కెసిఆర్ చెల్లని రూపాయి
అధికారం పోయిందన్న
అక్కసుతోనే కెటిఆర్ విమర్శలు
పదేళ్లలో అప్పులు తప్ప వాళ్లు
చేసిందేమీ లేదు పంటలు
ఎండితే ప్రతిపక్షాలు సంతోష
పడుతున్నాయి కెసిఆర్‌కు
భయపడే కిషన్‌రెడ్డి అఖిలపక్ష
భేటీకి రాలేదు రాష్ట్రానికి ఆయన
ఎక్కువ నిధులు తెచ్చినట్టు
నిరూపిస్తే సన్మానం చేస్తాం
కిషన్‌రెడ్డికి ధైర్యం ఉంటే
చర్చకు రావాలి నేను, భట్టి సిద్ధం
రహదారుల భూసేకరణకు
ఈటల రాజేందర్, లక్ష్మణ్
అడ్డుపడుతున్నారు మందకృష్ణ
బిజెపి నేతలా మాట్లాడుతున్నారు
కులగణన ప్రభావం వల్లే అన్ని
పార్టీలూ బిసిలకు టికెట్లిచ్చాయి
మీడియాతో ముఖ్యమంత్రి
రేవంత్ రెడ్డి చిట్‌చాట్
మన తెలంగాణ/హైదరాబాద్: స్టేటస్ గురించి కెటిఆర్ మాట్లాడుతున్నారు. అసలు కెటిఆర్ ఎవరు? ఆయన ఎక్కడి నుంచి వచ్చారంటూ సిఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. మాజీ సిఎం కెసిఆర్ చెల్లని రూపాయని, కెటిఆర్ ఓ పిచ్చోడని ఆయన వ్యాఖ్యానించారు. తండ్రి, కొడుకులిద్దరికి బ లుపు తప్ప ఏమీ లేదని ఆయన మండిపడ్డారు. అధికారం కోల్పోయిన అక్కసుతోనే కెటిఆర్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. క్రిమినల్స్ ఎప్పుడూ కేసులకు భయపడరని, భయపడితే క్రైమ్ చేయర ని, అందుకే కెటిఆర్ భయపడనని అంటున్నారని సిఎం రేవంత్ ఆరోపించారు. కెటిఆర్ గురించి మాట్లాడటమే అనవసరమని ఆయన పేర్కొన్నారు. సిఎం రేవంత్‌రెడ్డి సోమవా రం విలేకరులతో చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా ము ఖ్యమంత్రి మాట్లాడుతూ తాను రాష్ట్ర ముఖ్యమంత్రినని, కెసిఆర్ ఓడించింది తానేనని, కెసిఆర్‌ను గుండుసున్నా చేసింది తానేనని, కెసిఆర్‌ను బండకేసి కొట్టింది కూడా తానేనని, అడ్డగోలుగా మాట్లాడడంలో కెసిఆర్‌ను మించినవాళ్లు ఎవరున్నారని అన్నారు.
