Wednesday, March 12, 2025

వ్యూహాలకు భారత్ పదును పెట్టాలి

- Advertisement -
- Advertisement -

తన వాణిజ్య అవసరాల కోసం, దూరాభారాన్ని తగ్గించడం కోసం ఎప్పుడో అమెరికా నిర్మించిన పనామా కాలువను ఇప్పుడు అమెరికా తన ఆధిపత్యంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నది. తనవి కాని భూభాగాలను స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నది. కాని భారత్ లాంటి దేశాలు మాత్రం న్యాయబద్ధమైన డిమాండ్లను సాధించుకోవడంలో అంతర్జాతీయ సమాజం అడ్డంకులు సృష్టిస్తున్నది. దాయాది దేశమైన పాక్ ఆక్రమిత భూభాగాలను భారత్ ఎందుకు స్వాధీనం చేసుకోలేకపోతున్నది? పాక్‌లోని కొన్ని ప్రాంతాల ప్రజలు కూడా తమను భారత్‌లో విలీనం చేసుకోవాలని అభ్యర్ధిస్తున్నా భారత్ ఎందుకు మిన్నకుంటున్నది? చైనా ఆక్రమించిన భూభాగాల విషయంలో కూడా భారత్ స్పందన పేలవంగా ఉంది.

ఇటీవల భారత్- చైనాల మధ్య జరిగిన చర్చల ఫలితంగా ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు కొంతవరకు తగ్గినా, డ్రాగన్‌ను విశ్వసించడం అంత శ్రేయస్కరం కాదు.ప్రస్తుత ప్రపంచ దేశాల్లో రష్యాకు మించిన మిత్రదేశం భారత్‌కు మరొకటి లేదు. అమెరికాను నమ్మితే అధోగతే అన్న విషయం ఇటీవల భారత్‌పై అక్కసుతో ట్రంప్ పెంచిన ప్రతీకార టారిఫ్‌లే నిదర్శనం. అఫ్ఘానిస్తాన్‌ను, ఉక్రెయిన్‌ను నట్టేట ముంచిన అమెరికాను విశ్వసించడం తగదు. ఇదే సందర్భంలో భారత్ తన రక్షణ వ్యవస్థను శత్రుదుర్భేద్యంగా మార్చుకోవాలి. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో భారత్ తన దౌత్యనీతికి పదునుపెట్టాలి.

వాణిజ్య, రక్షణ వ్యూహాలను పటిష్టం చేసుకోవాలి. భారతదేశం శాంతికాముక దేశంగా పేరుగాంచిన మాట వాస్తవం. శాంతి, సహనం, మానవీయ విలువలు భారతీయ సమాజంలో అంతర్లీనంగా ఇమిడిఉన్నాయి. హింసతో సాధించేదేమీ లేదనే సత్యం మన పూర్వీకులు ఏనాడో గుర్తించారు. ధర్మం దారి తప్పిన నాడు హింస చెలరేగి మానవజాతి అంతమవుతుందని ఎన్నో ధర్మ ప్రవచనాలు చాటి చెబుతున్నాయి. అహింసను నమ్మిన ఎంతో మంది రాజులు రక్తం పాతం లేని ద్వంద్వ యుద్ధాలతో రాజ్యాలను కైవసం చేసుకునేవారు. యుద్ధానికి భారతదేశం ఎప్పుడూ వ్యతిరేకమే. అశోకుని ధర్మపథం, బుద్ధుని శాంతి వచనాలు భారత ప్రజల, పాలకుల నరనరాన జీర్ణించుకుపోయాయి.

ఈ విధమైన ధోరణి అఖండ భారతాన్ని ఛిన్నాభిన్నం చేసింది. మన మీద దండెత్తి, మన దేశాన్ని ఆక్రమించుకుని, శతాబ్దాల తరబడి భారత ప్రజలను హింసించినా, శాంతి మంత్రం పఠించిన ఫలితంగానే ఇతర దేశాలు భారత్ చర్యలను అసమర్థతగా భావించాయి. చైనాతో యుద్ధం, పాక్‌తో యుద్ధం, బంగ్లాదేశ్ విమోచన కోసం యుద్ధం, ఉగ్రవాదంతో యుద్ధం ఇలా అనేక రకాల అలజడులతో, అశాంతితో భారత్ అన్ని రకాలుగా నష్టపోయింది. మన శాంతి ప్రవచనాలు దేశాన్ని సుదీర్ఘ కాలం అతలాకుతలం చేశాయి. భారతదేశం అనేక దండయాత్రలకు గురైనది. పంచశీల సూత్రాలను తుంగలో తొక్కి చైనా భారత్‌పై యుద్ధానికి దిగి, భారత్‌కు చెందిన భూభాగాలను ఆక్రమించింది. ఇప్పటికీ భారత్‌పై అక్కసు వెళ్ళగక్కుతూనే ఉంది.

