స్వాతంత్య్రం వచ్చిందని చెబుతున్న దగ్గర నుండి యువత ప్రధానంగా ఎదుర్కొంటున్న ఉద్యోగ, ఉపాధి కల్పనలో పాలక ప్రభుత్వాలన్నీ ఉద్దేశ పూరిత వైఫల్యం చెందాయి. గ్రామీణ ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ప్రజల అవసరాలను తీర్చే ఉత్పత్తి పరిశ్రమలను నెలకొల్పకుండా, సామ్రాజ్యవాద దేశాల పరిశ్రమలకు కావాల్సిన ముడి వస్తువులను, చిన్నచిన్న యంత్రాలను తయారు చేసే పరిశ్రమలు, సామ్రాజ్యవాద దేశాల ప్రయోజనాలకు అనుగుణమైన కొన్ని బడా పరిశ్రమల స్థాపన అనే విధానాలు నేటికీ అమలు జరుపుతూ వస్తున్నాయి. ఫలితంగా పారిశ్రామిక అభివృద్ధ్దిలోనూ, ఉద్యోగ, ఉపాధి కల్పనా వైఫల్యంలో దేశం కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి ఏర్పడింది.
ఎన్నికల ప్రచారంలో పాలక పార్టీలు, ఏర్పడిన ప్రభుత్వాలు దేశంలో నిరుద్యోగ, ఉపాధి సమస్యను పరిష్కరించి యువతకు మంచి భవిష్యత్తును అందించేందుకు, ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పే మాటలు, మాటలకే పరిమిత కాగా, నిరుద్యోగం మాత్రం పెరుగుతూనే ఉన్నది. జీవితం వెడల యువతలో నిరాశ, నిస్పృహలు మాత్రం పెరుగుతూ ఉన్నాయి. పాలకుల విధానాల వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తగ్గటంతో నిరుద్యోగ శాతం పెరుగుతూ ఉంది. 1980లో ప్రపంచ బ్యాంక్ డేటా ప్రకారం నమోదు అయిన నిరుద్యోగ రేటు 2.8% గా ఉంది. అందుకు కారణం ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయ రంగంలో ఉపాధి పొందటమే కారణమని పేర్కొంది.
1990లో సరళీకరణ ఆర్థిక విధానాల కాలంలో కార్మిక మార్కెట్లో తీవ్ర మార్పులు జరిగాయి. సరళీకరణ ఆర్థిక విధానాల ద్వారా సృష్టించబడిన పరిస్థితులు గ్రామీణ ప్రాంతం నుండి ప్రజలు ఉపాధి కోసం నగరాలకు వలసలు పోయేలా చేసింది. అంతే కాకుండా నిరుద్యోగ రేటు 2.8% నుంచి 6%కి పెరిగింది. నేషనల్ శాంపిల్ సర్వే, గణాంకాల కార్యక్రమాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన కార్మిక శక్తి సర్వేల ప్రకారం 2009- 10లో ఉపాధి రేటు 39.2% నుండి 2011 -12లో 36.6% కి పడిపోయింది. 2013-2014లో 5.42 % గా ఉన్న నిరుద్యోగం కరోనా పరిస్థితుల కారణంగా 2020లో 8% కాగా, 2022లో 7.33% తగ్గి, 2023లో 8.4% పెరిగింది. 2024 మే నాటికి 6.3 శాతంగా ఉన్న నిరుద్యోగం అదే సంవత్సరం జూన్ నాటికి 9.2 శాతానికి పెరిగింది. పట్టణ ప్రాంతాల కన్నా గ్రామీణ ప్రాంతంలో నిరుద్యోగం ఎక్కువగా ఉంది.
గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా పట్టణ ప్రాంతాలలో కూడా నిరుద్యోగం పెరుగుతూ ఉంది. 2024 మే లో 8.6% ఉండగా, జూన్ నాటికి 8.9% కి పెరిగింది. దేశవ్యాప్తంగా మహిళల విషయం చూస్తే పట్టణ ప్రాంతంలో 21.36% ఉంటే, గ్రామీణ ప్రాంతంలో 17.1% నిరుద్యోగులుగా ఉన్నారు. 48.6% మహిళల నిరుద్యోగులతో జమ్మూ-కశ్మీర్ మొదటి స్థానంలో ఉండగా, కేరళ 46.6%తో రెండవ స్థానంలో ఉంది. 39.4% తో ఉత్తరాఖండ్ మూడవ స్థానంలో, 35.9%తో హిమాచల్‌ప్రదేశ్‌లు కొనసాగుతున్నాయి. పురుష నిరుద్యోగంలో కూడా 24.3% తో కేరళ మొదటి స్థానంలో ఉండగా, తర్వాత స్థానాలు ఒడిశా, రాజస్థాన్, హిమాచల్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలు ఉన్నాయి.భారతదేశంలో నిరుద్యోగం తాండవిస్తున్నదని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఒ), మానవాభివృద్ధి సంస్థ (ఐ హెచ్‌డి) సంయుక్త అధ్యయనం వెల్లడించింది.
‘భారత నిరుద్యోగ నివేదిక 2024లో పలు కీలక విషయాలను వెల్లడించింది. ఆ నివేదికను కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు (సిఇఎ) వి. అనంత నాగేశ్వరన్ విడుదల చేశారు. ఈ నివేదిక చదువుకున్న యువత ఉద్యోగాలు లేక నిస్సహాయ స్థితిలో ఉన్నారని తెలిపింది. 2022 నాటికి దేశంలోని మొత్తం నిరుద్యోగుల్లో 83% యువకులేనని నివేదిక పేర్కొంది. దేశం మొత్తం నిరుద్యోగుల్లో చదువుకున్న యువత 2000 సంవత్సరం నాటికి 54.2 % ఉండగా, 2022 నాటికి 67.7% కి పెరిగింది. ఇది దేశానికి తీవ్ర సమస్యగా మారిందని నివేదిక చెప్పింది. ప్రస్తుతం నిరుద్యోగులైన యువ విద్యావంతుల్లో మహిళలు 67.7% ఉంటే, పురుషులు 62.2 శాతంగా ఉన్నారని నివేదించింది.
ఇవన్నీ చెబుతూనే నిరుద్యోగాన్ని తగ్గించటంలో ప్రభుత్వాలే అన్నీ చేయలేవని నాగేశ్వరన్ చెప్పటం మోడీ ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నం చేయటమే. భారత రాజ్యాంగంలో పని చేయగలవారికి ఉద్యోగ, ఉపాధి కల్పించటం ప్రభుత్వాల బాధ్యతగా పేర్కొంది. ఉద్యోగ కల్పనను ప్రభుత్వాలే పూర్తిగా చేయలేవని నాగేశ్వరన్ చెప్పటం రాజ్యాంగ విరుద్ధం కాదా! ప్రభుత్వమే బాధ్యత వహించి పబ్లిక్, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు కల్పించి ఉద్యోగుల, కార్మికుల హక్కులను పరిరక్షించాల్సింది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే. అందుకు విరుద్ధంగా మోడీ ప్రభుత్వం నాలుగు కార్మిక చట్టాల పేరుతో, కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను హరించి, వారిని పారిశ్రామికవేత్తలకు బానిసలను చేయచూస్తున్నది. 2014లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని మోడీ నాయకత్వాన ఉన్న ఎన్‌డిఎ కూటమి వాగ్దానం చేసింది.
మోడీ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వ పాలనకు 10 సంవత్సరాల, 9 నెలలు గడిచి పోయింది. ఎన్‌డిఎ వాగ్దానం ప్రకారం 20 కోట్లకు పైగా ఉద్యోగాలు కల్పించాలి. చేసిన వాగ్దానం ప్రకారం ఉద్యోగాలు కల్పించకపోగా, గత ఐదు సంవత్సరాల్లో 12 కోట్ల ఉద్యోగాలను మోడీ ప్రభుత్వం తీసివేసింది. ఉపాధి కల్పించానని చెప్పుకుంటున్న దానిలో కూడా సగం మంది యువత స్వయం ఉపాధి ద్వారానే ఉపాధి పొందారు. 2012తో పోల్చుకుంటే మోడీ పాలనలో నిరుద్యోగం మూడు రెట్లు పెరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నిరుద్యోగం తీవ్రంగానే ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగంతో యువత కొట్టుమిట్టాడుతున్నారు. డిగ్రీ, పిజి, ఇంజనీరింగ్ చేసిన యువత ఉద్యోగాలు లేక అల్లాడుతున్నారు. 2024 మే నెలలో లేబర్ బ్యూరో విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పిఎల్‌ఎఫ్‌ఎస్) గణాంకాలు ఈ వాస్తవాన్ని వెల్లడించాయి.