అసెంబ్లీలో అధికారపక్షం కంటే ప్రతిపక్షానికి ఎక్కువ సమయం ఇస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. ప్రతిపక్షం లేని రాజకీయాలు చేయాలని తాము అనుకోవడం లేదన్నారు. జీతభత్యాలు తీసుకొని పని చేయని వ్యక్తి కెసిఆర్ అని సిఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్ల లో అప్పులు, తప్పు లు తప్పా కెసిఆర్ ఏం చేయలేదని సిఎం ఆరోపించారు. అప్పుల విషయంలో కెసిఆర్ తప్పుడు లెక్కలు చూపెట్టారని ఆయన దుయ్యబట్టారు. కెసిఆర్ చేసిన అప్పులు, తప్పులు కాగ్ రిపోర్ట్ అసెంబ్లీలో బయట పెడతామన్నారు. కెసిఆర్, కెటిఆర్, హరీష్ రావు దుర్మార్గులని, ఇలాంటి వారిని తాను ఎప్పుడూ చూడలేదని ఆయన మండిపడ్డారు. తెలంగాణలో శవాలు లేస్తున్నాయని తెలియగానే వారు తీన్మార్ డాన్సులు చేస్తున్నారని, పంటలు ఎండితే ప్రతిపక్షాలు సంతోషపడుతున్నాయని ఆయన విమర్శించారు. ప్రజలు ఇబ్బందులు పడితే బాధపడాలని, ఇంత దుర్మార్గులు ప్రపంచంలో ఎవరైనా ఉంటారా అని ఆయన ప్రశ్నించారు. రోజమ్మ పెట్టిన రొయ్యల పులుసు తిన్నది ఎవరని, జగన్‌ను ప్రగతిభవన్‌కు పిలిచి రాయలసీమ లిప్ట్ అనుమతి ఇచ్చింది కెసిఆర్ కాదా అని సిఎం రేవంత్ ప్రశ్నించారు. కెసిఆర్ ప్రాజెక్టులు పూర్తి చేస్తే ఎపితో ఈ తలనొప్పులు ఉండకపోయేద న్నారు. ప్రస్తుతం తెలంగాణలో కరువు వస్తే ఇంత పంట పండుతుందా అని ఆయన అన్నారు.
అఖిలపక్ష సమావేశానికి కూడా కిషన్ రెడ్డి రాలేదు
కిషన్ రెడ్డి తానే మెట్రో తెచ్చానంటున్నారు. అసలు కిషన్ రెడ్డి తెచ్చిన మెట్రో ఎక్కడ ఉందని ముఖ్యమంత్రి రేవంత్ ప్రశ్నించారు. తెలంగాణలో జైపాల్ రెడ్డి తెచ్చిన మెట్రో కనిపిస్తోందని, కిషన్ రెడ్డి తెచ్చిన మెట్రో ఎక్కడుందని సిఎం ప్రశ్నించారు. మెట్రో తానే తెచ్చానని కిషన్ రెడ్డి చెబుతున్నందునే తాము నిధులు తీసుకురమ్మని కోరుతున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు. తెలంగాణకు కిషన్‌రెడ్డి నిధులు తెచ్చి ఉంటే, తానే స్వయంగా సన్మానిస్తానని సిఎం స్పష్టం చేశారు. కనీసం అఖిలపక్ష సమావేశానికి కూడా కిషన్ రెడ్డి రాలేదని, కేంద్రం నుంచి నిధులు తెస్తే తాము తిరస్కరించమా? అని ఆయన ప్రశ్నించారు.
త్రిబుల్ ఆర్ ప్రాజెక్టుకు నిధులు ఇస్తామని గతంలో మోడీ హామీ ఇచ్చినందునే తాము అడుగుతున్నామని రేవంత్ స్పష్టం చేశారు. రింగ్‌రోడ్డు అంటే పూర్తి వలయాకారంలో ఉండాలి, కానీ, సగం ఇచ్చి దానిని రింగ్ రోడ్డని ఎలా అంటారని? సిఎం రేవంత్ విమర్శించారు. రాష్ట్ర సమస్యలపై ఉమ్మడి పోరాటం కోసం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసినా, బిజెపి నేతలు హాజరుకాలేదని ఆయన దుయ్యబట్టారు. కెసిఆర్‌పై ఉన్న భయంతోనే కిషన్ రెడ్డి ఈ సమావేశానికి రాలేదేమోనని ముఖ్యమంత్రి రేవంత్ ఎద్దేవా చేశారు. కేంద్రమంత్రి మనోహర్ లాల్ కట్టర్ వచ్చేది కూడా కిషన్ రెడ్డికి తెలియదా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ప్రాజెక్టులు ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటుంది రాష్ట్ర బిజెపి నేతలేనని సిఎం రేవంత్ మండిపడ్డారు. మూసీకి నిధులు తెస్తే కిషన్ రెడ్డికి సన్మానం చేసి గండపెండేరం తొడుగుతానని ఆయన పేర్కొన్నారు.
