భావితరానికి పునాదిరాయిగా ఉండాల్సిన బాల్యం దుర్భరమైన పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోంది. గడపదాటిన బాల్యం వీధుల్లో మురికివాడల్లో దినమొక గండంగా జీవనం సాగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 15 కోట్లు, దేశవ్యాప్తంగా 20 లక్షల మంది పిల్లలు వీధుల్లో జీవనం సాగిస్తున్నట్లు అంచనా. వీరంతా రైల్వే ప్లాట్ఫావ్ులు, బస్స్టాండ్లు, మురికివాడలు, ఫుట్‌పాత్‌లపై నివసిస్తున్నారు. చెత్త ఏరుకోవడం, చిన్నాచితక ఫుట్‌పాత్ పనులు చేయడం వీరికి అత్యంత సాధారణ జీవనోపాధిగా మారింది. 72 % మంది పిల్లలు ఆరేళ్ల పైబడి ఉండి, బాల కార్మికులుగా కొనసాగుతున్నారు. అశుభ్ర వాతావరణంలో జీవనం సాగిస్తుండటంతో తరచుగా అనారోగ్యానికి గురవుతుండటం, ఆకలిని ఎదుర్కొంటూ పోషకాహార లోపంతోఉంటున్నారు.
న్యూఢిల్లీ, కోల్‌కతా, ముంబై వంటి నగరాల్లోని వీధులు మురికివాడలు ఇందుకు అద్దంపడుతున్నాయి. వ్యూహాత్మక కారణాలవల్ల తమ కుటుంబాలను, ఇళ్లను విడిచి వీధుల్లోకి చేరుతున్నారు. కుటుంబ సమస్యలతో 39.1%, పేదరికం కారణంగా 20.9%, నగరాన్ని చూడాలని వచ్చి తప్పిపోయినవారు 3.6% మంది పిల్లలు వీధిబాలలుగా గుర్తించినట్లు పలు సర్వేలు వెల్లడించాయి. మన రాష్ర్టంలో సుమారు 34,037 మంది వీధిబాలలను మహిళా శిశు సంక్షేమశాఖ, పోలీసు, ఇతర శాఖల సమన్వయంతో గుర్తించారు. చదువుకోవాల్సిన వయసులో భిక్షాటన, వీధుల్లో వస్తువులు అమ్ముకోవడం, రోడ్ల పక్కన దుకాణాల్లో పనిచేయడం, కూలిపని, మోటార్ మెకానిక్ షెడ్డుల్లో, హోటల్స్ ఉపాధి మార్గాలుగా ఉన్నాయి.
జీవన సంగ్రామ ప్రాంగణంలో అలుపెరగని సమరం సాగిస్తున్న వీధి బాలల మనసులు తడితే ఎన్నెన్నో కథలు.. మరెన్నెన్నో విషాదగాథలు. తల్లిదండ్రుల ప్రేమానురాగాలకు నోచుకోలేక విధివంచితులుగా మిగిలినవారు, కన్నతల్లి మరణిస్తే రెండో పెళ్ళిచేసుకున్న తండ్రిపై ద్వేషంతో విశాల ప్రపంచంలోకి అడుగుపెట్టినవారు, తల్లెవరో, తండ్రెవరో తెలియని దయనీయ స్థితిలో గాలికీ, ధూళికీ పెరుగుతున్న అభాగ్యజీవులు.. ఇలా ఎందరో పిల్లలు సరైన దిశాదర్శనం లేక మొగ్గలోనే వాడిపోతున్న జీవితాలకు సంకేతాలుగా మిగిలిపోతున్నారు. మన దేశంలో ప్రతి 18 మంది పిల్లల్లో ఒకరు కార్మికుడని గణాంక వివరాలు చెబుతున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లోని 28% మంది పిల్లలు విద్యాబుద్ధులకు నోచుకోవడం లేదు.
కొవిడ్ కారణంగా ‘లాక్ డౌన్’లో ఉన్న సమయంలో వీరి పరిస్థితి మరింత అధ్వానంగా ఉండింది. ఈ దశలో అందరూ కేంద్ర ప్రభుత్వంవైపు ఆశగా చూసినప్పటికీ, ‘అసలు వాళ్ళంతా ఏ రాష్ట్రాలవారు, వాళ్ళు ఎక్కడికి వలస వెళ్లి ఏమి చేస్తున్నారు, గణాంకాలు ఏవీ తమ వద్ద లేవు’ అని ప్రభుత్వం పార్లమెంట్‌లోనే తన నిస్సహాయతను వ్యక్తం చేసింది. దీంతో ఆ పిల్లల ఉనికి ప్రశ్నార్థకంగా మారడం, చాలా మంది మరణించడం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. అదలావుండగా, వీధిబాలలు వీరి నిస్సహాయత చవకైన కూలీలుగా మారి కొంతమందికి లబ్ధి చేకూర్చుతోంది. వీధిబాలల సంరక్షణ, భద్రత, పునరావాసం కోసం జాతీయ బాలల హక్కుల సంరక్షణ కమిషన్ (ఎన్సిపిసిఆర్) రూపొందించిన ప్రామాణిక విధివిధానాలను అమలు చేయాలని, బాలస్వరాజ్ పోర్టల్లలో నమోదైన పిల్లలను రక్షించడానికి, పునరావాసం కల్పించడానికి చర్యలు తీసుకోవాలంటూ సుప్రీం కోర్టు కూడా ఆదేశించింది.
