ఛండీగఢ్: ఓ పరీక్షలో ఓ ప్రశ్న పంజాబ్‌లో అధికార ఆప్, విపక్ష బిజెపిల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. మార్చి 4వ తేదీన పంజాబ్ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు నిర్వహించిన 12వ తరగతి పొలిటికల్ సైన్స్ పరీక్షలో ‘ఆమ్ ఆద్మీ పార్టీ ఎప్పుడు స్థాపించారు. దాని విధివిధానలు ఏంటి?’ అనే ప్రశ్నను అడిగారు.
ఇదికాస్త బయటకు రావడంతో బిజెపి నేతలు మండిపడుతున్నారు. చిన్నతనం నుంచే విద్యార్థులను ప్రభావితం చేసేలా ఈ ప్రశ్నలు ఉన్నాయని బిజెపి మండిపడింది. 2027 ఎన్నికలకు యువ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం ఇది అని బిజెపి నేత వినీత్ జోషీ అన్నారు. ఆఫ్ గురించి ప్రశ్న అడిగారు అంటే.. విద్యార్థులకు అలాంటి పాఠాలే బోధించారని అర్థమవుతోందని ఆయన ధ్వజమెత్తారు. ఆప్ నేతలు తమ రాజకీయ వ్యూహాలకు విద్యావ్యవస్థను ఉపయోగించుకుంటున్నారని.. ఆయన మండిపడ్డారు. పంజాబ్‌లో అమలు చేస్తున్న విద్యావిధానం ఇదేనా అని ప్రశ్నించిన జోషి.. పార్టీ గురించి ప్రశ్న అడగాలి అంటే.. బిజెపి ఆవిర్భావం గురించి.. ఇప్పటివరకూ తమ పార్టీ చేసిన దాని గురించి అడిగితే బాగుండేది అని అన్నారు. 18 ఏళ్ల కంటే తక్కువ వయసున్న యువకులను ఓటర్ జాబితాలో చేర్చడమే అధికార పార్టీ లక్ష్యమని ఆరోపించారు.
అయితే దీనిపై ఆప్ కూడా గట్టి జవాబు ఇచ్చింది. ప్రశ్నపత్రాన్ని ముఖ్యమంత్రి కానీ, విద్యాశాఖ మంత్రి కానీ తయారు చేయరు అని ఆప్ తెలిపింది. రాజకీయకు సంబంధించిన ప్రశ్నలు అడిగితే తప్పేంముంది అని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి అమన్ అరోరా ప్రశ్నించారు.