రాష్ట్రంలో నిరుద్యోగ రేటు 17.5% నమోదు అయిందని సర్వే గణాంకాలు తెలిపాయి. ఇందులో పురుషుల నిరుద్యోగం 16.4% కాగా, మహిళల నిరుద్యోగం 19.7% గా నమోదు అయింది. నిరుద్యోగంలో ఎపి 10వ స్థానంలో ఉంది. మూడు పార్టీల కూటమి అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చి 1 0నెలలు గడిచినా ఎటువంటి ఉద్యోగాలు భర్తీ చేయలేదు. ఉద్యోగాలు భర్తీ చేయకపోగా, 2 లక్షల 60 వేల మంది వాలంటీర్లకు ఉపాధిని దూరం చేసింది. బేవరేజ్ కార్పోరేషన్‌లో పని చేసే 20 వేల మంది ఉద్యోగులను చంద్రబాబు ప్రభుత్వం తొలగించింది. తెలంగాణలోనూ నిరుద్యోగంతో యువత అల్లాడుతున్నారు. 2023 ఎన్నికల ప్రచారంలో 2 లక్షల ఉద్యోగాలు మొదటి ఏడాదిలో భర్తీ చేస్తానని కాంగ్రెస్ వాగ్దానం చేసింది. జాబ్ క్యాలెండర్ల హామీ ఇచ్చింది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా 2022 లెక్కల ప్రకారం తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగ రేటు 34%గా ఉంది. పట్టణ ప్రాంతంలో 65%గా ఉంది.
తెలంగాణ ఏర్పడిన 10 సంవత్సరాల్లో 60 లక్షల మంది నిరుద్యోగులుగా ఉన్నారు. చదువుకున్న 15-29 ఏళ్ల యువతలో ప్రతి నలుగురులో ఒకరు నిరుద్యోగులుగా ఉన్నారు. త్వరలో 35 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పే మాటలు కార్యాచరణలోకి రావటంలేదు. అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచినా రెండు లక్షల ఉద్యోగాల కల్పన ఆచరణలో విఫలమైంది. మోడీ నాయకత్వాన ఉన్న ఎన్‌డిఎ, తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్, ఎపిలో చంద్రబాబు నాయకత్వాన ఉన్న మూడు పార్టీల కూటమి యువత ఓట్లను పొందేందుకు ఉద్యోగ కల్పన అనే ఎరను ముందు పెట్టి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు కల్పించకుండా నిరుద్యోగ యువతను మోసం చేస్తూనే ఉన్నాయి.
నిరుద్యోగానికి, ఉపాధి లేమికి కారణమైన వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవటం లేదు. సమగ్ర భూ సంస్కరణలు అమలు జరిపి పేదలకు భూమి లభించినప్పుడే గ్రామీణ నిరుద్యోగం తగ్గుతుంది. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ప్రజల అవసరాలకు అనుగుణమైన పారిశ్రామిక అభివృద్ధి జరగటం ద్వారా దేశంలో నిరుద్యోగ సమస్య అదుపులోకి వస్తుంది.ఇలాంటి విధానాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకం. అందువల్లే దేశంలో నిరుద్యోగ సమస్య తగ్గటంలేదు. ఉద్యోగ, ఉపాధి కల్పనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నిరుద్యోగ యువత, గ్రామీణ, పట్టణ పేదలు దేశవ్యాప్తంగా సమైక్యంగా ఉద్యమించాలి.
– బొల్లిముంత సాంబశివరావు- 98859 83526