భౌగోళిక చిత్రపటాలను మార్చడం, అరుణాచల్‌ప్రదేశ్‌లోని కొన్నిగ్రామాల పేర్లు మార్చడం, ఈశాన్యరాష్ట్రాల్లో అప్రకటిత యుద్ధాన్ని ప్రకటించడం చైనాకు పరిపాటిగా మారింది. భారత్‌తో వేలాది కి.మీ సరిహద్దును పంచుకుంటున్న చైనా, దాయాది దేశమైన పాక్‌ను మచ్చిక చేసుకుని ఎకనామిక్ కారిడార్ నిర్మించడం, ఈ క్రమంలో భాగంగా సింధునది పై పాక్ ప్రాజెక్టులకు చైనా నిధులు సమకూర్చడం భారత ప్రయోజనాలను దెబ్బతీస్తుంది. భారత రక్షణకు ముప్పువాటిల్లుతుంది. ఇది ముమ్మాటికీ భారతదేశసమగ్రతకు భంగకరం. సింధు నదీజలాల ఒప్పందం భారత్-పాక్‌ల మధ్య 1960లో కుదిరిన నీటి పంపిణీకి సంబంధించిన ఒప్పందం. ఈ ఒప్పందంపై అప్పటి భారత ప్రధాని నెహ్రూ, పాక్ అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్‌లు సంతకాలు చేయడం జరిగింది.

ఈ ఒప్పందంపై ఇప్పటి ప్రపంచ బ్యాంకుగా పిలుస్తున్న అప్పటి ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్‌స్ట్రక్షన్ అండ్ డెవలప్‌మెంట్ (ఐఆర్‌బి డి) మధ్యవర్తిగా వ్యవహరించింది. ‘ఇంటర్ వాటర్ ట్రీటి (నిబంధనలకు అనుగుణంగా భారత్ నిరాటంకంగా పాకిస్థాన్‌కు గత 64 సంవత్సరాలకు పైబడి నీటిని సరఫరా చేస్తున్నది. సింధునది చైనా ఆధిపత్యం కింద నలిగిపోతున్న టిబెట్‌లోని మానస సరోవరం వద్ద పుట్టి కేవలం 8 శాతం చైనాలో ప్రవహిస్తూ, అత్యధిక శాతం నీరు పాక్‌కు తరలిపోతున్నది. భారత ఉపఖండంలో అత్యంత పొడవైన నదిసింధు. ఇది పాక్ ప్రజల జీవనాడిగా ప్రసిద్ధి గాంచింది. పాకిస్తాన్ లో సుమారు 90% సాగునీరు, విద్యుత్ అవసరాలను సింధునది తీరుస్తున్నది. మారుతున్న పరిణామాల నేపథ్యంలో పాక్‌ను కట్టడి చేయడంలో ప్రపంచ దేశాల సహకారాన్ని తీసుకుంటూనే, మరో వైపు పాక్ తెంపరితనాన్ని అణచడానికి భారత్ తనకున్న మార్గాలను అన్వేషించాలి.

సింధు నదీ జలాల పంపిణీ పై గతంలో జరిగిన ఒప్పందాన్ని సమీక్షించాలి. భారత్ గుండా ప్రవహిస్తూ, పాకిస్తాన్ భూభాగాలను సస్యశ్యామలం చేస్తూ, పాక్‌కు బహు విధాలుగా ఉపయోగపడే సింధు నదీ జలాలను అడ్డుకుంటే పాకిస్తాన్ మొత్తం ఎడారిగా మారిపోతుంది. విద్యుచ్ఛక్తి నిలిచిపోతుంది. యావత్ దేశం అల్లకల్లోలమైపోతుంది. అయితే ఇప్పటి వరకు పాక్‌తో ఎన్ని యుద్ధాలు జరిగినా, ఉగ్రవాదుల ఊచకోతకు భారతపౌరులు, జవాన్లు ప్రాణాలను కోల్పోయినా, భారత్ మాత్రం భూభాగం నుండి పాక్ వైపు ప్రవహిస్తున్న సింధు నదీ ప్రవాహాన్ని నిలువరించ లేదు. ఇది భారతదేశం ప్రదర్శిస్తున్న మానవత్వానికి, సహనానికి మచ్చుతునక. అయితే సహనం హద్దులు దాటినప్పుడు దండోపాయమే శరణ్యం.

సింధు నదీ జలాల ఒప్పందానికి భారత రాష్ట్రపతి ఆమోద ముద్ర పడలేదనే కథనాలు వెలువడుతున్నాయి.అయితే ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే అంతర్జాతీయ న్యాయ స్థానం అంగీకరిస్తుందా? అనే అనుమానం ఉంది. పాక్, చైనాలు భారత్‌తో చేసుకున్న ఒప్పందాలను ఉల్లంఘించడంలో లేని అభ్యంతరం ఇండియా ఉల్లంఘిస్తే తప్పేమిటి? అగ్రదేశాలు అంతర్జాతీయ ఒప్పందాలకు కట్టుబడే ఉంటున్నాయా? అంతర్జాతీయ న్యాయస్థానం అగ్రరాజ్యాలను అదుపులో ఉంచగలుగుతుందా? భారత్ తన దేశ శ్రేయస్సును ఆశించి సింధు జలాల పంపిణీపై పునరాలోచన చేస్తే తప్పేంటి? పాక్‌కు సింధునదీ జలాల పంపిణీ నిలుపుదల గురించి సాధ్యాసాధ్యాలను భారత్ కూలంకషంగా అధ్యయనం చేయాలి. పాక్ ఆక్రమిత కశ్మీర్ విషయంలోను, భారత్ భూభాగాల విషయంలో చైనా ప్రదర్శిస్తున్న వైఖరి విషయంలోనూ భారత్ తన వ్యూహాన్ని మార్చుకోవాలి.

-సుంకవల్లి సత్తిరాజు.
(సామాజిక విశ్లేషకులు,మోటివేషనల్ స్పీకర్)
మొ:9704903463.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News