కేంద్ర నిధులపై కిషన్‌రెడ్డి చర్చకు రావాలి
దేశంలోని అన్ని రాష్ట్రాలను సమానంగా చూడడంలో బిజెపి వైఫల్యం చెందిందని సిఎం రేవంత్ ఆరోపించారు. బుల్లెట్ ట్రైన్ గుజరాత్‌కు ఇచ్చారని, కానీ, తెలంగాణకు ఎందుకు ఇవ్వడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ ప్రశ్నించారు. తెలంగాణ చెల్లించే పన్నులతో పోల్చితే, కేంద్రం నుంచి రాబట్టే నిధులు ఎంత తక్కువగా ఉన్నాయో ప్రజలకు అర్థమయ్యేలా చర్చకు రావాలని సిఎం రేవంత్ సవాల్ విసిరారు. కిషన్ రెడ్డికి ధైర్యముంటే ఈ అంశంపై చర్చకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ సూచించారు. తాను, సిఎం భట్టి విక్రమార్కతో సహా దీనిపై చర్చించేందుకు సిద్ధమేనని ఆయన ప్రకటించారు. అధిక నిధులు రాష్ట్రానికి తెచ్చినట్టు నిరూపిస్తే ఆయనకు సన్మానం చేస్తామని అన్నారు.
భూసేకరణకు అడ్డు పడుతుంది ఎంపి ఈటల
జాతీయ రహదారులకు అవసరమైన భూసేకరణకు అడ్డు పడుతుంది ఎంపి ఈటల రాజేందర్, లక్ష్మణ్‌లు కాదా అని సిఎం రేవంత్ ప్రశ్నించారు. భూసేకరణ రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నప్పుడు కేంద్ర అధికారులు కానీ, మంత్రులు కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి చర్చించాలి కదా అని సిఎం రేవంత్ నిలదీశారు. కేంద్ర మంత్రులు హైదరాబాద్ వచ్చి సమీక్షలు పెడితే కూడా ఎందుకు కిషన్ రెడ్డి హాజరు కావడం లేదని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్‌లో జరుగుతున్న అభివృద్ధినే అన్ని ప్రాంతాలకు విస్తరించాలని తాము భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. సబర్మతి, యమునా, గంగా ప్రక్షాళనకు నిధులు ఇస్తున్న కేంద్రం మూసీకి ఎందుకు ఇవ్వడం లేదని సిఎం ప్రశ్నించారు.
పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ లేకుండా బిఆర్‌ఎస్ తప్పించుకుంది…
పట్టభద్రుల ఎన్నికల్లో అసలు పోటీకి దిగకుండా తప్పించుకున్నది బిఆర్‌ఎస్ కాదా? అని రేవంత్ ప్రశ్నించారు. హరీశ్ రావు లాంటి నేతలు రాజకీయంగా తప్పించుకునేందుకు దొంగ దెబ్బ తీశారని ఆయన విమర్శించారు. మందకృష్ణ మాదిగ చేసిన వ్యాఖ్యలను బిజెపి వ్యాఖ్యలతో పోల్చుతూ, రెండు ఒకటేనని సిఎం రేవంత్ కొట్టిపడేశారు. ఎపిలో వర్గీకరణ సమస్యపై ఏ విధమైన చర్యలు చేపట్టలేదని ఆయన అన్నారు. ఎస్‌ఎల్‌బిసి ప్రాజెక్టును గతంలోనే పూర్తి చేసి ఉంటే కొండపల్లి ఘటనలో ప్రాణనష్టం జరిగేది కాదని రేవంత్ అన్నారు.
