Wednesday, March 12, 2025

హామీలు అమలు కావని తెలంగాణ సిఎం అంగీకరించారు

- Advertisement -
- Advertisement -

కర్ణాటక అసెంబ్లీలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై చర్చ
మన తెలంగాణ/హైదరాబాద్ : గ్యారెంటీల అమలుకు నిధులు సమకూర్చడం ఎంత సవాలో ముఖ్యమంత్రి అయ్యాకే తెలిసొచ్చిందని మీ పార్టీకి చెందిన నేత, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారని కర్ణాటక బిజెపినేత ఆర్.అశోక్ తెలిపారు. కర్ణాటక అసెంబ్లీలో తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అంశం చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా విపక్ష నేత ఆర్. అశోక్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం రూ. 18 వేల కోట్లు పెన్షన్లు, వేతనాలకు చెల్లిస్తూ, గ్యారెంటీల వ్యయాన్ని మోయటం భారమేనని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి అంగీకరించారని వ్యాఖ్యానించారు.

కర్ణాటక ప్రభుత్వం తమ ఐదు గ్యారెంటీల అమలు కోసం సమితుల్లో కాంగ్రెస్ కార్యకర్తలను అధ్యక్షులుగా నియమించి వారికి కేబినెట్ హోదాను కల్పించింది. దీనిపై కర్ణాటక అసెంబ్లీలో బిజెపి విమర్శలు గుప్పించింది. ప్రభుత్వ పథకాల అమలుకు స్థానిక ఎంఎల్‌ఎలను నియమించకుండా, కాంగ్రెస్ పార్టీ సభ్యుల కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తోందని బిజెపి సభ్యుడు కృష్ణప్ప ఆరోపించారు. ఈ నేపథ్యంలో విపక్ష నేత ఆర్. అశోక్ స్పందిస్తూ తెలంగాణ గ్యారెంటీలపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. గ్యారెంటీలపై జాతీయస్థాయిలో చర్చ అవసరమని ఇటీవల ఓ మీడియా కాన్‌క్లేవ్‌లో రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారని గుర్తు చేశారు. గ్యారెంటీల అమలు కష్టమని రేవంత్ రెడ్డి చెబుతుంటే, రాష్ట్రంలోని (కర్ణాటక) మీ కార్యకర్తల కోసం గ్యారెంటీ అమలు పేరిట అయిదేళ్లలో రూ. 50 కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యారని మండిపడ్డారు. మరో బిజెపి సభ్యుడు సతీశ్ రెడ్డి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో గత వైసిపి ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుకు పార్టీ సభ్యులను నియమించి ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసిందని ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News