గతంలో విద్యార్థులు, ప్రజలు మృతిచెందితే వారిని
చూడడానికి కూడా వెళ్లలేదు
సిఎంగా రేవంత్ రెడ్డి పదేళ్లు ఉంటారు
మార్పు అనేది ప్రచారం మాత్రమే
చిట్‌చాట్‌లో రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: ఇన్నాళ్లూ ఫాంహౌజ్‌లో రెస్ట్ తీసుకున్న కెసిఆర్ అనర్హత వేటు పడుతుందనే నేడు అసెంబ్లీకి వస్తున్నారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మండిపడ్డారు. తూప్రాన్‌లో స్కూల్ బస్సు ప్రమాదం జరిగి విద్యార్థులు చనిపోతే సిఎం హోదాలో కనీసం పిల్లలని చూడటానికి కూడా కెసిఆర్ రాలేదని, అలాంటి కెసిఆర్‌కు ప్రభుత్వాన్ని, కాంగ్రెస్‌ను విమర్శించే హక్కు లేదని మంత్రి కోమటిరెడ్డి మండిపడ్డారు. ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ కెసిఆర్ దొంగ దీక్షలు చేశారన్నారు. కొండగట్టు బస్సు యాక్సిడెంట్ జరిగి ప్రజలు చనిపోతే కెసిఆర్ వెళ్లలేదని ఆయన ఆరోపించారు. కానీ, తన ఇంట్లో కుక్క చనిపోతే మాత్రం డాక్టర్‌ను వెంటనే సస్పెండ్ చేశారని ఆయన ఆరోపించారు. కెసిఆర్ తెచ్చిన అప్పులకు వడ్డీలు కడుతున్నామని ఆయన తెలిపారు.
10 ఏళ్లు తెలంగాణలో అధికారంలో ఉంటామని, రైతులకు బోనస్ ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. దేశంలో ఎవరూ ఇప్పటివరకు రూ.2 లక్షల రుణమాఫీ చేయలేదని ఆయన తెలిపారు. మోడీ రూ.15 లక్షలు ప్రజల అకౌంట్‌లో వేస్తామని, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినా ఇప్పటివరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. బిజెపి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదన్నారు. సిఎంగా రేవంత్ రెడ్డి పదేళ్లు ఉంటారని, మార్పు అనేది ప్రచారం మాత్రమేనని ఆయన తెలిపారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, రాష్ట్రంలో అందరూ ఇప్పుడు సన్న వడ్లు వేశారని ఆయన తెలిపారు.
ఒక్క నిజామాబాద్ రైతులకు సన్న వడ్లకు రూ.95 కోట్ల బోనస్ వచ్చిందని ఆయన అన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ అభ్యర్ధిని నిలబెట్టలేదని, బిజెపిని గెలిపించేందుకు అభ్యర్థిని నిలబెట్టలేదని ఆయన ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్, బిజెపి నేతలు కలిసి ప్రచారం చేశారని ఆయన అన్నారు. భవిష్యత్‌లో బిఆర్‌ఎస్ పార్టీ ఉండదని, బ్రహ్మ దేవుడు వచ్చినా ఆ పార్టీని కాపాడలేరని ఆయన తెలిపారు. బిసి కులగణనపై మాట్లాడే హక్కు కెసిఆర్, హరీష్ రావు, కెటిఆర్‌కు లేదన్నారు. కులగణనలో పాల్గొనని వారికి మాట్లాడే హక్కు ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు.