Wednesday, April 16, 2025

జలసంరక్షణ నీరుగారుతోంది!

- Advertisement -
- Advertisement -

జీవకోటికి నీరే ప్రాణాధారం.అందుకనే పంచభూతాల్లోనూ నీటికి ప్రాధాన్యమిచ్చారు. ఒకప్పుడు మంచినీటికి కొదవ ఉండేది కాదు. ఎక్కడబడితే అక్కడ జలసంపద సమృద్ధిగా అందుబాటులో ఉండేది. అందుకనే, ఎవరైనా డబ్బును దుబారా చేస్తుంటే మంచినీళ్లప్రాయంగా ఖర్చు చేస్తున్నాడని పెద్దలు కోపగించుకునేవాళ్లు. కానీ ఇప్పుడా నానుడికి కాలం చెల్లిందనే చెప్పాలి. ప్రస్తుత పరిస్థితుల్లో కష్టపడితే డబ్బు దొరకవచ్చేమో గానీ, ఒక గ్లాసెడు నీళ్లు దొరికే పరిస్థితి లేదంటే అతిశయోక్తి కాదు, ఈ దుస్థితి ఏ ఒక్క ప్రాంతానికో, దేశానికో పరిమితం కాదు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఇదే తీరు నెలకొని ఉంది.

ఇక వేసవి వచ్చిందంటే, దాహార్తితో నోరు పిడచ కట్టుకుపోతున్నా, తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా దొరకని వైనం కళ్లెదుట కనబడుతూనే ఉంది. మన దేశంలో భూగర్భ జలాల వినియోగం అత్యధికం. అందుకు తగినట్లుగా భూగర్భ జల మట్టాన్ని పెంచేందుకు చేపడుతున్న చర్యలు శూన్యం. ప్రపంచవ్యాప్తంగా భూగర్భ జలాల్లో 25 శాతం వినియోగం ఇండియాలోనే జరుగుతోంది. ఇది అమెరికా, చైనాల వినియోగంతో సమానమని ఇండియా వాటర్ పోర్టల్ గణాంకాలు ఘోషిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 65 శాతం నీటిపారుదల భూగర్భజలాల ద్వారానే జరుగుతోంది. గ్రామీణ నీటి సరఫరాలో 85 శాతం, పట్టణ నీటి సరఫరాలో 50 శాతం భూగర్భ జలాలపైనే ఆధారపడి కొనసాగుతున్నాయి.

వర్షాలు లేక, వర్షాలు పడినా వెర్రితలలు వేస్తున్న పట్టణీకరణ పుణ్యమాని ఆ నీరు భూమిలోకి ఇంకే మార్గం లేక భూగర్భ జలాల మట్టం నానాటికీ తీసికట్టు నాగంభొట్లు చందంగా మారుతోంది. నైరుతి రుతుపవనాల సమయంలో వర్షపాతం ఆశించినంతగా లేకపోవడం, శీతాకాలంలో ఉష్ణోగ్రతలు వేసవిని తలపించేలా ఉండటంవంటి కారణాలవల్ల వ్యవసాయానికి నీటి వినియోగం ఎక్కువై, భూగర్భ జలమట్టాలు పడిపోతున్నాయని హైదరాబాద్‌కు చెందిన నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్ జిఆర్‌ఐ) శాస్త్రవేత్తలు చేసిన ఒక అధ్యయనంలో తేలింది.అందుబాటులో ఉన్న భూగర్భ జలాలు సైతం తాగునీటి వినియోగానికి అనువైనవిగా లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

భూగర్భజలాలు సురక్షితం కాదని పలు సందర్భాల్లో శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనాల్లో తేలింది. సాధారణంగా లీటరు నీటిలో 1.5 మిల్లీగ్రాములకు మించి ఫ్లోరైడ్, 45 గ్రాములకు మించి నైట్రేట్ ఉంటే ఆ నీళ్లు తాగేందుకు పనికి రావు. కానీ దేశవ్యాప్తంగా 440 జిల్లాల్లో ఈ రసాయనిక పదార్థాలు పరిమితికి మించి ఎక్కువగా ఉన్నట్లు భూగర్భ జలాల ప్రామాణికత- 2024 వార్షిక నివేదిక హెచ్చరిస్తోంది. అంతెందుకు.. ఉభయ తెలుగు రాష్ట్రాలలోని అనేక ప్రాంతాల్లో భూగర్భజలాలు నైట్రేట్‌తో కలుషితమైనట్లు ఇదే నివేదిక కళ్లకు కట్టింది. ఇక భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ఐదో స్థానంలో ఉన్నట్లు తేలడాన్ని బట్టి, ఈ మహమ్మారి ముప్పు ఇంకా తప్పలేదని తెలుస్తోంది.

చెట్ల నరికివేతను, భూగర్భజలాల దుర్వినియోగాన్ని, ఇబ్బడిముబ్బడిగా సాగుతున్న బోర్ల తవ్వకాలను నిషేధించి, జలనిధులను పరిరక్షించే ఉద్దేశంతో సుమారు పాతికేళ్ల క్రితం రూపుదిద్దుకున్న వాల్టా చట్టం అమలులో నత్తనడక నడుస్తోంది. వాననీటిని భూగర్భంలోకి పంపి, జలమట్టాలను పెంచేందుకు ఉద్దేశించిన ఇంకుడుగుంతల తవ్వకాన్ని ప్రభుత్వాలు తప్పనిసరి చేసినా, పర్యవేక్షణ లోపంతో అసలు ఉద్దేశం నీరుగారుతోంది. వేసవి రాకముందే చేపట్టవలసిన చెరువుల పూడికతీత అటకెక్కింది. చెట్లు, వర్షాలు, భూగర్భజలాలు- ఈ మూడింటికీ గల అవినాభావ సంబంధాన్ని ప్రజలలోకి మరింత వేగంగా తీసుకువెళ్లేందుకు పాలకులు ప్రణాళికలు రచించకపోవడం కూడా ప్రస్తుత అనర్థాలకు ముఖ్య కారణంగా గోచరిస్తోంది.

చెట్లు లేని చోట వర్షాలు పడటం, వానలు లేనప్పుడు భూగర్భజలాలు పెరగడం దుర్లభం. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, హరిత వనాల పెంపకానికి ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. వర్షాకాలం ఆరంభంలో మొక్కల పెంపకాన్ని ఆర్భాటంగా చేపట్టే పాలకులు, ఆ తర్వాత సదరు మొక్కల పరిరక్షణపై దృష్టి సారించడం లేదు. వ్యవసాయానికి, గృహావసరాల వినియోగానికి నీటిని పొదుపుగా వాడుకోవడం ఎంతో ముఖ్యం. ఈ విషయమై ప్రజలను, ముఖ్యంగా నిరక్షరాస్యుల్ని చైతన్యవంతం చేసే కార్యక్రమాలు చేపట్టాలి. వీటిలో రైతులు, పరిశ్రమల యాజమాన్యాల్ని కూడా భాగస్వాముల్ని చేయాలి. వేసవి కాలం రాగానే హడావిడి చేసే నేతలూ, అధికార గణం ఏడాది పొడవునా నీటి సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు చేపట్టడం, వాల్టా చట్టాన్ని పటుతరంగా అమలు చేయడం వంటి చర్యలు చేపడితే వేసవిలో ప్రజలకు తిప్పలు తప్పుతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News