వాషింగ్టన్ : అమెరికా, కెనడా పరస్పరం 25 శాతం వరకు ప్రతీకార సుంకాలను విధించుకుంటున్నట్టు ప్రకటించుకుంటున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుంకాల విషయంలో కెనడా వైఖరిని తప్పుపడుతూ సుంకాల దుర్వినియోగదారుగా విమర్శించారు. “ ఒంటారియో ప్రీమియర్ మా రాష్ట్రాలకు విద్యుత్‌పై ఎగుమతి సుంకాలను 25 శాతం పెంచుతున్నట్టు ప్రకటించారు. విద్యుత్‌పై టారిఫ్‌లను ప్రకటించే అవకాశం కూడా ఆ దేశానికి లేదు. ఇకపై ఆ కెనడాకు అమెరికా సబ్సిడీ ఇవ్వబోదు. మాకు మీ కార్లు, కలప, శక్తి, విద్యుత్, ఇంధనం ఏవీ అవసరం లేదు. ఈ విషయాన్ని మీరు త్వరలోనే తెలుసుకుంటారు ” అని ట్రంప్ కెనడాను హెచ్చరించారు.
ప్రస్తుతం అమెరికాకు అత్యధిక ఇంధన ఎగుమతులు కెనడా నుంచే వెళ్తున్నాయి. కెనడాకు చెందిన ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులు, హైడ్రో పవర్, సహజవాయువు, ఎలక్ట్రిసిటీ పై అమెరికా ఆధారపడి ఉంది. కెనడా లోని ఒంటారియో ప్రీమియర్ డగ్‌ఫోర్డ్ ఇటీవల అమెరికాకు తీవ్ర హెచ్చరికలు చేశారు. అమెరికా తమపై సుంకాల విధింపును అమలు చేస్తున్న నేపథ్యంలో తాము కూడా ప్రతీకార సుంకాలు విధిస్తామని చెప్పారు. తమ దేశం ఆర్థికంగా దెబ్బతింటుంటే చూస్తూ కూర్చోబోమని తేల్చి చెప్పారు. “ కరెంట్ కోతలు విధిస్తాం. ఒంటారియోతో మస్క్ నేతృత్వం లోని స్టార్‌లింక్‌కు ఉన్న 100 మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని రద్దు చేస్తున్నాం. వారు మా ఇంధనంపై ఆధారపడ్డారు. కాబట్టి వాళ్లు కూడా నొప్పి భరించాలి. ట్రంప్ కెనడా ప్రజలను తక్కువ అంచనా వేస్తున్నారు. మా స్టోర్ల నుంచి ఆల్కహాలును తొలగించాలని యోచిస్తున్నాం ” అని పేర్కొన్నారు.