దుబాయ్: ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీకి ఈ ఏడాది ఆతిధ్యం ఇచ్చిన పాకిస్థాన్ టోర్నమెంట్‌లో మాత్రం చెత్త ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగి పాక్ లీగ్ దశలోనే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. ఇది పాకిస్థాన్ ఫ్యాన్స్‌ని తీవ్రంగా బాధించింది. ఇదే కాదు.. భారత జట్టు పాకిస్థాన్‌కు రామని తేల్చి చెప్పడంతో తప్పేది లేక వారి మ్యాచ్‌లను దుబాయ్‌లో నిర్వహించారు.
అయితే ఈ టోర్నమెంట్ ఆరంభం నుంచి అద్భుతంగా ఆడిన భారత్.. ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడింది. ఫైనల్స్‌లో కివీస్‌పై విజయం సాధించి 12 సంవత్సరాల తర్వాత ఈ ట్రోఫీని అందుకుంది. ఈ విజయంలో ప్రతీ ఒక్క భారత ఆటగాడు కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ విజయం తర్వాత టీం ఇండియా ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా ఓ ఆసక్తికర కామెంట్ చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు భారత్, పాకిస్థాన్‌కు ఎందుకు వెళ్లలేదని విలేకరి హార్థిక్‌ను ప్రశ్నించగా.. ‘పాకిస్థాన్ ఫ్యాన్స్ కూడా మేం వాళ్ల దేశంలో పర్యటించాలని కోరుకున్నారు. కానీ, అది జరుగలేదు. ఒక విషయం మాత్రం కచ్చితంగా చెప్పగలను. పాకిస్థాన్ నుంచి దుబాయ్‌కి వచ్చి మ్యాచ్‌లు చూసిన వాళ్లు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇక భారత జట్టు పాకిస్థాన్‌కు ఎందుకు వెళ్లలేదు అనేది నా స్థాయికి మించిన అంశం’ అని హార్థిక్ సమాధానం ఇచ్చాడు.