‘ఎ వార్ ఆఫ్ లవ్’ సినిమా తీస్తున్నట్టు
ప్రకటన ఎంఎల్‌సి అభ్యర్థుల
ప్రకటన షాక్‌కు గురిచేసింది,
ఎందుకో సమయం వచ్చినప్పుడు
చెబుతానన్న కాంగ్రెస్ నేత
రాజకీయాలతో పాటు
సినిమాల్లోనూ కొనసాగుతానని
ప్రకటన
మనతెలంగాణ/హైదరాబాద్: ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన తనను షాక్‌కు గురిచేసిందని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. పొలిటికల్ మైండ్ బ్లాక్‌లో ఉన్నానని ఆయన తెలిపారు. సోమవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ తాను ఎందుకు షాక్ అయ్యానో సమయం వచ్చినప్పుడు చెబుతానని ఆయన పేర్కొన్నారు. తాను రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోరానని, కుసుమకుమార్‌కు ఎమ్మెల్సీ ఇవ్వాలని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెప్పానని, ఇదే విషయం హైకమాండ్‌కు కూడా చెబుతానని ఢిల్లీకి వచ్చినట్లు జగ్గారెడ్డి వెల్లడించారు. అంతేకాదు ఇప్పుడు తాను ఎవరినీ నిందించదలుచుకోలేదని గెలుపోటములను సమానంగా స్వీకరిస్తానని, అందుకే నిత్యం సంతోషంగా ఉంటానని జగ్గారెడ్డి పేర్కొన్నారు. తన పాత్రలో తానే నటిస్తూ సినీ రంగ ప్రవేశం చేస్తున్నానని జగ్గారెడ్డి ప్రకటించారు. తన పేరుతోనే జగ్గారెడ్డి – ‘ఎ వార్ ఆఫ్ లవ్ ’ టైటిల్‌తో సినిమా తీస్తున్నట్టు ఆయన చెప్పారు. అదో ప్రేమ కథ చిత్రమని, అందులో ప్రత్యేక పాత్ర పోషించబోతున్నానని ఆయన వెల్లడించారు. మాఫియాను ఎదిరించి ఆడపిల్ల పెళ్లి చేసే వ్యక్తిగా తాను సినిమాలో కనిపిస్తానని ఆయన తెలిపారు.