వీధి బాలలను ఆశ్రయ కేంద్రాలకు తరలించడంకన్నా వారి కుటుంబాలతో కలిపేందుకు ప్రయత్నించాలని, వారికి అవసరమైన సంరక్షణ, భద్రతను అందజేయాలంటూ నిబంధనలు సూచిస్తున్నప్పటికీ ఆయా రాష్ట్రాలు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు తదితర వర్గాల మధ్య సమన్వయం లేకపోవడంతో వీధి బాలల జీవితం ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్నట్లుగా మారింది. ఏ రోజుకు ఆ రోజు పనిచేస్తేనే గానీ కడుపు నిండని వీధి బాలలు చెత్త ఏరుకోవడం, భిక్షాటన, కూడళ్ల వద్ద వస్తువులు అమ్మడం వంటి ఉపాధి మార్గాలను ఎంచుకుంటున్నారు. మరి కొంతమంది దళారుల ఉచ్చులో చిక్కుకుని మత్తుపదార్థాలు, మాదకద్రవ్యాలను దొంగచాటుగా విక్రయిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.
విధి నిర్వహణలో భాగంగా శక్తినిమించిన పనులు చేయడంతో గాయాల పాలవడం, అనారోగ్యం వంటి సమస్యలు తరచుగా తలెత్తుతున్నాయి. దీనికితోడు అపరిశుభ్రతమైన వాతావరణంలో జీవనం సాగిస్తుండడంతో దీర్ఘకాలిక వ్యాధుల బారినపడుతున్నారు. చాలా మంది పిల్లలకు జనన, కుల, కుటుంబ ఆదాయ ధ్రువీకరణ గుర్తింపు వంటి పత్రాలు లేకపోవడంతో విద్య, సాంఘిక సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందలేకపోతున్నారు. ఈమేరకు ప్రభుత్వం పలు విధానాలు రూపొందించినప్పటికీ వీటిపై ఈ పిల్లలకు అవగాహన లేకపోవడంతో వాటిని అందుకోలేకపోతున్నారు.
ఇంటికి, తల్లిదండ్రులకు దూరమైన పిల్లల జీవితం దాదాపుగా వీధుల్లోనే ముగుస్తుండటం బాధాకరమైన విషయం. మురికివాడల స్వరూపాన్ని మార్చే లక్ష్యంతో ‘భిన్నత్వంలో ఏకత్వం’ అనే నినాదంతో ముందుకు వచ్చిన ప్రభుత్వాలు, సురక్షితమైన సమ్మిళిత సమాజాన్ని నిర్మించడంలో విఫలమయ్యాయి.దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వలసల సంఖ్య రెట్టింపైంది. చట్టవిరుద్ధ్దంగా ఆక్రమించబడిన ప్రభుత్వ భూములు, ఫుట్‌పాత్‌లపై గుడిసెలు వేసుకుని జీవిస్తున్న కుటుంబాల సంఖ్య పెరిగింది. దీంతో మురికివాడలు పెరిగిపోయాయి. దోపిడీ, భిక్షాటన, మాదకద్రవ్యాల విక్రయం వంటి కార్యకలాపాలు కుటుంబాలకు ఆర్థికసాయంగా నిలుస్తోంది.
ఈ ప్రమాదకర ఉపాధిమార్గాలు పిల్లల్లో నేరపూరిత మనస్తత్వాన్ని పెంచుతున్నాయి. క్రమంగా లైంగిక హింసకు బాధితులుగా మారుతున్నారు. ఈ సమస్యలను పరిష్కరించడానికి ‘బేటీ బచావో బేటీ పడావో’ వంటి విధానాలను జువెనైల్ చట్టం వంటి చట్టపరమైన రక్షణలతో అనుసంధానించడం అవసరం. మురికివాడ ప్రాంతాలకు అనుగుణంగా ఈ విధానాల పరిధిని విస్తరించాలి. మురికివాడల పిల్లలజీవితాలను మార్చడం ద్వారా నిజమైన, దీర్ఘకాలిక మార్పును ఆశించవచ్చు. మురికివాడల పిల్లలను పోషకాహార లోపం, దోపిడీల బారినుంచి రక్షింపబడాలి. స్థిరమైన సామాజిక మార్పుకోసం అట్టడుగువర్గాల మద్దతు ఎంతో అవసరం. పిల్లల రక్షణకోసం వ్యక్తులు, సంస్థలు ముందుకు రావాలి.
– కోడం పవన్ కుమార్- 98489 92825