి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తప్పుడు వార్తలపై పోలీసులకు టిజిపిఎస్‌సి అధికారులు ఫిర్యాదు చేశారు. గ్రూప్-1 మార్కుల జాబితాను వెబ్‌సైట్‌లో పెడతామని కమిషన్ వెల్లడించింది. అభ్యర్థుల లాగిన్‌లో పేపర్ల వారీగా మార్కులు ఉంచుతామని, గ్రూప్-1 నియామక ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోందని స్పష్టం చేసింది. ఎలాంటి తప్పులు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. అభ్యర్థులు ఎలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని టిజిపిఎస్‌సి విజ్ఞప్తి చేసింది.