99 సార్లు ఢిల్లీకి పోతా అందులో తప్పు ఏముంది
తాము 39 సార్లు కాకుంటే 99 సార్లు ఢిల్లీకి పోతామని అందులో తప్పు ఏముందని సిఎం రేవంత్ ప్రశ్నించారు. ఢిల్లీ వెళ్లడం వల్లనే హైదరాబాద్ అభివృద్ధికి అవసరమైన అనుమతులు రావడానికి సహాయపడిందని రేవంత్ అన్నారు. రాష్ట్రానికి నిధులు రాకూడదని బిఆర్‌ఎస్ చూస్తోందని ఆయన ఆరోపించారు. సందర్భం వచ్చినప్పుడు తాము ఢిల్లీలో ధర్నా చేస్తామని ముఖ్య మంత్రి రేవంత్ స్పష్టం చేశారు. కెసిఆర్‌పై విమర్శలు చేయడానికి ప్రత్యేక హోదా ఎందుకని సిఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి స్థాయిలో తాను సరిపోనా అని ఆయన నిలదీశారు. పార్టీ నిర్ణయాలు ప్రెసిడెంట్ తీసుకుంటారని అభ్యర్థుల ఎంపిక విషయంలో పూర్తి స్వేచ్చ పార్టీ అధ్యక్షుడికి ఉంటుందని ఎంఎల్‌సి అబ్యర్థుల ఎంపికను ఉద్దేశించి సిఎం తెలిపారు.
నెలకు రూ.6,500 కోట్లు అప్పులు కడుతున్నాం
బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన రూ.7.11 లక్షల కోట్లకు నెలకు రూ.6,500 కోట్లు అప్పులు కడుతున్నామని సిఎం రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు. రెండో పంట సాగు అంచనాకు మించి 55 లక్షల హెక్టర్లలో సాగు అయ్యిందని, అందుకే అక్కడక్కడ నీటి కొరత ఏర్పడిందని సిఎం రేవంత్ తెలిపారు. మేడిగడ్డ నీరు లేకుండానే అధికంగా పంటలను సాగు చేస్తున్నామని తాను చెప్పేది అంతా అధికారిక లెక్కనేనని ముఖ్యమంత్రి వివరణ ఇచ్చారు.
మందకృష్ణ బిజెపి నాయకుడిలా మాట్లాడుతున్నారు…
మంద కృష్ణ మాదిగ అంటే తనకు గౌరవమే, కానీ, ఆయన బిజెపి నాయకుడిలా మాట్లాడితే ఎలా అని ముఖ్యమంత్రి రేవంత్ ప్రశ్నించారు. గతంలో ఎప్పుడో ఇచ్చిన నోటిఫికేషన్‌లకు ఇప్పటి ఎస్సీ వర్గీకరణ వర్తించదని, ఏదైనా చేయాలని చూస్తే న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయని ఆయన వివరించారు. తాను వర్గీకరణ చేస్తే ఎలా అన్యాయం జరిగిందని ఆయన నిలదీశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నారో తనకు తెలియదని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రాజెక్టుల మీద లోన్ తీసుకొచ్చి అభివృద్ధి చేస్తాం
కులగణన ప్రభావమే అన్ని పార్టీలు బిసిలకు టికెట్లు ఇచ్చాయన్నారు. హరీష్‌రావు మోసం వల్లే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓడిపోయామని ఆయన విమర్శించారు. బిఆర్‌ఎస్ వాళ్లు మూసేసిన ధర్నా చౌక్ తాము తెరిచామన్నారు. విమర్శలు చేస్తే పరిశీలించుకుంటామని సలహాలు ఇస్తే తప్పకుండా స్వీకరిస్తామని సిఎం రేవంత్ వెల్లడించారు. ప్రాజెక్టుల మీద లోన్ తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని సిఎం రేవంత్ చెప్పారు. ప్రాజెక్టులన్ని బడ్జెట్ పరిమితిలో ఉంటాయన్నారు. ఎస్‌ఎల్‌బిసి టన్నెల్ సహాయక చర్యలు వీలైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు.